త్వరలోనే ఆ సినిమాతో కలుద్దాం: పూరీ జగన్నాథ్ కీలక ప్రకటన
ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమా విడుదలైన మొదట్లో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ, క్రమంగా పుంజుకుని బొమ్మ బ్లాక్‌బస్టర్ అనిపించుకుంది. దీంతో పూరీ జగన్నాథ్ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. జూనియర్ ఎన్టీఆర్ 'టెంపర్' తర్వాత అతడికిదే హిట్. ఇక రామ్ కూడా తన కెరీర్‌లోనే భారీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక, ఈ సినిమా ఫలితంతో పూరీ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తన తదుపరి చిత్రాన్ని కూడా మీడియా ముందు ప్రకటించేశాడు.

మంచి రెస్పాన్స్ వస్తోంది
శనివారం హైదరాబాద్‌లో ‘ఇస్మార్ట్ శంకర్' యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ పలు విషయాలపై మాట్లాడాడు. ఈ సినిమా ఫలితం విషయంలో బాగా కంగారు పడిపోయానని, అందుకే జీవితంలో మొదటి సారి సినిమా హిట్ కావాలని గట్టిగా కోరుకున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే, సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని తెలిపాడు.

టైటిల్ రిజిస్టర్ చేసేశా
తన తదుపరి సినిమా గురించి పూరీ క్లారిటీ ఇచ్చేశాడు. ‘‘ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఉంది. ఎక్కడకు వెళ్లినా ‘ఇస్మార్ట్ శంకర్ 2' ఎప్పుడు అని అడుగుతున్నారు. ఈ సినిమా సీక్వెల్ తీయాల్సిన పరిస్థితి వస్తుందని మేము ముందే ఊహించాం. అందుకే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసి, సీక్వెల్‌ను ఎంత వీలైతే అంత తొందరగా చేయాలి. ఇందుకోసం ‘డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్‌ను ఎప్పుడో రిజిస్టర్ చేసి పెట్టాను'' అని ఆయన చెప్పుకొచ్చాడు.

29 నుంచి తెలంగాణ టూర్
ఇప్పటికే ఏపీలో టూర్ పూర్తి చేసేశామని వెల్లడించిన పూరీ.. ‘‘29 నుంచి ఇంకోసారి తెలంగాణ టూర్ వెళ్లాలని అనుకుంటున్నాం. రాష్ట్రం అంతా కవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఏపీలోనే భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇక్కడ అంతకు మించి ఉంటుందని చాలా మంది అంటున్నారు. దాన్ని కళ్లారా చూస్తాం'' అని పేర్కొన్నాడు.

త్వరలోనే కలుద్దాం
తన తదుపరి సినిమాతో త్వరలోనే కలుద్దామని ఈ సమావేశంలో పూరీ అన్నాడు. ‘‘నాకు హిట్ సినిమా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న చాలా మందికి, అలాగే మీడియా మిత్రులకు ధన్యవాదాలు. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే ఈ హిట్ వచ్చింది. లవ్ యూ ఆల్.. ‘డబుల్ ఇస్మార్ట్'తో త్వరలోనే కలుద్దాం'' అంటూ ముగించాడు పూరీ.

రికార్డు కలెక్షన్లు
‘ఇస్మార్ట్ శంకర్' విడుదలైన రోజు నుంచి కలెక్షన్ల మోత మోగిస్తుంది. ఈ సినిమాకు మొదటి ఎనిమిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 63 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన సీనియర్ హీరోయిన ఛార్మీ తెలిపింది. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతానికి వచ్చిన కలెక్షన్లు రామ్ కెరీర్‌లోనే అత్యధికమని తెలుస్తోంది.

‘ఇస్మార్ట్ శంకర్' గురించి..
పూరీ జగన్నాథ్ - రామ్ కలయికలో వచ్చిన చిత్రమే ‘ఇస్మార్ట్ శంకర్'. పూరి సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన ‘ఇస్మార్ట్ శంకర్'లో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్ నటించారు. అలాగే, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు.


Click it and Unblock the Notifications











