అతను నా కేరవాన్‌లోకి వచ్చి... భయానక సంఘటనను బయటపెట్టిన కాజల్ అగర్వాల్
పెళ్లి తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తూ ఫ్యామిలీని, వృత్తిని సమాంతరంగా బ్యాలెన్స్ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కాజల్ అగర్వాల్. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి నటిగా అగ్రస్థానాన్ని సైతం అందుకున్నారు. ఇప్పుడు తన వయసు, ఇమేజ్‌కు తగినట్లుగా సినిమాలు చేస్తున్నారు ఈ చందమామ. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ అభిమాని కారణంగా ఎదురైన భయానక సంఘటనను బయటపెట్టారు కాజల్. ఈ వివరాల్లోకి వెళితే..
రీసెంట్‌గా కాజల్ అగర్వాల్ నటించిన ది ఇండియా స్టోరీ మూవీ జూలై 24న విడుదల కానుంది. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ బ్యానర్‌పై సాగర్ బీ షిండే నిర్మించారు. శ్రేయస్ తల్పడే, అశ్విని భండే, హర్దీకా జోషి, మురళి శర్మ, మనిష్ వాద్వా, అతుల్ తివారి, కమలేష్ సావంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. నిషాంత్ భగవత్ సినిమాటోగ్రాఫర్‌గా, మంగేష్ ధాక్డే సంగీత దర్శకుడిగా, అనీశ్ మాత్రే ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. దేశంలో ఆహార కల్తీ, కాలుష్యం, రసాయనాల వాడకం, ప్రజల ఆరోగ్యం తదితర అంశాల ఆధారంగా ది ఇండియా స్టోరీని తెరకెక్కించారు చేతన్. ఈ సినిమాలో కాజల్ పవర్‌ఫుల్ లాయర్‌గా కనిపించనున్నారు.

ఇవి కాకుండా హిందీలో రామాయణలో మండోదరిగా నటిస్తున్నారు. తమిళంలో శంకర్ - కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతోన్న ఇండియన్ 3, తెలుగులో నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతోన్న ఎన్‌బీకే 111లో ఛాన్స్ అందుకున్నారు కాజల్. బాలయ్య సరసన ఈ చందమామ నటించడం ఇది రెండోసారి. గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరిలో బాలకృష్ణకు జోడీగా అలరించారు. ఇవి కాకుండా మరిన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. దక్షిణాదితో పాటు ఉత్తరాదికి కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చే దిశగా కాజల్ సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు.
స్వతహాగా వివాదాలకు దూరంగా ఉంటారు కాజల్ అగర్వాల్.. అయితే సెలబ్రిటీగా దేశంలోని సమకాలీన అంశాలపై ఆమె స్పందిస్తూ తన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు. స్త్రీ, పురుష సమానత్వం, హక్కుల విషయంలోనూ మద్ధతుగా మాట్లాడుతుంటారు. షూటింగ్స్‌కు హాజరు కావడం.. లేదంటే కుటుంబంతో గడపటం ఆమె స్టైల్. ఏ మాత్రం తీరిక దొరికినా భర్త, కొడుకు, తన చెల్లెలు నిషా అగర్వాల్‌తో ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. ఇటీవలే తన 41వ పుట్టినరోజును జరుపుకున్నారు ఈ ముద్దుగుమ్మ.
ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటారు కాజల్. ఇన్‌స్టాగ్రామ్‌లో తన సినిమాలు, షూటింట్స్, ఇతర వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. అయితే కొందరు వీరాభిమానులు తనను ఇబ్బంది పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ అభిమాని కారణంగా తాను భయంతో వణికిపోయానని కాజల్ అగర్వాల్ బయటపెట్టారు.
ఓ సినిమా షూటింగ్‌లో ఉండగా.. తొలిరోజు షాట్ పూర్తయ్యాక ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న ఒక వ్యక్తి నా పర్మిషన్ లేకుండా నా కేరవాన్‌లోకి దూసుకొచ్చాడు. రావడం రావడంతోనే తన షర్ట్ విప్పేసి అతని ఛాతీపై నా పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్నట్లు చూపించాడు. ఊహించని ఈ సంఘటనతో వణికిపోయా.. నా మీద అతనికి ఉన్న అభిమానానికి సంతోషమే, కానీ ఇలా నేను ఒంటరిగా ఉన్న సమయంలో ఇలా చేయడం సరికాదని సున్నితంగా హెచ్చరించానని కాజల్ అగర్వాల్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications



