Vijay Deverakonda రియల్ హీరో.. 2 కోట్లు పంపిస్తే అప్పు తీర్చుకోమని తిప్పి పంపించాడు.. పూరీ జగన్నాథ్
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్‌గా పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహర్ సంయుక్తంగా పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వరంగల్‌లోని కాజీపేటకు సమీపంలోని మడికొండలో ఉన్న సత్యసాయి కన్వెన్షన్‌లో ఫ్యాన్‌డమ్ టూర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..

కరణ్ కింగ్ ఆఫ్ బాలీవుడ్
హాయ్ వరంగల్.. అన్నా నమస్తే.. వర్షం పడుతున్నా తడుచుకొంటూ నిలబడిన ప్రతీ ఒక్కరికి లవ్ యూ. ఈ సినిమా వెనుక నిలబడిన వ్యక్తి కరణ్ జోహర్. ఆయన కింగ్ ఆఫ్ బాలీవుడ్. ఆయన జీవితాన్ని రాజులాగే గడుపుతాడు. ఆయన నుంచి చాలా నేర్చుకొన్నాను. థ్యాంక్స్ టూ కరణ్ జోహర్. అపూర్వ మెహతా తదితరులందరికీ నా ధన్యవాదాలు అని పూరీ జగన్నాథ్ మాట్లాడుతుండగా.. విజయ్ దేవరకొండ అంటూ అభిమానులు నినాదాలు చేశారు.

మా ఆవిడ తిట్టింది అంటూ పూరీ
దాంతో పూరీ తన స్పీచ్‌ను విజయ్ దేవరకొండ గురించి చెబుతూ.. ఒక రోజు మా ఆవిడ తిట్టింది. కొత్త డైరెక్టర్లు మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. మీరు వెనకబడి పోతున్నారు. మీరు పక్క వాళ్ల సినిమాలు చూడు అని అన్నారు. అయితే ఏ సినిమా చూడాలని అడిగితే.. సందీప్ రెడ్డి వంగ అని అర్జున్ రెడ్డి సినిమా తీశాడు. విజయ్ అనే కుర్రాడు తీశాడు. నేను నా కూతురు మూడుసార్లు చూశాం అని మా ఆవిడ చెప్పింది.

విజయ్ దేవరకొండ వద్దే ఆగిపోయా
దాంతో అర్జున్ రెడ్డి సినిమా చూడటం మొదలుపెట్టి 40 నిమిషాల తర్వాత ఆపేశాను. ఆ తర్వాత కథ ఏం జరిగిందని తెలుసుకోవాలనే ఆసక్తి కలుగలేదు. డైరెక్షన్, అన్నీ బాగున్నాయి. కానీ నేను విజయ్ దేవరకొండ వద్దే ఆగిపోయా. విజయ్ యాక్టింగ్ చూసిన తర్వాత అతడితో సినిమా చేయాలని అప్పుడే అనుకొన్నాను అని పూరీ జగన్నాథ్ అన్నారు.

ఆ నిజాయితే నాకు నచ్చిందంటూ
విజయ్‌లో నాకు నచ్చినది నిజాయితీ. యాక్టింగ్‌లోను, వ్యక్తిత్వంలో అదే నిజాయితీ ఉంది. అతడు అమేజింగ్ యాక్టర్. సినిమాల్లోనే హీరో కాదు.. రియల్ లైఫ్‌లో కూడా హీరోనే. ప్రొడ్యూసర్‌గా కోటి రూపాయలు ఇస్తే.. సినిమాకు ఖర్చు పెట్టండి.. నేను తర్వాత తీసుకొంటానని చెప్పి తిప్పి పంపిస్తాడు. ఆ తర్వాత రెండు కోట్లు ఇస్తే.. మీరు అప్పుల్లో, కష్టాల్లో ఉన్నారు.. వాటి గురించి చూడండి. ముందు అప్పు తీర్చమని అంటాడు. ఈ రోజుల్లో అలా అనే వాడు ఎవడైనా ఉన్నాడా అని పూరీ జగన్నాథ్. విజయ్‌కు హ్యాట్సాఫ్ అని పూరీ అన్నారు.

నన్ను ఆయన తండ్రిలా చూసుకొన్నారు
విజయ్ దేవరకొండ ఫాదర్ నాకు స్నేహితుడు. లైగర్ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు.. మంచి సినిమా తీయండి అంటూ ఆయన నాకో మాట చెప్పాడు. నీ కొడుకులా చూసుకోమని చెప్పాడు. కానీ విజయ్ నన్ను వాళ్ల డాడీలా చూసుకొన్నాడు. సినిమా కోసం చాలా పనులు చేశాడు. చార్మీతో కలిసి ప్లానింగ్ చేస్తాడు. నీలాంటి హీరోను నేను ఎప్పుడూ చూడలేదు. లవ్ యూ అని పూరీ జగన్నాథ్ అన్నారు.


Click it and Unblock the Notifications











