పూరీ జగన్నాథ్ కు బుచ్చిబాబు ఏమౌతాడో తెలుసా? మరి సుకుమార్ కు శిష్యుడు ఎలా?
టాలీవుడ్ లో ఉప్పెన సినిమాతో సంచలనం సృష్టించాడు బుచ్చిబాబు. ఆయన దర్శకత్వ ప్రతిభకు ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణే మెచ్చి సినిమాకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం పెద్ది టైటిల్ తో స్పోర్ట్స్ డ్రామా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా ప్రస్తుతం డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో దుమ్ములేపుతున్నాడు. అయితే బుచ్చి బాబు తాజాగా ఓ విషయాన్ని వెల్లడించారు. తనకూ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు మధ్య ఉన్న బంధాన్ని తెలియజేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..
తొలిచిత్రంతోనే జాతీయ పురస్కారం..
బుచ్చిబాబు ఏపీలోని ఉప్పాడకు చెందిన వాడు. తన విద్యాభ్యాసం ముగిసిన తర్వాత నేరుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో అడుగు పెట్టి సుకుమార్ దర్శకత్వ బృందంలో చేరి పదేళ్ల పాటు మెళకువలు నేర్చుకున్నారు. ఇక 2021 లో బుచ్చిబాబు తన తొలి చిత్రం ఉప్పెనతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలను హీరోహీరోయిన్లుగా తీసిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ అయ్యింది. ఈ సినిమాకు గానూ ఏకంగా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ను సొంతం చేసుకున్నారు. బెస్ట్ డైరెక్టర్ గా సైమా అవార్డ్ ను అందుకున్నారు. ఇక నెక్ట్స్ రాబోయే 'పెద్ది' చిత్రంతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

పూరీ జగన్నాథ్ గురించి బుచ్చిబాబు..
తాజాగా బుచ్చిబాబు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో బుచ్చిబాబుకు ఉన్న దగ్గర సంబంధాన్ని తెలియజేశారు. పూరీ తో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ ఇలా వివరించాడు. మేము ఇద్దరం పిఠాపురం పట్టణంలోనే జన్మించాం. మా ఇద్దరి అమ్మలు ఒకే ఆస్పత్రి సీఎంసీ లో డెలివరీ అయ్యారు. పైగా ఇద్దరం ఒకే మార్గంలో ప్రయాణిస్తున్నాం. ఇదంతా దేవుడి విధి. నాకు ఎప్పటికీ ఎంతగానో నచ్చే వ్యక్తి పూరీ సార్. అని చెప్పుకొచ్చారు. అయితే గతంలో మెగాస్టార్ ను హీరోగా లాంచ్ చేసింది పూరీ జగన్నాథ్. ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ క్రేజ్, ఇమేజ్ కు తగ్గ సినిమాను బుచ్చి బాబు డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఇలా పూరీ జగన్నాథ్, తను ఓకే ప్రాంతం వారిమని చెప్పుకొచ్చారు. రక్త బంధం లేకపోయినా ఇలా ప్రత్యేకమైన రిలేషన్ ఉందని చెప్పుకొచ్చారు.
బుచ్చిబాబు జీవితంలో సుకుమార్ కీలక పాత్ర..
బుచ్చిబాబు దర్శకుడు సుకుమార్ దగ్గర కొన్నేళ్లుగా అసోసియేట్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ క్రమంలో వారి మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది. ఇక బుచ్చిబాబు కెరీయర్ విషయంలో సుకుమార్ ఎంతో కేర్ తీసుకోవడం, ప్రతి విషయంలో తానే చేయ్యి పట్టుకొని నడిపిస్తున్నారు. ఉప్పెన సినిమాతో డైరెక్టర్ గా లాంచ్ చేయడమే కాకుండా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను కూడా డైరెక్ట్ చేసే అవకాశానికి బాటలు వేశారు. ఇక బుచ్చిబాబు పుష్ప2కు కూడా సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం విశేషం.
పెద్ది 2 షూటింగ్ విశేషాలు..
విలేజ్ బ్యాక్ డ్రాప్ లోని నిజ జీవిత కథ, కొంత స్ఫూర్తిదాయకమైన అంశాలతో పెద్ది సినిమా కథను డెవలప్ చేశారు బుచ్చిబాబు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లలో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. కన్నడ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











