బన్నీని స్టార్‌గా మార్చిన సినిమా రీ రిలీజ్.. ఆరోజు నుంచే థియేటర్లలోకి!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న పెద్ద సినిమాలు కుప్పలు కుప్పలుగా వస్తుంటాయి. కానీ, అందులో మాత్రం ప్రేక్షకులను అలరించేవి చాలా తక్కువే ఉంటున్నాయి. అలా గతంలో అందరి అదరాభిమానాలను చూరగొని సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాలను ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే టాలీవుడ్‌లోని చాలా మంది స్టార్ హీరోలకు సంబంధించిన స్పెషల్ డేలలో వాళ్లు నటించిన కొన్ని చిత్రాలను 4K ప్రింట్లతో తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'పుష్ప'తో పాన్ ఇండియా హీరో అయిపోయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా రీ రిలీజ్‌కు రెడీ అయిపోతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దేశముదురు' మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు, ఇది అప్పటి వరకూ ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడంతో పాటు బన్నీ స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పింది. అందుకే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీజ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏప్రిల్ 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక లొకేషన్లలో ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన టికెట్ల బుకింగ్ కూడా మొదలు కాబోతుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'దేశముదురు' మూవీలో అల్లు అర్జున్ హీరోగా నటించాడు. పక్కా మాస్ మసాలా కథకు లవ్ స్టోరీని జోడించి తీసిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు భారీ స్పందనను అందించారు. ఫలితంగా ఈ చిత్రానికి అతడి కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు, ఈ చిత్రంలోనే బన్నీ తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాడు. ఇక, ఈ మూవీలో పూరీ జగన్నాథ్ డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు కూడా ఈ చిత్రానికి అదే రీతిలో స్పందన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప ది రూల్' చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కొంత వరకూ పూర్తైంది. దీనితో పాటు సందీప్ రెడ్డి వంగాతో ఓ భారీ ప్రాజెక్టును సైతం ప్రకటించాడు.


Click it and Unblock the Notifications











