పూరి జగన్నాథ్ సీఎం.. నేను హోం మినిస్టర్.. ఆలీ ఆసక్తికరంగా వ్యాఖ్యలు
నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుందని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ సరిగ్గా అతికినట్టుగా సరిపోతుంది దర్శకుడు పూరి జగన్నాథ్‌కి. నలుగురిది ఓ దారైతే ఆయనది మరో దారి .. అది కూడా ఎవరికీ అంతుచిక్కదు. తన గురువు రామ్ గోపాల్ వర్మను చాలా దగ్గరి నుంచి చూశాడో ఏమో కానీ ఆయన లక్షణాలన్నీ పూరిలో కనిపిస్తాయి. ఈ తరం దర్శకుల్లో అతి తక్కువ సమయంలో వేగంగా సినిమాలు చేసే డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒక్కరే. ఇప్పుడంటే స్పీడ్ తగ్గింది కానీ గతంలో ఏడాదికి 3 నుంచి 4 సినిమాలు చేసేవారు జగన్. హీరోని, హీరోయిజాన్ని కొత్తగా చూపించడంలో ఆయన సిద్ధహస్తుడు.
పూరి చేతుల్లో పడిన ఎవరైనా సరే కొత్తగా మేకోవర్ అయిపోతుంటారు. పవన్ కళ్యాణ్, రవితేజ, మహేశ్ బాబు, ప్రభాస్, బాలకృష్ణ, రామ్ పోతినేని , అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఇలా చెప్పుకుంటూపోతే లిస్ట్ పెద్దదే. సినిమా ఫ్లాప్ అయినా సరే సదరు హీరోకు కొత్త మాస్ ఇమేజ్ రావడం మాత్రం పక్కా. కానీ పూరి తన హీరోలకు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో మాదిరిగా భారీ డైలాగులు, బిల్డప్‌లు ఇవ్వరు. ఆ రోల్‌కి కొంచెం పొగరు, అకాయితనం , ఊర నాటు లుక్ ఇచ్చి ప్రజెంట్ చేస్తారు. బద్రీ, పోకిరి, బిజినెస్‌మెన్, బుజ్జిగాడు, దేశముదురు ఇలా ఏ మూవీ తీసుకున్నా ఆ సినిమాల్లో డైలాగ్స్ తూటాల్లా పేలుతుంటాయి.

కాస్త స్పీడు తగ్గింది కానీ.. ఇప్పటికీ పూరీ జగన్నాథ్ సినిమా అంటే అందులో ఏదో ఒక వైవిధ్యం ఉంటుందని ప్రేక్షకులు భావిస్తుంటారు. పూరి పని అయిపోయిందనే మాట వినిపించినప్పుడల్లా తన సత్తా చాటుతుంటారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి నేటి వరకు ఆయన సినిమా కష్టాలను అనుభవించారు. తొలుత అవకాశాల కోసం , ఆ తర్వాత నమ్మినవాళ్లే రూ.కోట్లలో మోసం చేసినా ఎక్కడా అధైర్యపడలేదు. పడిలేచిన కెరటంలా తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యారు.
ఇకపోతే.. ఇండస్ట్రీలో కమెడియన్ అలీ - పూరి జగన్నాథ్‌లది విడదీయరాని బంధం. ఆయన సినిమాల్లో ఎవరికి అవకాశం ఉన్నా లేకున్నా అలీకి మాత్రం ప్రత్యేకంగా చిన్న పాత్రయినా ఉంటుంది. ఆ పాత్రలు అలీకి కూడా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆస్తులన్నీ అమ్మేసి నడిబజారులో నిలబడిన పూరి జగన్నాథ్‌కు రూ.లక్షలు విలువ చేసే గోల్డ్ చైన్‌ని ఇచ్చి ఇది దగ్గరుంటే పోయినవన్నీ తిరిగొస్తాయని చెప్పారు అలీ. ఆయన చెప్పినట్లే పూరి జగన్నాథ్ తిరిగి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. తాను సంతోషంగా ఉంటే ఒక బొకే.. బాధలో ఉన్నప్పుడు ఒక పెగ్ మందు మాత్రం పోసి వెళ్తాడని పూరీ చెబుతారు.

అల్లు శిరీష్ నటించిన బడ్డీ సినిమా ఈవెంట్‌కు హాజరైన నేపథ్యంలో పూరి జగన్నాథ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అలీ. ఓ మూవీ ఈవెంట్‌కు హాజరైన అలీ.. మాట్లాడుతూ థాయ్‌లాండ్ ఓ రాజ్యం కాబట్టి సరిపోయింది కానీ , అక్కడ న్నికలు పెడితే పూరి జగన్నాథ్ సీఎం .. తాను హోమ్ మినిస్టర్ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలీ ఈ మాటలు అనడం వెనుక కారణం లేకపోలేదు. తనకు కష్టం అనిపించినా, మూడీగా ఉన్నా వెంటనే థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో వాలిపోతారు పూరి .
అక్కడ బీచ్‌లలో కూర్చొని కథలు రాసుకోవడం ఆయనకు అలవాటు. తన సినిమాల్లో కొన్ని సన్నివేశాలైనా బ్యాంకాక్‌లో షూట్ జరుపుకోవాల్సిందే. అంతేకాదు.. తనకు బ్యాంకాక్‌లో అభిమానులు ఉన్నారని, అక్కడ పోటీ చేసినా గెలుస్తానని పూరి జగన్నాథ్ ఎన్నోసార్లు చెప్పారు. బ్యాంకాక్ బీచ్‌లలో చూపు తిప్పుకోకుండా ఉండలేమని, అలాంటి చోట స్క్రిప్ట్ రాయడం కష్టమని.. కానీ ఆ ప్రదేశాల్లో ఉంటేనే మన ఏకాగ్రత ఎంతో తెలుస్తుందని పూరీ చెప్పారు. ఆయనతో స్నేహామో ఏమో కానీ అలీ కూడా థాయ్‌లాండ్ ఎక్కువగా విజిట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన పై విధంగా వ్యాఖ్యలు చేశారు.


Click it and Unblock the Notifications











