మహేష్ బాబుతో అనుకున్న సినిమా.. పవర్ ఫుల్ డైలాగ్ లీక్ చేసిన పూరి జగన్నాథ్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూరి జగన్నాథ్ లది సూపర్ హిట్ కాంబినేషన్. పోకిరి ముందు వరకు మహేష్ కెరీర్ ఒక స్థాయిలో ఉండేది. పోకిరి తరవాత మహేష్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రాల తర్వాత మహేష్ బాబుతో మరో చిత్రం చేయాలని పూరి జగన్నాథ్ ఎన్నో ప్రయత్నాలు చేసారు. కానీ అవి ఫలించలేదు. పూరి జగన్నాథ్ గతంలో అన్నౌన్స్ చేసిన జనగణమన చిత్రం కూడా మహేష్ కోసం రాసుకున్న కథే.

జన గణ మన
జనగణమన అనే పవర్ ఫుల్ టైటిల్ తో పూరి జగన్నాథ్ ఆ మధ్యన ఓ చిత్రాన్ని ప్రకటించాడు. మహేష్ తో తాను తెరకెక్కించబోతున్న హ్యాట్రిక్ మూవీ అని కూడా పూరి ప్రకటించాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు. పూరి వద్ద అలాగే మిగిలిపోయిన కథల్లో జనగణమన కూడా ఒకటి. టైటిల్ చూడగానే దేశభక్తి నేపథ్యంలో ఉండే కథ అని అర్థం అవుతోంది. పోకిరిలో మహేష్ లుక్ నే మార్చేసిన పూరి ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ లో డాన్ గా చూపించాడు. ఇక జనగణమన చిత్రంలో ఎలా చూపిస్తాడో అని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగియింది.
లీక్ చేసిన పూరి జగన్నాథ్
తాజాగా ట్విట్టర్ లో మహేష్ బాబు జనగణమన చిత్రంలోని డైలాగ్ అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. 'డచ్ ,ఫ్రెంఛ్ , బ్రిటిష్ .. ఎప్పుడూ ఎవడెవడో ఆక్రమించుకోవడమేనా ? ఆ పని మనమెందుకు చేయడం లేదు.. ఎప్పుడు ఈ ఇండియన్స్ మీద పడిపోతారో అని మిగతా దేశాలు భయపడుతూ చావాలి .. బలం తెలిసేది అటాక్ చేసినప్పుడే.. రక్షించుకున్నప్పుడు అని పూరి జగన్నాథ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ డైలాగ్ జనగణమన చిత్రంలోనిది అని తెలిపాడు.

ఉద్రిక్త పరిస్థితులు
ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పూరి జగన్నాథ్ ఈ డైలాగ్ ని పోస్ట్ చేశాడు. పుల్వామా ఘటనకు ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలని నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని అభినందిస్తూ పూరి జగన్నాథ్ పోకిరి చిత్రంలో డైలాగ్ తో ట్వీట్ చేశాడు. బులెట్ దింగిందా లేదా.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సెల్యూట్ అని ట్వీట్ చేశాడు.

ఇస్మార్ట్ శంకర్
ప్రస్తుతం పూరి జగన్నాథ్ హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వరుస ప్లాపుల పూరి దర్శత్వంలో రాబోతున్న చిత్రం ఇది. హీరో రామ్ కు కూడా ఈ చిత్రం విజయం చాలా కీలకం అనే చెప్పాలి. నేను శైలజ తర్వాత రామ్ కు ఆ స్థాయి విజయం లేదు. ఈ చిత్రంలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











