కృష్ణంరాజుకు కన్నీటి వీడ్కోలు.. అరుదైన రాజకీయ నేత అంటూ
రాజకీయాలంటే చాలామంది చర్చించడానికి కూడా ముందుకు రానివిధంగా మారిపోతున్నాయి. ఈరోజు ఒక పార్టీలో కనపడిన నాయకుడు రేపు వేరే పార్టీ జెండా కప్పుకొని కనిపిస్తాడు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థంకాని పరిస్థితి. పార్టీ ఏదైనా నాయకుడు తన వ్యక్తిత్వాన్ని మార్చుకోకూడదని, తనకంటూ ఒక సిద్ధాంతాన్ని రూపొందించుకొని దానికి కట్టుబడినవాడే నిజమైన రాజకీయ నేత అని రెబల్ స్టార్ కృష్ణంరాజు తరుచుగాచెప్పేవారు. అలా చెప్పడమే కాకుండా దాన్ని ఆచరించి చూపారు.

రాజకీయాల్లో బెబ్బులిలా దూసుకుపోయారు
రాజకీయాల్లో కూడా కృష్ణంరాజు బెబ్బులిలా దూసుకుపోయారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఆహ్వానం పలకడంతో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకున్న కృష్ణంరాజు 1991లో ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. కొన్నాళ్ల తర్వాత ఆయన మనస్తత్వానికి కాంగ్రెస్‌లో ఇమడలేకపోవడంతో భారతీయ జనతాపార్టీలో చేరారు. బీజేపీలో చేరడానికి మరో కారణం కూడా ఉంది. సంపాదించుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చారంటూ కొందరు విమర్శలు చేయడంతో ఆయన దాన్ని సీరియస్‌గా తీసుకొని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు.

సినీ, రాజకీయ రంగాల్లో నిరాడంబరుడు
1998లో కాకినాడ నుంచి, 1999లో నర్సాపురం నుంచి ఎంపీగా విజయం సాధించి అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేశారు. గోపీకృష్ణా పతాకంపై సినిమాలు, సీరియల్స్ మాత్రం నిర్మించేవారు. ప్రజలు మనల్ని ఎన్నుకున్నారని, కాబట్టి మనకు ఎన్నిపనులున్నప్పటికీ వారానికి రెండు రోజులైనా వారికి కేటాయించాలని చెప్పేవారు. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో నిరాడంబరంగా ఉంటారనే పేరును కృష్ణంరాజు సంపాదించుకున్నారు.

వారానికి రెండు రోజులు నియోజకవర్గంలోనే
అందుకే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించినా వారానికి రెండు రోజులు ప్రజలకు సమయం కేటాయించేవారు. ఎన్నికైన నియోజకవర్గంలోనే గడిపేవారు. అదే సమయంలో పార్టీలకు అతీతంగా నాయకులు ఎవరు తన వద్దకు వచ్చినా పార్టీలతో సంబంధం లేకుండా పనులు చేసిపెట్టేవారు. అందుకే ఆయన మృతి సినీ రంగానికే కాకుండా రాజకీయ రంగానికి కూడా తీరని లోటు అని ప్రముఖులు నివాళులర్పించారు. మొయినాబాద్‌లో జరిగిన అంత్యక్రియల సందర్భంగా తమ అభిమాన నటుడు, నాయకుడికి కన్నీటి వీడ్కోలు చెప్పారు.


Click it and Unblock the Notifications











