వారణాసి వివాదం.. రాజమౌళి సినిమా కాంట్రవర్సీకి తెర!
Varanasi Movie Title Issue: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ 'వారణాసి. ఈ సినిమాని శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్‌లో మహేశ్ బాబు 'రుద్ర' పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే.. గత కొన్ని రోజులు ఈ సినిమాపై నెలకొన్న టైటిల్ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఈ విషయం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
రెండేళ్ల క్రితమే టైటిల్ రిజిస్టర్
దాదాపు రెండేళ్ల క్రితమే.. వారణాసి టైటిల్‌ను దర్శకుడు సీహెచ్ సుబ్బారెడ్డి తన బ్యానర్ రామబ్రహ్మ హనుమా క్రియేషన్స్ పేరిట తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారు. అనంతరం గడువు పూర్తయ్యేలోపు రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించారు. దీంతో ఆ టైటిల్‌పై పూర్తి హక్కులు ఆయనకే కొనసాగాయి. ఇదే సమయంలో రాజమౌళి-మహేశ్ సినిమా కోసం కూడా 'వారణాసి' పేరును ఖరారు చేయడంతో వివాదం మొదలైంది. వివాదం పెద్దది కాకముందే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ రంగంలోకి దిగాయి. ఇరు వర్గాలతో పలుమార్లు చర్చలు జరిపాయి.

దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్ కూడా ఈ చర్చల్లో కీలక పాత్ర పోషించారు. చివరకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించింది. చర్చల అనంతరం దర్శకుడు సుబ్బారెడ్డి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా 'వారణాసి' టైటిల్‌ను నిర్మాత కేఎల్ నారాయణకు బదిలీ చేయడానికి అంగీకరించారు. టైటిల్ బదిలీకి సంబంధించిన అధికారిక లేఖను నిర్మాతల మండలికి సమర్పించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని పరిశ్రమ ప్రముఖులు అభినందిస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు సామరస్యంగా పరిష్కారమైంది. దీంతో మూవీ మేకర్స్ ఊపిరిపీల్చుకుంది. ఇక సినిమా అదే పేరుతో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా విడుదల కానుంది.
ఈ నిర్ణయం వెనుక ఆర్థిక ప్రయోజనం లేదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దివంగత సూపర్ స్టార్ కృష్ణకు, మహేశ్ బాబుకు తాను వీరాభిమానినని చెప్పారు. రాజమౌళి-మహేశ్ బాబు కలయికలో రూపొందుతున్న భారీ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచుతుందని భావించి, టైటిల్‌ను ఇవ్వడం తన అదృష్టంగా భావించినట్లు వెల్లడించారు.
టైటిల్‌ను ఎప్పుడూ వ్యాపారంగా చూడలేదని సుబ్బారెడ్డి తెలిపారు. ఒక్క రూపాయి కూడా తీసుకోవాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. 'వారణాసి' అనే పేరు తనకు ఒక భావోద్వేగమని, అలాంటి పేరును మంచి సినిమా కోసం ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణ, కీరవాణి, చంద్రబోస్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.
సాధారణంగా టైటిల్ వివాదాలు కోర్టుల వరకు వెళ్లే సందర్భాలు పరిశ్రమలో కనిపిస్తుంటాయి. కానీ 'వారణాసి' విషయంలో మాత్రం చర్చల ద్వారా పరిష్కారం లభించింది. పరస్పర గౌరవం, పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు కూడా ఇదే తరహాలో పరిష్కారం కావచ్చనే ఆశాభావాన్ని సినీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న ఈ సినిమాను విడుదల చేయాలని మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications




