జబర్దస్త్ బ్యాచ్ చేతిలో మోసపోయా.. టాలీవుడ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
హృదయ కాలేయంతో కెరీర్ స్టార్ట్ చేసి కొబ్బరిమట్ట, కలర్ ఫోటో, బేబీ, ఇప్పుడు రీసెంట్‌గా చెన్నై లవ్ స్టోరీతో వరుస విజయాలను అందుకున్నారు రచయిత, దర్శకుడు సాయి రాజేష్. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ విజయాలను అందుకున్నారు. కలర్ ఫోటో, బేబీ సినిమాలకు గాను మూడు జాతీయ చలన చిత్ర అవార్డులను అందుకుని సంచలనం సృష్టించారు సాయి రాజేష్. అయితే ఇదంతా రాత్రికి రాత్రి వచ్చింది కాదు.. దీని వెనుక ఎంతో కష్టం, అవమానాలు, చీత్కారాలు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్లలో పడిన ఇబ్బందులను సాయి రాజేష్ పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
హృదయ కాలేయం సినిమా తీసేటప్పుడు నాకు ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేదు. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? సినిమాలకు పీఆర్‌వోలు, పీఆర్ కన్సల్టెన్సీలు ఉంటాయన్న విషయం కూడా నాకు తెలియదు. 70 లక్షలు అప్పు కట్టాలి, సినిమా రిలీజ్ చేయాలి.. నా దగ్గర ఉన్నది ఒక్క ఆడియో ఫంక్షన్ మాత్రమే. ఈ ఈవెంట్ జరిగితే సినిమాను కొనడానికి బయ్యర్లు వస్తారు. కానీ ఆడియో ఫంక్షన్ చేయడానికి ఒక్క రూపాయల కూడా లేదు.. చివరికి సినిమాలో హార్ట్ విసిరేసే సీన్‌ని వీఎఫ్ఎక్స్‌లో తీయలేక అక్కడితో ముంగిచేశాను అని సాయి రాజేష్ తెలిపారు.

ఆడియో కంపెనీలు గేమ్ ఆడేవి.. తొలుత ఓ కంపెనీ వాళ్లు ఫోన్ చేసి 5 లక్షలు ఇస్తామని అడగటంతో ఇచ్చేస్తానని చెప్పా. ఆ వెంటనే మరో కంపెనీ నుంచి ఫోన్ వచ్చి 3 లక్షలు ఇస్తాం.. మాకు ఆస్తారా అని మాట్లాడేవారు. ఆల్రెడీ 5 లక్షలకు బేరం కుదిరిందని చెప్పి దానిని రిజెక్ట్ చేశా. తీరా 5 లక్షల వాళ్ల దగ్గరికి వెళితే మాకు వద్దు అనేవాళ్లు.. 3 లక్షల వాళ్ల దగ్గరికి వెళితే ఒకటిన్నర లక్షలకు మించి ఇవ్వలేమని ఫుట్‌బాల్ ఆడుకునేవాళ్లు. ఇలాంటి టైంలో మధుర శ్రీధర్ గారి దగ్గరికి వెళ్లి నా సినిమా ఆడియోకు మార్కెట్ లేదు.. కానీ నాకు డబ్బులు కావాలి? ఎంత ఇస్తారని బేరం పెట్టా.. ఆయన ఒక్క క్షణం షాకై.. నా మీద నమ్మకంతో లక్షన్నర ఇచ్చారని చెప్పారు.
లక్షన్నర రూపాయలు తీసుకుని ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీల చుట్టూ తిరిగా. అప్పుడే మ్యాక్స్ మీడియా అనే ఒక కంపెనీ వచ్చింది.. వాళ్ల దగ్గరికి వెళ్లి పరిస్ధితి చెప్పి లక్షన్నర వాళ్లకి ఇచ్చేశా. వాళ్లు తాజ్ డెక్కన్‌లో ఆడియో ఫంక్షన్ పెట్టారు. రాజమౌళి గారు, మధుర శ్రీధర్ గారు, రామ్ గోపాల్ వర్మ, సంపూర్ణేష్ బాబుకు జబర్దస్త్ బ్యాచ్‌లో ఫ్రెండ్స్, సందీప్ కిషన్, మారుతి గారు వస్తారు కాబట్టి ఆడియో ఫంక్షన్ కళకళలాడిపోతుందని అనుకున్నాం. కానీ చివరి నిమిషంలో జబర్దస్త్ బ్యాచ్ ఒక్కరు కూడా ఫోన్లు ఎత్తలేదు.. చేతిలో డబ్బులేదు, టీవీ ఛానెల్స్ వాళ్లకి పెద్ద పెద్ద మాటలు ఇచ్చేశా ఆడియో ఫంక్షన్ ఎలా చేయాలా అని టెన్షన్ పడ్డానని సాయి రాజేష్ చెప్పారు.
ఆడియో ఫంక్షన్ రోజున సంపూర్ణేష్ బాబు చేతిలో కారు స్టీరింగ్ పెట్టి నేను స్పీచ్ రాస్తూ కూర్చొన్నా మణికొండకు వెళ్లేసరికి స్పీచ్ రెడీ చేశాను. ఇది కనుక నేను అనుకున్నట్లుగా సంపూ చెబితే ఆడియో ఫంక్షన్ వైరల్ అవుతుందని అనుకున్నా. నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదని స్పీచ్ పేపర్లు తన చేతిలో పెట్టా. ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అయ్యేనాటికి అందరూ హ్యాండ్ ఇచ్చారు. ఫంక్షన్ ఏదో నడుస్తోంది.. టీవీ ఛానెల్స్ వాళ్లు మనల్ని నమ్మారు సరిగా చేయలేకపోతున్నానని బాధపడుతుండగా సంపూ వచ్చి నేను మాట్లాడలేను అన్నాడు. దాంతో అతనిని పక్కకి తీసుకెళ్లి.. నాకు ఇంకో సినిమా తీసే ధైర్యం ఉంది, నిన్ను హీరోగా ఎవరైనా తీసుకుంటారా అని అడిగానని సాయిరాజేష్ తెలిపారు.
ఆ దెబ్బతో సంపూర్ణేష్ మైక్ పట్టుకుని అటు ఇటు నడిచి ఓ డైలాగ్‌తో స్పీచ్ మొదలెట్టగానే జనం అరుపులు, కేకలతో గోల గోల చేశారు, స్టేజ్ మీదున్న వాళ్లు పడిపడి నవ్వుతున్నారు. టీవీ ఛానెల్స్ వాళ్లు కూడా ఫుల్ హ్యాపీ.. దాంతో సక్సెస్ కొట్టేశామని ఊపిరి పీల్చుకున్నా. ఉదయాన్నే మారుతిగారు మాటీవీతో మాట్లాడి శాటిలైట్స్ రైట్స్ డీల్ చేయించారు. రాజ్ కందుకూరి గారు నైజాం రైట్స్ .. ఇలా రెండు మూడు రోజుల్లో సినిమా మొత్తాన్ని అమ్మేశాను. కానీ ఆ పెయిన్ మాత్రం వెంటాడింది.. ఒకవేళ ఆడియో ఫంక్షన్ ఫ్లాప్ అయ్యుంటే ఏంటీ అనేది ఊహాకు కూడా అందదు అని గుర్తుచేసుకున్నారు సాయి రాజేష్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications



