అదే నా గుర్తింపు.. ఆ దారిని ఎన్నటికీ మర్చిపోను: ఇడుపు కాయితం హీరోయిన్ నాగదుర్గ
ఫోక్ బ్యూటీ నాగదుర్గ.. జానపద పాటలకు కొత్త ఊపు తీసుకొచ్చింది. ఈ డ్యాన్సర్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్, హావభావాలు, పల్లెటూరి యాసతో కట్టిపడేస్తుంది. ఈ అమ్మడు స్టెప్పులేసే ప్రతి ఫోక్ సాంగ్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో యువతలో నాగదుర్గకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఫోక్ డ్యాన్సర్‌గా ఆమె తనదైన ముద్ర వేసుకుంది. త్వరలో హీరోయిన్ గా వెండితెరపై కనిపించబోతుంది. ఈ తరుణంలో ఈ పల్లెటూరి ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?
ఫోక్ డ్యాన్సర్ .. 'కాపోళ్ల ఇంటికాడ', 'ఎర్ర ఎర్రని రుమాలు గట్టి', 'తిన్న తీరం పడ్తలే', 'దారి పొంటొత్తుండు', 'జిల్లెలమ్మ జిట్ట', 'పేరు గళ్ల పెద్ది రెడ్డి' వంటి పలు సూపర్ హిట్ ఫోక్ సాంగ్స్‌తో నాగదుర్గ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆమె నటించిన ప్రతి పాట విడుదలైన కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో నిలిచేది. ముఖ్యంగా పాటల్లో ఆమె వేసే డ్యాన్స్ స్టెప్పులు, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఫోక్ సాంగ్స్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నాగదుర్గ ఇప్పుడు సినీ రంగంలో హీరోయిన్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. బలగం ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్న'ఇడుపు కాయితం ' సినిమాలో ఆమె కథానాయికగా కనిపించనుంది. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగదుర్గ 'శ్రీలత' అనే తెలంగాణ గ్రామీణ యువతి పాత్రలో నటిస్తోంది. ఫోక్ కళాకారిణిగా ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాగదుర్గ.. ఇప్పుడు హీరోయిన్‌గా కూడా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న 'ఇడుపు కాయితం 'హీరోయిన్ నాగదుర్గ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగదుర్గ.. "ఫోక్ సాంగ్సే నా అసలైన గుర్తింపు. ఆ పాటలు చేసి ఉండకపోతే నేను ఎవరో చాలా మందికి తెలియదు. సినిమా పోస్టర్‌లో నన్ను చూసి 'ఎవరో కొత్త అమ్మాయిని తీసుకొచ్చారు' అనుకునేవారు. అంతేకాదు.. సినిమా ఎందుకు చూడాలి అనే ఆలోచన కూడా చాలామందికి వచ్చి ఉండేది. కానీ ఫోక్ సాంగ్స్ వల్లే ప్రేక్షకులు నన్ను ముందే గుర్తుపట్టారు. 'గర్ల్ నెక్స్ట్ డోర్' అనే ఇమేజ్ కూడా నాకు జానపద పాటల ద్వారానే వచ్చింది" అని చెప్పుకొచ్చింది.
సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నాయని ఫోక్ సాంగ్స్‌కు దూరమవ్వడం సరైన నిర్ణయం కాదని ఆమె అభిప్రాయపడింది. "నేను సినిమా ప్రమోషన్ కోసం ఫోక్ సాంగ్స్ చేయడం లేదు. నేను వచ్చిన దారి అదే. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వేదికను నేను ఎలా మర్చిపోగలను? అందుకే హీరోయిన్ అయినా కూడా అవకాశం దొరికినప్పుడల్లా మంచి ఫోక్ సాంగ్స్ చేస్తూనే ఉంటాను" అని స్పష్టం చేసింది. అలాగే తాను ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నానో కూడా నాగదుర్గ వెల్లడించింది.
"ఒక సినిమాలో కేవలం పాటల కోసం మాత్రమే హీరోయిన్‌ను పెట్టి, డాన్స్ చేయించి పంపించే పాత్రలు నాకు ఇష్టం ఉండవు. అలాంటి సినిమాల్లో నేను నటించను. కథలో హీరోయిన్‌కు ప్రాధాన్యం ఉండాలి. నటిగా నా ప్రతిభను చూపించే పాత్రలు రావాలి. ప్రేక్షకులు నా నటనను గుర్తుంచుకునేలా ఉండే కథలకే నేను ప్రాధాన్యం ఇస్తాను" అని చెప్పింది. నాగదుర్గ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications




