అమ్మమ్మగారిల్లు సినిమా ఫ్యామిలి, డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగశౌర్య, శామిలి, సుమిత్ర, శిజాజి రాజా, సుధ, హేమ, షకలక శంకర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ-కథనం-మాటలు-దర్శకత్వం: సుందర్ సూర్య వహించారు మరియు నిర్మాత రాజేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కళ్యాణ కోడూరి అందించారు.
కథ
పిఠాపురంలో పేకేటి రంగారావు(చలపతిరావు) 100 ఎకరాల ఆసామి. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు, అల్లుళ్లతో సంతోషంగా ఉండే కుటుంబం. అయితే రంగారావు పెద్ద కొడుకు బాబూరావు(రావు రమేష్)కు ఆస్తి పంచుకుని ఆ డబ్బుతో సిటీకి వెళ్లి ఏదైనా వ్యాపారం చేసుకోవాలని ఉంటుంది. ఆస్తి పంచమని అడుగుతాడు. అయితే రంగారావుకు ఇది ఇష్టం ఉండదు. ఈ క్రమంలో జరిగిన వాదనలో తన బావ(సుమన్)పై చేయిచేసుకుంటాడు బాబూ రావు. అల్లుడిని తన కొడుకు అవమానించడాన్ని భరించలేక రంగారావు మనస్థాపంతో చనిపోతాడు. ఆస్తి కోసం తండ్రి చావుకు కారణమయ్యాడని ఊర్లో అంతా అనడంతో కోపంతో ఈ ఆస్తి వద్దు, ఈ కుటుంబంతో సంబంధం వద్దు అంటూ బాబు రావు తన భార్య, కూతురుతో కాకినాడ వెళ్లిపోతాడు. తర్వాత మిగిలిన కొడుకులు, కూతుళ్లు ఎవరి దారి వాళ్లు చూసుకుని వివిధ ప్రాంతాల్లో సెటిలైపోతారు. ఊర్లో రంగారావు భార్య సీతమ్మ (సుమిత్ర) ఒంటరిగా ఉండిపోతుంది.
పంతాలు, పట్టింపులు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో పడి అంతా ఇంటి మొహం చూడటమే మానేస్తారు. కనీసం తండ్రికి పిండం పెట్టడానికి కూడా ఎవరూ రావు. తన కొడుకులు, కూతుళ్లు, మనవళ్లు తనను చూడటానికి వస్తారని ఎదురు చూసీ చూసీ సీతమ్మ అలిసి పోతుంది. తన ఆరోగ్యం కూడా పాడవ్వడంతో ఆస్తులు పంచితే వాటిని తీసుకోవడానికైనా అంతా తనను చూడటానికి వస్తారని ఆశ పడుతుంది. ఈ విషయమై అందరికీ కబురు పెడుతుంది. ఆస్తి పంపకం అనగానే అంతా ఎగేసుకుని వస్తారు. ఒక్కరోజులో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడి వరకు వచ్చిన వారు కనీసం తనతో నాలుగురోజులు కూడా ఉండటం లేదనే అమ్మమ్మ మనసులోని బాధను అర్థం చేసుకున్న మనవడు సంతోష్ (నాగ శౌర్య) వారిలో మార్పు తేవడానికి ఏం చేశాడు? వారి బాధ్యతను వారు తెలుసుకునేలా ఎలాంటి ప్లాన్స్ వేశాడు అనేది తెరపై చూడాల్సిందే.