For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మెహబూబా సినిమా రివ్యూ: పూరీ మార్కు ప్రేమకథ

  By Rajababu
  |
  Mehbooba Movie Review మెహబూబా మూవీ రివ్యూ

  Rating:
  2.5/5
  Star Cast: ఆకాశ్ పూరీ, నేహా శెట్టి, విషురెడ్డి, మురళీ శర్మ
  Director: పూరీ జగన్నాథ్

  దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటే అమ్మ, నాన్న తమిళ అమ్మాయి, పోకిరి, బిజినెస్‌మెన్‌ లాంటి చిత్రాలు కళ్లముందు కదలాడుతాయి. ఆయన డైలాగ్స్, టేకింగ్ ప్రేక్షకులను మైమరిపిస్తాయి. పూరీ చెప్పిన ప్రేమకథలు విశేషంగా ఆకట్టుకొన్నాయి. తనదైన శైలిలో చిత్రాలను తెరకెక్కించే విలక్షణ దర్శకుడు పూరీని ఈ మధ్యకాలంలో సక్సెస్‌లు పలకరించిన దాఖలాలు చాలా తక్కువే. ఇలాంటి నేపథ్యంలో తన కుమారుడు ఆకాష్ పూరీని హీరోగా, నేహా శర్మ అనే అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ పూరీ రూపొందించిన చిత్రం మెహబూబా. పూరీ కనెక్ట్ (పీసీ కనెక్ట్స్), పూరీ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ ప్రేమ కథా చిత్రం మే 11 (శుక్రవారం) రిలీజైంది. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో రూపొందిన ఈ చిత్రం పూరీ జగన్నాథ్‌కి సక్సెస్‌ను అందించిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  మెహబూబా చిత్ర కథ

  రోషన్ ( ఆకాష్ పూరీ) అమితమైన దేశభక్తి కలిగిన యువకుడు. సైన్యంలో చేరాలనే తపనతో ఉంటాడు. స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ చేయడమంటే చాలా ఇష్టం. కానీ చిన్నతనం నుంచే కొన్ని జ్ఞాపకాలు రోషన్‌ను వెంటాడుతుంటాయి. హిమాలయాలతో తనకు అవినాభావ సంబంధం ఉందనే భావనతో ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో చదువుకోవడానికి వచ్చిన పాకిస్ఠానీ అమ్మాయి అఫ్రీన్ (నేహా శెట్టి) పరిచయం అవుతుంది. ఓ సందర్భంలో ఆఫ్రీన్‌‌ను రక్షిస్తాడు. ఆ తర్వాత ఏదో చెప్పలేని బంధం తమ మధ్య ఉందనే ఫీలింగ్ ఇద్దరిలోనూ ఏర్పడుతుంది. ఈ క్రమంలో హియాలయాలకు వెళ్లిన రోషన్‌కు ఆఫ్రీన్ రూపంలో ఉన్న ఓ అమ్మాయి శవం మంచు కొండల్లో లభ్యమవుతుంది. అప్పుడు ఆఫ్రీన్‌ డైరీలో లభ్యమైన సమాచారం ఆధారంగా తమది గత జన్మ బంధమని తెలుసుకొంటాడు.

  ప్రేమ కథలో ట్విస్టులు..

  గత జన్మలో కబీర్, మధీరా ప్రేమ అసంపూర్తిగా ముగిసిపోయిందని తెలుసుకొంటాడు. మధీరానే తన ప్రేయసి అఫ్రీన్‌గా గుర్తిస్తాడు. పాకిస్థాన్‌కు వెళ్లిపోయిన అఫ్రీన్‌కు పెళ్లి నిశ్చయమవుతుంది. ఈ జన్మలోనైనా తన ప్రేమను రక్షించుకోవడానికి రోషన్ పాకిస్థాన్‌కు వెళ్లాడు. పాకిస్థాన్‌కు వెళ్లిన రోషన్ తన ప్రేయసిని ఎలా దక్కించుకొన్నాడు. ఆఫ్రీన్‌ ప్రేమను కాపాడుకోవానికి రోషన్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. గత జన్మలో కబీర్, మధీరా ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడ్డాయి. వాళ్లు ఏవిధంగా ప్రాణాలు కోల్పోయారు అనే ప్రశ్నలకు సమాధానమే మెహబూబా చిత్ర కథ.

  మెహబూబా ఫస్టాఫ్

  మెహబూబా చిత్ర ప్రథమార్థంలో రోషన్, ఆఫ్రీన్ గత జన్మ జ్ఞాపకాలతో కథ మొదలవుతుంది. రోషన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్, చదువు కోసం ఆఫ్రీన్ హైదరాబాద్‌కు రావడం అనే అంశాలతో చకచకా సాగిపోతుంది. పాకిస్థాన్, ఇండియా క్రికెట్ మ్యాచ్ సందర్బంగా వచ్చే సన్నివేశాలలో పూరీ మార్కు కనిపిస్తుంది. పూరీ మార్కు డైలాగ్స్‌తో జోష్ కూడా కనిపిస్తుంది. ఆఫ్రీన్‌ను దుండగుల దాడిని నుంచి కాపాడే సీన్లు పూరీ స్టయిల్‌ను గుర్తు చేస్తాయి. రోషన్ కోసం ఆఫ్రీన్ వెతుకులాటలో ఎమోషన్ కనిపిస్తుంది. తనకు వెంటాడే మెమోరీస్‌ను ఛేదించే క్రమంలో రోషన్ ఆవేదన ఆకట్టుకొనేలా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు ఆసక్తికరమైన మలుపుతో కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది.

  మెహబూబా సెకండాఫ్

  ఇక రెండో భాగంలో పాకిస్థానీ సైనికుడు కబీర్, హిందూస్థాన్ అమ్మాయి మధీరా మధ్య జరిగిన కథతో సినిమా ప్రారంభం అవుతుంది. పాకిస్థానీ కెప్టెన్ చెర నుంచి మధీరాను విడిపించే సీన్లు ఎమోషనల్‌గా ఉంటాయి. కబీర్, మధీరాల ప్రేమకు పాకిస్థానీ కెప్టెన్ అడ్డుపడటంతో లవ్‌స్టోరి ముందుకు సాగుతుంది. రెండో భాగంలో చాలా సన్నివేశాలు ఉద్వేగభరితంగా లేకపోవడం, చాలా సాదాసీదా సాగిపోవడం సహనానికి పరీక్షగా మారుతుంది. కానీ వార్ ఎపిసోడ్స్‌ హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా ఉంటాయి. ప్రీక్లైమాక్స్‌లో ఆఫ్రీన్‌ను దక్కించుకోవడానికి పాకిస్థాన్ వెళ్లడంతో ప్రేక్షకుడిలో ఆసక్తి పెరుగుతుంది. కానీ పాకిస్థాన్‌లో ఆఫ్రీన్ ఎత్తుకొచ్చే అంశాల్లో భావోద్వేగం ఎక్కడా కనిపించదు. ఏదో నాసిరకంగా సాగడం నిరాశకు గురిచేస్తుంది. సన్నివేశాల్లో బలం లేకపోవడం సినిమా మరోస్థాయికి చేరలేకపోయిందనే భావన ఏర్పడుతుంది. గందరగోళం మధ్య రోషన్, ఆఫ్రీన్‌ను ఇండియాకు చేర్చి కథ ముగిసిందనే ఫీలింగ్‌ను పూరీ కల్పించాడనే భావన ఏర్పడుతుంది.

  పూరీ జగన్నాథ్ టేకింగ్

  గత వైభవాన్ని అందుకోవడానికి పూరీ చేసిన ప్రయత్నం మోహబూబా. పాయింట్‌గా కథను చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. సరైనా కథనం లేకపోవడం, పూరీ రాసుకొన్న సన్నివేశాల్లో బలం లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అక్కడక్కడా పూరీ మార్కు డైలాగ్స్ చప్పట్లు కొట్టిస్తాయి. నవ్వుల్లో ముంచెత్తుతాయి. ఇంట్లో నాన్న ఉంటే పక్క ఇంట్లో వాడిని నాన్న అంటావురా? అందరం చచ్చిపోదాం నాన్నా లాంటి డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. వార్ సీక్వెన్స్‌ను పూరీ చాలా గ్రాండియర్‌గా తెరకెక్కించిన విధానం ఆకట్టుకొంటుంది. పూరీ సినిమాల్లో మంచి స్క్రీన్ ప్లే, మొదటి నుంచి చివరి వరకు డైలాగ్స్ పేలుతాయి. ప్రేమ కథ అంటే ఉద్వేగం నిండి ఉంటుంది. ఇలాంటి అంశాలు ప్రస్తుతం మోహబూబాలో పూర్తిస్థాయిలో కనిపించవు. పూరీ నుంచి మంచి సినిమాను ఎంజాయ్ చేద్దామనుకొనే ప్రేక్షకులకు కొంత నిరాశే మిగులుతుంది.

  పూరీ ఆకాశ్ యాక్టింగ్

  రోషన్, కబీర్ పాత్రల్లో ఆకాష్ పూరి నటన, ఎమోషన్స్ అద్భుతంగా ఉన్నాయి. చిన్నతనంలోనే పరిపూర్ణతతో కూడిన హావభావాలు కనిపిస్తాయి. డైలాగ్స్ డెలివరీలోనూ, ఫైట్స్‌లోనూ అదరగొట్టాడు. కీలక సన్నివేశాల్లో ఆకాశ్ బాడీలాంగ్వేజ్ ఆకట్టుకొనేలా ఉంటుంది. మెహబూబా ఫలితం పక్కన పెడితే ఆకాశ్‌లో మంచి హీరో మెటీరియల్ ఉందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. హీరోగా ఆకాశ్‌కు టాలీవుడ్‌లో మంచి భవిష్యత్‌ ఉందని గ్యారెంటిగా చెప్పవచ్చు.

  నేహా శెట్టి పెర్ఫార్మెన్స్

  అఫ్రీన్‌గా, మధీరా పాత్రల్లో నేహా శెట్టి కనిపించింది. తొలి చిత్రంలోనే భారమైన పాత్రను పోషించింది. కొన్ని సన్నివేశాల్లో నేహా తడబాటుకు గురైనప్పటికీ.. ఓవరాల్‌గా మంచి మార్కులే సంపాదించుకొన్నది. డ్యాన్సులకు స్కోప్ లేకపోవడం వల్ల ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఆమె ప్రతిభను పూర్తిస్థాయిగా అంచనా వేయడానికి వీలు కలుగదు. నటనపరంగా మెరుగులు దిద్దుకొంటే ఇండస్ట్రీలో స్థిరపడటానికి అవకాశం ఉంటుంది.

  విలన్ పాత్రలో విషురెడ్డి

  మోహబూబా చిత్రంలో నాదిర్ అనే మరో కీలక పాత్రలో విషురెడ్డి నటించారు. ఆవేశం తప్పా పెద్దగా నటనతో ఆకట్టుకోలేకపోయాడని చెప్పవచ్చు. ప్రధాన ప్రతినాయకుడికి కావాల్సిన మెటీరియల్‌ విషు పోషించిన పాత్రలో కనిపించలేదు. పాత్ర డిజైన్ లోపమా; లేక నటుడిగా విషురెడ్డి సమస్యనా అనే విషయంలో క్లారిటీ లోపించింది. కాకపోతే సరైన పాత్ర పడితే మంచి విలన్‌గా రాణించే లక్షణాలు బాగానే ఉన్నాయి.

  మిగితా పాత్రల్లో

  ఇక ఈ చిత్రంలో మిగితా పాత్రల్లో షియాజీ షిండే, మురళీ శర్మ ప్రాధాన పాత్రల్లో కనిపించారు. నేహా శర్మకు తండ్రిగా మురళీ శర్మ నటించాడు. పాకిస్థానీ జాతీయుడిగా తన హావభావాలతో మెప్పించాడు. రెండో భాగంలో మురళీశర్మ కీలకంగా మారాడు ఇక ఆకాశ్ తండ్రిగా షియాజి షిండే నటించాడు. తనదైన మార్కు నటనతో హాస్యాన్ని పండించాడు. రెండో భాగంలో షియాజి షిండే పాత్రకు పెద్దగా స్కోప్ ఉండదు.

  సందీప్ చౌతా మ్యూజిక్

  మోహబూబా సినిమాకు సందీప్ చౌతా మ్యూజిక్ ఓ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఓ ప్రియా నా ప్రియా, నా ప్రాణం పాటలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. మంచి ఫీల్‌తో ఉన్న ఈ పాటలు హాలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడుతుంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమాకు జీవం పోసింది. నిన్నే పెళ్లాడుతా పాటల వాసన అక్కడక్కడా కనిపించింది. భాస్కరభట్ల సాహిత్యం గుడ్. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది. తొలి, రెండోభాగంలో కొంత మేర ఎడిటింగ్‌కు స్కోప్ ఉందనిపిస్తుంది.

  విష్ణు శర్మ సినిమాటోగ్రఫి

  మెహబూబా సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ విష్ణు శర్మ సినిమాటోగ్రఫి. యుద్ధ సన్నివేశాలు, ఘాట్ రోడ్స్ షాట్స్‌ను అద్భుతంగా తెరకెక్కించాడు. హిమలయాల్లో కొన్ని సన్నివేశాలు, ట్రెకింగ్‌లో క్లిఫ్‌ హాంగర్ షాట్ తెరపైన బ్రహ్మండంగా కనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ కలర్ ఎంపిక, ఇతర అంశాలు విష్ణు శర్మ ప్రతిభకు అద్దంపట్టాయి. ఆర్ట్ డైరెక్టర్ షేక్ జానీ పనితీరు బాగుంది. రియల్ సతీష్ స్టంట్లు రియలిస్టిక్‌గా ఉన్నాయి.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  మెహబూబా కథ, కథనాలను పక్కన పెడితే నిర్మాణ విలువలు ఫెంటాస్టిక్‌గా ఉన్నాయి. భారీ ఎత్తున చిత్రీకరించిన వార్ ఎపిసోడ్స్ పీసీ కనెక్ట్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఏంటో చెప్పాయి. టెక్నికల్‌గా ఈ చిత్రాన్ని ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించారు. సినిమాకు ఉపయోగించిన లొకేషన్లు కేక పుట్టించాయి.

  ఫైనల్‌గా

  పూరీ జగన్నాథ్ ప్రేమకథలో ఓ ఆత్మ ఉంటుంది. అదే ప్రేక్షకుడికి గొప్ప అనుభూతిని పంచుతుంది. మోహబూబా విషయానికి వస్తే అన్నీ బాగున్నాయి. కానీ లవ్ స్టోరికి మరింత అవసరమైన సోల్ మిస్సయిందనిపిస్తుంది. మాస్ ఎలిమెంట్స్ సాధారణ ప్రేక్షకుడిని, యూత్‌ను ఆకట్టుకోవడం ఖాయం. బీ, సీ సెంటర్లలో మోహబూబాను ప్రేమిస్తే పూరీ ఖాతాలో మరో ఘన విజయం చేరినట్టే.

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  ఆకాష్ పూరీ యాక్టింగ్
  పూరీ టేకింగ్
  సందీప్ చౌతా మ్యూజిక్
  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  మైనస్ పాయింట్స్
  కథ, కథనం
  సన్నివేశాల్లో బలం లేకపోవడం

  తెర వెనుక, తెర ముందు

  నటీనటులు: ఆకాశ్ పూరీ, నేహా శెట్టి, విషురెడ్డి, మురళీ శర్మ, షియాజీ షిండే తదితరులు
  కథ, కథనం, దర్శకత్వం: పూరీ జగన్నాథ్
  నిర్మాతలు: పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్
  సంగీతం: సందీప్ చౌతా
  సినిమాటోగ్రఫి: విష్ణు శర్మ
  ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
  ఫైట్స్: రియల్ సతీష్
  బ్యానర్: పీసీ కనెక్ట్, పూరీ టూరింగ్ టాకీస్
  రిలీజ్: మే 11, 2018

  English summary
  Tollywood's popular director Puri Jagannadh launching his son Akash Puri with Mehabooba movie. This movie is set to release on May 11. This made under banner of Puri Connect. In this occassion Akash puri speaks to media.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more