Liger సినిమాకు రాజకీయ నేత అక్రమ పెట్టుబడులు? పూరీ జగన్నాథ్, ఛార్మీని విచారించిన ఈడీ
కోట్లాది రూపాయల డ్రగ్ రాకెట్‌తో సంబంధమున్న మనీలాండరింగ్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత చార్మీ కౌర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) మరోసారి గురువారం ప్రశ్నించింది. 2017 సంవత్సరంలో బయటకు వచ్చిన ఈ కేసును కొద్ది సంవత్సరాలుగా దర్యాప్తు చేస్తున్నది. అయితే ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. లైగర్ సినిమా పెట్టుబడుల వ్యవహారంలో ఈడీ విచారణకు పిలవడం సంచలనంగా మారింది. ఈ కేసులో పూరీ, చార్మీని తాజాగా విచారించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

లైగర్ కోసం అక్రమంగా డబ్బు
లైగర్ సినిమా కోసం తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ ఫ్యామిలీకి చెందిన నేత అక్రమంగా పెట్టుబడి పెట్టారు. నల్లధనాన్ని వైట్ మనీగా మార్చే ప్రక్రియలో భాగంగా లైగర్ సినిమాకు ఫైనాన్స్ చేశారు. ఈ సినిమా నిర్మాణానికి అక్రమంగా డబ్బు తరలించారు. కేవలం లైగర్ సినిమా కోసమే కాకుండా జనగణమన సినిమా కోసం కూడా రాష్ట్రంలోని రాజకీయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు పెట్టుబడులు పెట్టారు అని కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ ఈడీ, సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ ఫిర్యాదు
లైగర్‌తోపాటు పలు కుంభకోణాలతో సంబంధముందనే ఆరోపణలతో కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ నేరుగా ఢిల్లీలోని దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొన్న నేపథ్యంలోనే ఈడీ అధికారులు విచారణకు పావులు కదిపారు అనే వాదన తెరపైకి వచ్చింది.

పూరీ, ఛార్మీని విచారించిన ఈడీ
లైగర్ నిర్మాణంలో అక్రమ పెట్టుబడులు ఉన్నాయనే ఆరోపణలు, ఫిర్యాదు రావడంతో దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత, పూరీ కనెక్ట్ సహభాగస్వామి చార్మీ కౌర్‌ను నవంబర్ 17వ తేదీ (గురువారం) హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లోనీ ఈడీ కార్యాలయంలో విచారించారు. దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించినట్టు సమాచారం.

విచారణ ముగిసిన తర్వాత పూరీ, ఛార్మీ
అయితే గురువారం సాయంత్రం 6 గంటల తర్వాత విచారణ ముగిసిన తర్వాత పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ ఇద్దరు ఈడీ కార్యాలయాన్ని విడిచి వెళ్లారు. మీడియాతో మాట్లాడకుండా తమ వాహనాల్లో అక్కడి నుంచి బయలుదేరారు. అయితే మీడియాకు దర్యాప్తు అంశాలను వెల్లడిస్తారా? అనేది విషయం కోసం వేచి చూస్తున్నారు.

లైగర్ దారుణంగా ఫ్లాప్ కావడంతో
ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఈ సినిమా భారీ నష్టాల్లో మునిగిపోవడంతో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు పూరీ కార్యాలయం ఎదుట ధర్నా చేయడానికి సిద్దమయ్యారు. కానీ పూరీ, ఛార్మీ వారికి ఘాటుగా సమాధానం ఇవ్వడం చర్చనీయంశమైంది.


Click it and Unblock the Notifications











