Gunde Ninda Gudi Gantalu Weekly: చింటూ దత్తత.. మీనా త్యాగం.. రోహిణి మాస్టర్ ప్లాన్.. ప్రభావతికి అనుమానం
Gunde Ninda Gudi Gantalu Weekly: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జనవరి 5వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు జరిగిన'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
గుండె నిండా గుడిగంటలు సోమవారం ( జనవరి 5) ఎపిసోడ్‌లో చింటూ పుట్టినరోజు వేడుకల మధ్య దాచిపెట్టిన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ భావోద్వేగాలను తారాస్థాయికి తీసుకెళ్లాయి. చింటూ అత్త రాకపోవడం బాలు మనసులో అనుమానాలు రేకెత్తిస్తుంది. సుగుణను బయటకు తీసుకెళ్లి ప్రశ్నించగా, చింటూ తన అన్న కొడుకు కాదని, కన్న కొడుకేనని ఆమె నిజం చెబుతుంది. అత్త అని చెప్పమని తానే ఎప్పుడూ అనలేదని, కూతురే అలా చెప్పమందని, నిజం చెప్పలేక అబద్ధం చెప్పలేక నరకం అనుభవిస్తున్నానని సుగుణ కన్నీళ్లతో వాపోతుంది.భర్త మరణ సమయంలో ఉన్న అప్పులు, డిగ్రీ చదువుతున్న కూతురి కోసం వేరే దారి లేక వయసులో పెద్దాయనతో పెళ్లి చేయాల్సి వచ్చిన పరిస్థితి, కొన్ని రోజులకే అల్లుడి మరణం... ఈ అన్నిటితో తన కూతురు జీవితం తానే నాశనం చేశానని ఒప్పుకుంటుంది.

ఆ కోపంతోనే కూతురు చింటూని వదిలేసి దుబాయ్ వెళ్లిపోయిందని వివరిస్తుంది. మీనా కూతురికి అన్యాయం జరిగిందని అనుభూతి వ్యక్తం చేస్తే, బాలు మాత్రం చింటూకి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తాడు. ప్రాయశ్చిత్తంగా చింటూని తానే పెంచుతున్నానని సుగుణ చెప్పినా, మీనా కూతురి స్వార్థాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇంట్లో బాలు-మీనాలు చింటూతో కేక్ కట్ చేయిస్తారు. బయట రోహిణి దూరంగా నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుంది. చివరికి బాలు-మీనాలు వెళ్లిపోయాక చింటూని హత్తుకుని తల్లి ప్రేమ చూపిస్తుంది. కానీ వెంటనే సుగుణపై కోపం చూపించి, బాలు మామూలోడు కాదని, ఇక వాళ్లు రాకూడదని ఆదేశిస్తుంది.కారులో వెళ్తూ చింటూ పరిస్థితి బాలు-మీనాలను కలచివేస్తుంది. చివరకు చింటూని దత్తత తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చి, అది సరైనదేనా అని దేవుడి దగ్గర చిట్టీలు పెట్టడంతో నేటి ఎపిసోడ్ భావోద్వేగ ముగింపు పొందింది.
మంగళవారం (జనవరి 6) ప్రారంభంలోనే బాలు, మీనా గుడికి వెళ్లి చింటూని దత్తత తీసుకోవాలా వద్దా అనే విషయాన్ని దేవుడినే అడగాలని నిర్ణయిస్తారు. చిట్టీలు వేసిన తర్వాత 'దత్తత తీసుకోవద్దు' అనే చీటీ మీనా చేతికి రావడంతో ఆమె భయపడిపోతుంది. వెంటనే ఈ పని చేయొద్దని బాలును హెచ్చరిస్తుంది. కానీ బాలు మాత్రం ఇది దేవుడి సంకేతం కాదని, మంచి పని చేయాలనుకుంటే భయపడాల్సిన అవసరం లేదని లైట్‌గా తీసుకుంటాడు. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందామని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు ప్రభావతి డ్యాన్స్ స్కూల్‌కు ఆరుగురు స్టూడెంట్స్ రావడంతో ఆమె ఆనందంతో మురిసిపోతుంది. అయితే వారిలో ఇద్దరు లవర్స్ కావడం, ఆ అబ్బాయి ప్రభావతిని మెప్పించేందుకు అతివినయంగా ప్రవర్తించడం రాబోయే ప్రమాదానికి సంకేతంగా కనిపిస్తుంది.
డ్యాన్స్ పేరుతో బయట కలవలేని ప్రేమజంట స్కూల్‌ను అడ్డాగా మార్చుకోవడం కథకు కొత్త మలుపు ఇస్తుంది. ఇక ఇంట్లో రవి, శృతి మధ్య సరదా సన్నివేశాలు చోటుచేసుకుంటాయి. శృతిని బతిమాలిన రవి బయటకు తీసుకెళ్తానని చెప్పగా, ఆమె షాపింగ్, సినిమా, డిన్నర్ అంటూ పెద్ద లిస్ట్ పెడుతుంది. దీనిపై ఇద్దరి మధ్య సరదా మాటల యుద్ధం నడుస్తుంది. చింటు బర్త్‌డే సందర్భంగా అతని అమ్మమ్మ ప్రవర్తనపై బాలు, మీనా తీవ్రంగా మండిపడతారు. అదే సమయంలో రోహిణి మరింత ఇరుక్కునేలా తల్లి సుగుణకు ఫోన్ చేసి, దత్తత విషయంతో వస్తే గట్టిగా తిట్టి పంపించమని చెబుతుంది. వెంటనే మీనా చేసిన ఫోన్ కాల్‌ను చింటు ఎత్తగా, అతని అమ్మమ్మ వాళ్లను అవమానించేలా మాట్లాడటం బాలు, మీనాల చెవిన పడుతుంది. ఇదే ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచి, రాబోయే ఎపిసోడ్‌పై ఉత్కంఠను పెంచింది.
బుధవారం (జనవరి 7) ఎపిసోడ్ ఉత్కంఠభరితమైన పరిణామాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే చింటు తల్లి గురించి ఇంట్లో నిజం చెప్పాలని బాలు నిర్ణయించుకుంటాడు. తాను ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నానని ప్రభావతితో చెప్పి ఇంట్లో అందరినీ పిలుస్తాడు. చింటు బర్త్‌డే సందర్భంగా అతని తల్లి గురించి ఓ నిజం తెలిసిందని చెప్పడంతో, బయట నుంచే అది విన్న రోహిణి ఒక్కసారిగా భయపడిపోతుంది. నిజం బయటపడుతుందేమోనన్న టెన్షన్‌తో అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తుంది. అయితే బాలు చెప్పిన నిజం కేవలం చింటు తల్లి దుబాయ్‌లో ఉంటుందని, తనను అమ్మ కాకుండా అత్త అని పిలవమని చెప్పిందనే విషయానికే పరిమితం కావడంతో రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది. కానీ ఈ మాటలపై ఇంట్లో వాళ్లు తీవ్రంగా స్పందిస్తారు.
ప్రభావతి, మనోజ్ పరోక్షంగా రోహిణిని అవమానిస్తూ చింటు తల్లిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు. ఈ మాటలు విన్న రోహిణి లోపలే కుంగిపోతుంది. ఇదే సమయంలో బాలు, మీనా చింటును దత్తత తీసుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించడంతో ప్రభావతి రచ్చ చేస్తుంది. ఎవడికో పుట్టిన పిల్లాడిని ఇంట్లోకి తీసుకురానని తేల్చి చెబుతుంది. మనోజ్ కూడా వ్యతిరేకించగా, సత్యం, రవి మాత్రం దత్తతకు మద్దతు ఇస్తారు. మరోవైపు, భయపడిన రోహిణి తల్లి సుగుణకు ఫోన్ చేసి బాలు-మీనాలతో సంబంధం తెంచుకోవాలని ఆదేశిస్తుంది. క్లైమాక్స్‌లో రోహిణి రెండో బిడ్డను కనాలని నిర్ణయించుకుని ఫ్రెండ్ విద్యతో కలిసి మెటర్నిటీ హాస్పిటల్‌కు వెళ్లడం కీలకంగా మారింది. అదే హాస్పిటల్‌కు మీనా రావడంతో రోహిణి మరోసారి దొరికిపోయే ప్రమాదంలో పడింది. సుమతి ఆమెను చూసి మీనాకు ఫోన్ చేయడంతో, ఇక ముందు ఎపిసోడ్‌ల్లో పెద్ద ట్విస్ట్ ఖాయమని ఈ ఎపిసోడ్ స్పష్టం చేసింది.
The Raja Saab OTT: ప్రభాస్ 'రాజాసాబ్' ఓటీటీ డీటైల్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గురువారం (జనవరి 8) ఎపిసోడ్ లో ఆసక్తికర ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఎపిసోడ్ ప్రారంభంలో రోహిణి తన స్నేహితురాలిని కలుసుకుని ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ చెబుతుంది. బాలు, మీనా చింటూని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారని, కానీ మనోజ్ ఒప్పుకోవడం లేదని వెల్లడిస్తుంది. రోహిణి ఫ్రెండ్ మాత్రం ఇది మంచి నిర్ణయమని, చింటూ భవిష్యత్ సురక్షితంగా ఉంటుందని చెప్పినా, రోహిణి మాత్రం తాను బతికుండగా దత్తతకు ఒప్పుకోనని స్పష్టం చేస్తుంది. ముందుగా తానే పిల్లలను కనాలని, ఆ తర్వాత చింటూని ఇంటికి తీసుకురావాలని తన ప్లాన్‌ను వెల్లడించడంతో ఫ్రెండ్ అసంతృప్తిగా వెళ్లిపోతుంది. ఇక మరోవైపు మీనాకు ఆమె చెల్లి సుమతి ఫోన్ చేసి డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయి కాలేజ్ టాపర్‌గా నిలిచిందని చెప్పడంతో మీనా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది.
విషయం తెలిసిన బాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తాడు. అయితే ప్రభావతి మాత్రం ఈ శుభవార్తను తేలిగ్గా తీసుకుంటూ వెటకార వ్యాఖ్యలు చేయడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. మీనా తన తల్లి పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతుంటే, సత్యం ఆమెకు మద్దతుగా నిలుస్తాడు. ఇంతలో శృతి, రవి వచ్చి ప్రభావతికి గట్టి కౌంటర్ ఇస్తారు. సుమతి విజయం సెలబ్రేట్ చేసుకోవాలని బిర్యానీ, గిఫ్ట్ ప్లాన్స్ వేస్తారు. మరోవైపు ఆఫీస్‌లో రోహిణి లెక్కలు చూసి మనోజ్ ఖర్చులపై షాక్ అవుతుంది. నెలకు రూ.30 వేల భోజన ఖర్చు, రూ.10 లక్షల క్రెడిట్ కార్డు ఆఫర్ రావడం క్లైమాక్స్‌గా మారింది, మనోజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ భవిష్యత్తులో సమస్యలకు దారి తీస్తుందన్న సంకేతాలతో ఎపిసోడ్ ముగిసింది.
శుక్రవారం (జనవరి 9)శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ భావోద్వేగాలు, సస్పెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎపిసోడ్ ప్రారంభంలో మనోజ్‌కు క్రెడిట్ కార్డ్ ఆఫర్ రావడంతో అతడు ఆనందపడుతాడు. దీనిని బిజినెస్ గ్రోత్‌కు ఉపయోగించుకోవచ్చని భావించినా, రోహిణి మాత్రం గత అనుభవాల కారణంగా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అప్పుల భయంతో ఆమె కలవరపడుతుండగా, మనోజ్ మాత్రం అవసరానికి డబ్బు అందుబాటులో ఉంటుందని సమర్థించుకుంటాడు. గోవా ట్రిప్ మాటలతో ఆమెను మెప్పించాలనుకున్నా, రోహిణి ముఖంలో టెన్షన్ తగ్గదు. ఇదే సమయంలో చింటూ నుంచి వచ్చిన ఫోన్ కాల్ రోహిణిని భావోద్వేగానికి గురిచేస్తుంది. 'నీవుంటే చాలు అమ్మా' అన్న మాటలు ఆమె మనసును కదిలిస్తాయి. త్వరలో తన దగ్గరకు తీసుకువస్తానని ధైర్యం చెబుతుంది.
ఇంతలో రోహిణికి గైనకాలజిస్ట్ అపాయింట్‌మెంట్ రావడంతో దివ్య సహాయం కోరుతుంది. మరోవైపు సుమతి ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావడంతో పార్వతి స్వీట్స్ పంచుతూ ఆనందం వ్యక్తం చేస్తుంది. సుమతి మాటల ద్వారా మీనా చదువులు మానేసి కుటుంబం కోసం చేసిన త్యాగం బయటపడటంతో బాలు షాక్ అవుతాడు. హాస్పిటల్‌లో రోహిణి తల్లి కావాలనే తన ప్లాన్‌ను దివ్యకు చెప్పడంతో వాగ్వాదం జరుగుతుంది. ఇదే చోట సుమతి జాబ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి మీనాకు ఫోన్ చేస్తుంది. అయితే హాస్పిటల్‌లో రోహిణిని చూసినట్లు చెప్పడంతో మీనాకు అనుమానం మొదలవుతుంది. ఈ ట్విస్ట్‌తో ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగిసింది.


Click it and Unblock the Notifications











