జై భీమ్ సినిమా తమిళనాడులో జరిగిన లాక్‌డెత్, హత్య నేరారోపణలతో న్యాయవ్యవస్థలో అత్యధిక కాలం విచారణ జరిగిన కేసును ఆధారంగా చేసుకొని జై భీమ్ చిత్రం రూపొందింది. ఇందులో సూర్య, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, రజీషా విజయన్, లిజోమోల్ జోస్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం టీజే జ్ఞానవేల్ వహించారు. నిర్మాత సూర్య శివకుమార్ నిర్మించారు. సంగీతం సీన్ రోల్డన్ అందించారు.
కథ
గిరిజన తెగకు చెందిన రాజన్న పాములను పట్టే వృత్తిని జీవనధారం కోసం కొనసాగిస్తుంటాడు. గ్రామంలోని ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో పాము దూరితే దానిని చాకచక్యంగా పట్టిస్తాడు. ఆ రాజకీయ నాయకుడు ఊరు వెళ్లిన క్రమంలో ఆ ఇంట్లో దొంగలు పడటంతో రాజన్నపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే చేయని నేరాన్ని ఓప్పుకోవాలని పోలీసులు లాకప్‌లో చిత్రహింసలు పెడుతారు. ఆ తర్వాత రాజన్నతోపాటు మరో ఇద్దరు లాకప్ నుంచి తప్పించుకొన్నారని ఆరోపిస్తూ కేసు నమోదు చేస్తారు. అయితే తన భర్త కనిపించడం లేదని అడ్వకేట్ చంద్రు (సూర్య)ను సంప్రదిస్తారు. లాకప్‌లో రాజన్నకు ఏం జరిగింది? పోలీసుల చిత్రహింసలను భరించలేక రాజన్నతోపాటు మరో ఇద్దరు పారిపోయారా? రాజన్న కోసం కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన అడ్వకేట్ చంద్రు ఈ కేసులో తన వాదనలు వినిపించారు. ఈ కేసును ప్రభుత్వం తరఫున వాదించడానికి వచ్చిన అడ్వకేట్ జనరల్ (రావు రమేష్) చంద్రును ఎలా అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. కోర్డు డ్రామాలో ఐజీ పెరుమాళ్లు స్వామి (ప్రకాశ్ రాజ్) పాత్ర ఏమిటి? చివరకు రాజన్న ఏమయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే జై భీమ్ సినిమా కథ.