పూరీ ఆకాశ్ ‘రొమాంటిక్’ మూవీ ఓటీటీ రిలీజ్: క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఎంతో మంది హీరోలతో భారీ విజయాలను అందుకున్న ఆయన.. చాలా మందికి కొత్త లైఫ్‌ను అందించారు. అయితే, హీరోగా పరిచయం అయిన ఆయన కుమారుడు ఆకాశ్‌కు మాత్రం హిట్ దొరకక ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. దీంతో అతడికి సరైన విజయాన్ని అందించాలని పూరీ పట్టుదలతో ఉన్నాడు. అలా ఆకాశ్‌తో 'రొమాంటిక్' అనే సినిమాను నిర్మించాడు. ఫస్ట్ లుక్‌తోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ చిత్రం విడుదలపై అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది.
పూరీ జగన్నాథ్ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో అకాశ్ - కేతిక శర్మ జంటగా నటించిన చిత్రమే 'రొమాంటిక్'. ఈ సినిమాను ఓటీటీలో నేరుగా విడుదల చేయబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ జీ5తో చిత్ర యూనిట్ డీల్ కూడా కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో చిత్ర యూనిట్ తాజాగా దీనిపై స్పందించింది. 'రొమాంటిక్' మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉందని, ఈ కారణంగానే దీన్ని థియేటర్లలో విడుదల చేస్తామని స్పష్టం చేసింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'రొమాంటిక్' మూవీని జూన్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. కానీ, కరోనా వల్ల అది కాస్తా సాధ్య పడేలా కనిపించలేదు. దీంతో ఓటీటీ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక, ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తోన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను హీరోయిన్ ఛార్మీతో కలిసి పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











