Devara: దేవర వసూళ్లు ఫేకా? నిజమేంటో తేల్చేసిన ప్రముఖ నిర్మాత!
Devara: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'దేవర (Devara). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించినప్పటికీ, దీని కలెక్షన్స్ నిజమా లేక ఫేకా అనే చర్చ టాలీవుడ్‌లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి ఈ సినిమాకు ప్రీమియర్ షోల నుంచే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందని నిర్మాతలు ప్రకటించారు. దీంతో పలువురిలో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దేవర సినిమాను తెలుగు రాష్ట్రాల్లో మూడు ప్రాంతాలకు డిస్ట్రిబ్యూటర్‌గా చేసిన ప్రముఖ నిర్మాత ధీరజ్ మొగిలినేని ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదంపై స్పందించారు. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే..?
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత ధీరజ్ మొగిలినేని పాల్గొన్నారు. ఈ సమయంలో 'దేవర సినిమా విడుదలై రెండేళ్లు గడిచినా, ఆ చిత్ర బాక్సాఫీస్ కలెక్షన్లపై చర్చలు మాత్రం ఇప్పటికీ ఆగలేదు. ముఖ్యంగా సినిమా ప్రకటించిన వసూళ్లు వాస్తవమేనా? లేక అతిశయోక్తిగా చెప్పారా? అనే అంశంపై సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇంతకీ అసలు విషయమేంటీ ? అని ప్రశ్నించగా.. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని తన అనుభవాన్ని పంచుకున్నారు.

దేవర కలెక్షన్స్ నిజంగా ఓ మిరాకిల్
ధీరజ్ మాట్లాడుతూ.. 'నేను 'దేవర' సినిమాను మూడు ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేశాను. అందుకే ఆ సినిమా కలెక్షన్ల గురించి నాకు ప్రత్యక్ష అవగాహన ఉంది. 'దేవర' కలెక్షన్స్ నిజంగా ఒక మిరాకిల్. సినిమా విడుదలకు ముందు అసాధారణమైన హైప్ ఏర్పడింది. అయితే తొలి రోజు ఎర్లీ మార్నింగ్, మిడ్‌నైట్ షోలు పడటంతో మొదటి స్పందన కొంత మిక్స్‌డ్‌గా వచ్చింది. ఆ ప్రారంభ టాక్ వల్లే కలెక్షన్లపై అనవసర సందేహాలు మొదలయ్యాయి'అని అన్నారు.
డిస్ట్రిబ్యూటర్లలో ఆందోళన
మొదటి రోజు వచ్చిన మిక్స్‌డ్ టాక్ కారణంగా డిస్ట్రిబ్యూటర్లలో కొంత ఆందోళన నెలకొన్న విషయాన్ని కూడా ఆయన అంగీకరించారు. 'ఆ రోజు డిస్ట్రిబ్యూటర్లందరూ కంగారు పడ్డారు. అది వాస్తవమే. కానీ అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఐదు నుంచి ఆరు షోలు కూడా ప్రదర్శించారు. అందువల్ల తొలి రోజు కలెక్షన్లు భారీగానే నమోదయ్యాయి'అని వెల్లడించారు. అయితే అసలు టర్నింగ్ పాయింట్ రెండో రోజు నుంచే వచ్చిందని ధీరజ్ తెలిపారు. 'రెండో రోజు నుంచి వర్డ్ ఆఫ్ మౌత్ పూర్తిగా మారిపోయింది. ఏ సినిమా అయినా మూడు గంటల నిడివి ఉంటే మొత్తం సమయం ఒకే స్థాయిలో ఉండదు. కొన్ని చోట్ల అప్ అండ్ డౌన్స్ సహజం. కానీ ప్రేక్షకుల్లో మాత్రం 'సూపర్ హిట్' అనే టాక్ బలంగా వెళ్లిపోయింది. అదే సినిమాకు పెద్ద బలం అయింది' అని చెప్పారు.
నాలుగు వారాలు నిలకడగా వసూళ్లు
'దేవర నాలుగు వారాల పాటు డీసెంట్ కలెక్షన్లు సాధించింది. ఒక సినిమా నాలుగు వారాలు నిలకడగా వసూళ్లు రాబట్టడం అంటే అది హీరో స్టామినా, అభిమానుల ఆదరణ వల్లే సాధ్యం. ఎన్టీఆర్ డాన్స్ కూడా సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రిపీట్ ఆడియన్స్ భారీగా వచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ అందరూ థియేటర్లకు వచ్చి సినిమాను ఆదరించారు. అందుకే కలెక్షన్లు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా వచ్చాయి'అని ప్రొడ్యూసర్ ధీరజ్ పేర్కొన్నారు. సినిమా విడుదలైన తొలి రోజు కలెక్షన్లు చూసి చాలామంది ఒక స్థాయి వరకు మాత్రమే వసూళ్లు వస్తాయని భావించారని, కానీ ఆ అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తూ సినిమా భారీ బిజినెస్ చేసిందని ధీరజ్ వివరించారు.
'తొలి రోజు చూసి ఈ సినిమా ఇంత వరకే వెళ్తుందని భావించిన వారికి కూడా షాక్ ఇచ్చేలా తర్వాతి రోజుల్లో కలెక్షన్లు వచ్చాయి. అందుకే ఇప్పటికీ 'దేవర' కలెక్షన్లు నిజమా? కాదా? అనే చర్చ కొనసాగుతోంది. కానీ నేను మూడు ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేశాను. మా ఏరియాల్లో అయితే భారీ కలెక్షన్లు వచ్చాయి. అందులో ఎలాంటి సందేహం లేదు'అని స్పష్టం చేశారు.
దుబాయ్ సక్సెస్ పార్టీపై క్లారిటీ
ఇంటర్వ్యూలో యాంకర్ 'దుబాయ్‌లో జరిగిన సక్సెస్ పార్టీ నిజమేనా?'అని ప్రశ్నించగా ధీరజ్ స్పందిస్తూ.. 'దేవర కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవి నిజంగా మిరాకిల్‌లా వచ్చాయి. హీరో ఫాలోయింగ్, సినిమా కథ, విడుదల టైమింగ్ అన్నీ కలిసి రావడంతో అద్భుత ఫలితం వచ్చింది. నిర్మాత నాగవంశీ ఈ సినిమాను ఒక ఛాలెంజ్‌లా తీసుకుని ముందుగానే కొనుగోలు చేశారు. ఆ రిస్క్ చివరికి పెద్ద విజయంగా మారింది. అలాంటి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికే దుబాయ్‌లో సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు'అని వెల్లడించారు.
డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు
చివరగా 'దేవర' బాక్సాఫీస్ ఫలితాలపై మాట్లాడుతూ, 'ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లందరికీ మంచి లాభాలు తీసుకొచ్చింది. చాలా ప్రాంతాల్లో దాదాపు 20 శాతం వరకు లాభాలు వచ్చాయి. అందుకే 'దేవర' బాక్సాఫీస్ ప్రయాణాన్ని నేను ఇప్పటికీ ఒక మిరాకిల్‌గానే భావిస్తాను'అని ధీరజ్ మొగిలినేని అసలు విషయాన్ని వెల్లడించారు.


Click it and Unblock the Notifications






