OTT New Movies: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే!
OTT New Movies This Week: 2025కి వీడ్కోలు చెబుతూ... 2026కి ఘనంగా స్వాగతం పలికే క్షణాలు వచ్చేశాయి. నూతన సంవత్సరాన్ని సంబరంగా జరుపుకోవడానికి ప్రేక్షకులు ప్లాన్స్ వేస్తుంటే.. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు కూడా సినీప్రియులకు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్లలో కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే, ఇంట్లో కూర్చొని చూసే ఓటీటీ కంటెంట్‌పై ప్రేక్షకుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఈ వారం న్యూ ఇయర్ స్పెషల్‌గా అన్ని ప్రముఖ ఓటీటీ వేదికలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో సందడి చేయబోతున్నాయి.
న్యూ ఇయర్ సందడి
ఈ వారం థియేటర్లలో కూడా పలు చిన్న,మధ్య తరహా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. జనవరి 1న సైక్ సిద్ధార్థ్ విడుదలవుతుండగా, ఫెయిల్యూర్ బాయ్స్, ఇట్స్ ఓకే గురు, ఇక్కిస్, ఘంటశాల, నీలకంఠ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ , మహేష్ బాబు హీరోగా నటించిన మురారి సినిమాలు రీ రిలీజ్ అవుతుండటంతో థియేటర్ల వద్ద కూడా పండుగ వాతావరణం కనిపిస్తోంది.

మౌగ్లీ 2025 (తెలుగు)
తెలుగు ప్రేక్షకులకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న మూవీ ' మౌగ్లీ '. ప్రముఖ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై పర్వాలేదనే టాక్‌ను సొంతం చేసుకుంది. 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. అడవుల్లో తల్లిదండ్రులు లేకుండా అనాధగా పెరిగిన మౌగ్లీ, అనుకోని పరిస్థితుల్లో సిటీకి రావడం, అక్కడ అతను ఎదుర్కొనే కష్టాలు, జీవిత పోరాటమే కథాంశం. భావోద్వేగాలు, మానవ సంబంధాలు, జీవన పోరాటాన్ని చూపించిన ఈ మూవీ జనవరి 1 నుంచి ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్‌కు రానుంది.
బ్యూటీ' (Beauty)
మూడు నెలల క్రితం థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో ఓ మోస్తరు విజయం సాధించిన క్యూట్ ఎమోషనల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'బ్యూటీ' (Beauty) ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. అంకిత్ కొయ్య హీరోగా, నిలాఖి పాత్ర హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జే వర్ధన్ దర్శకత్వం వహించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ సినిమాలో నరేష్, వాసుకీ ఆనంద్, నితిన్ ప్రసన్న, ప్రసాద్ బెహారా కీలక పాత్రలు పోషించారు. క్యూట్ లవ్ స్టోరీతో పాటు తండ్రి- కూతురు మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. చివర్లో వచ్చే ట్విస్టు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే చూసిన కథే అయినా స్క్రీన్‌ప్లే కొంత భిన్నంగా ఉండటం ప్లస్ పాయింట్. ఇప్పుడు ఈ సినిమా జీ5 (ZEE5) ఓటీటీలో జనవరి 2 శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇప్పుడు చావడానికైనా సిద్దమే.. చావు, పుట్టుకలపై అరియానా ఎమోషనల్
ఇథిరి నేరం (మలయాళం)
మలయాళ సినీప్రియులను ఆకట్టుకునేలా రూపొందిన మూవీ 'ఇథిరి నేరం'. ఎమోషనల్ టచ్‌తో పాటు సస్పెన్స్ ఎలిమెంట్స్ కలగలిపి ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రాశంత్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోషన్ మాథ్యూ, జారిన్ షిహాబ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కథ పరంగా చూస్తే, ఒక స్నేహితుల పార్టీ సందర్భంగా అనిష్ అనే యువకుడు అనుకోకుండా తన మాజీ ప్రేయసి అంజనను కలుసుకోవడం నుంచి కథ మొదలవుతుంది. అక్కడి నుంచి వారి మధ్య జరిగే పరిణామాలు, గత జ్ఞాపకాలు, భావోద్వేగాలే కథకు ప్రధాన బలంగా నిలుస్తాయి. రొమాంటిక్ టచ్‌తో పాటు మిస్టరీని కలిపి తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 1 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్‌కు రానుంది.
'LBW: లవ్ బియాండ్ వికెట్'
అదే రోజున తమిళ వెబ్ సిరీస్ 'LBW: లవ్ బియాండ్ వికెట్' (LBW: Love Beyond Wicket) కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రికెట్ నేపథ్యంతో రూపొందిన ఈ సిరీస్ స్పోర్ట్స్ డ్రామాగా ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్‌ను గమనిస్తే, క్రికెట్‌పై అమితమైన ప్రేమ కలిగిన ఓ యువకుడు మైదానంలో ఎదుర్కొనే ఒత్తిడి, విజయాలు, ఓటములు, అలాగే ప్రేమలో ఎదురయ్యే నిరాశలు ప్రధానంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆటలో గెలుపు కోసం చేసే పోరాటం, వ్యక్తిగత జీవితంలో ప్రేమ-కెరీర్ మధ్య సమతుల్యత వంటి అంశాలు ఈ సిరీస్‌లో కీలకంగా ఉండనున్నాయి. జనవరి 1 నుంచి ఈ సిరీస్ జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
ఎకో (మలయాళం)
మలయాళంలో ఈ ఏడాది బెస్ట్ థ్రిల్లర్‌లలో ఒకటిగా నిలిచిన 'ఎకో' (Eko) ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో అద్భుతమైన స్పందన అందుకున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూడాలా అని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు ఆ నిరీక్షణకు ముగింపు పలికింది. అయితే తెలుగు ప్రేక్షకులకు చిన్న నిరాశ ఎదురైంది. నవంబరులో థియేటర్లలో విడుదలైన 'ఎకో' ఓటీటీలోకి వస్తుందన్న వార్తతో తెలుగు డబ్బింగ్ కూడా ఒకేసారి వస్తుందనుకున్నారు. డిసెంబరు 31న అన్ని భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని ప్రచారం జరిగినప్పటికీ, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. 'ఎకో' తెలుగు, తమిళ, కన్నడ, హిందీ డబ్బింగ్ వెర్షన్లు వచ్చే బుధవారం, అంటే జనవరి 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానున్నాయి.
సంక్రాంతి సినిమాలు..
న్యూ ఇయర్ తర్వాత వెంటనే సంక్రాంతి పండగ రావడంతో, పెద్ద సినిమాలపై అంచనాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సంక్రాంతికి ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర ప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి నటించిన 'అనగనగా ఓ రాజు', రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' వంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.
మొత్తానికి థియేటర్లలో కొత్త సినిమాలు, ఓటీటీల్లో బోలెడు కొత్త కంటెంట్‌తో ఈ న్యూ ఇయర్ వారం నిజంగా సినీప్రియులకు పండుగలా మారింది. థ్రిల్లర్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, స్పోర్ట్స్ డ్రామా కంటెంట్ ఈ వారం ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంట్లోనే హాయిగా కూర్చొని నూతన సంవత్సరాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌తో సెలబ్రేట్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ వీక్ అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











