జానకమ్మ ప్రేమకథలో ఇన్ని ట్విస్టులా?.. గుండెను తాకే రియల్ లైఫ్ స్టోరీ!
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో కోట్లాది మంది అభిమానుల సొంతం చేసుకున్న గానకోకిల ఎస్. జానకి ఇక లేరు. 'నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా'గా, 'జానకమ్మ'గా కోట్లాది మంది అభిమానుల ప్రేమను అందుకున్న ఆమె 88వ ఏట కన్నుమూశారు. ఈమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఏడు దశాబ్దాలకు పైగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు అనేక భారతీయ, విదేశీ భాషల్లో వేలాది పాటలు ఆలపించారు. సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే ఆమె గాన ప్రస్థానం గురించి అందరికీ తెలిసినా, ఆమె అందమైన ప్రేమకథ కొంతమందికి మాత్రమే తెలుసు.. ప్రేమ, నమ్మకం, త్యాగం, అంకితభావానికి ప్రతీకగా నిలిచిన జానకమ్మ - వి. రామ్‌ప్రసాద్ దాంపత్యం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.
ఫొటోతో మొదలైన ప్రేమ
జానకమ్మ చిన్నతనం నుంచే సంగీతంపై అపారమైన ఆసక్తి పెంచుకున్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పాటలు పాడుతూ ఉండేవారు. ఆ సమయంలో ఆమె మామయ్య చంద్రశేఖర్ నాటక రంగంలో మంచి పేరు సంపాదించిన కళాకారుడు. ఆయనతో కలిసి హైదరాబాద్‌లో ఉండే రోజుల్లో జానకి తరచూ స్టేజ్ ప్రోగ్రామ్‌లలో పాటలు పాడేవారు. చంద్రశేఖర్ మేకప్ మార్చుకునే విరామ సమయంలో ప్రేక్షకులను అలరించేందుకు లతా మంగేష్కర్ పాటలు పాడేదాన్ని అని జానకమ్మ ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

అదే సమయంలో ఒక రోజు చంద్రశేఖర్ జేబులో నుంచి ఓ యువకుడి ఫొటో కింద పడింది. ఆ ఫొటోలో కనిపించిన వ్యక్తిని చూసిన జానకి ఎందుకో ఆకర్షితురాలయ్యారు. ఆ ఫొటోను ఎవరికీ తెలియకుండా తీసుకుని దాచుకున్నారు. ఆ యువకుడు మరెవరో కాదు... భవిష్యత్తులో తన జీవిత భాగస్వామిగా మారిన వి. రామ్‌ప్రసాద్. "అది ప్రేమో కాదో తెలియదు. కానీ ఆ ఫొటో నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఏదో తెలియని అనుబంధం అనిపించింది" అని జానకమ్మ స్వయంగా వెల్లడించారు.
కొన్ని రోజుల తర్వాత రామ్‌ప్రసాద్ స్వయంగా జానకిని కలిశారు. ఆమె పాటలు విన్న వెంటనే అసాధారణ ప్రతిభను గుర్తించారు. కేవలం స్టేజ్‌పై పాటలు పాడే అమ్మాయి కాదని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకునే గొప్ప గాయని అవుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. రామ్‌ప్రసాద్ తన తండ్రితో మాట్లాడుతూ, "ఈ అమ్మాయి నాటకాల్లో పాటలు పాడటానికే పరిమితం కాకూడదు. సినిమా రంగంలో అవకాశాలు కల్పించాలి. భవిష్యత్తులో దేశం మొత్తం గర్వపడే గాయని అవుతుంది" అని చెప్పారని జానకమ్మ గుర్తు చేసుకున్నారు. ఆయన మాటలకు చంద్రశేఖర్ కూడా ప్రేరణ పొంది సినీ నిర్మాతలు, సంగీత దర్శకులను కలిసి జానకి ప్రతిభ గురించి పరిచయం చేశారు.
ప్రేమగా మారిన పరిచయం
రామ్‌ప్రసాద్ పరిచయం క్రమంగా స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా రామ్‌ప్రసాద్ భార్య కెరీర్‌కే తన జీవితాన్ని అంకితం చేశారు. జానకమ్మ ప్రతి రికార్డింగ్‌కు ఆయన వెంట ఉండేవారు. ఆమెకు ఎక్కడైనా కార్యక్రమం ఉంటే తప్పకుండా తోడుగా వెళ్లేవారు. ఆమె విజయం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టారని సినీ వర్గాలు చెబుతుంటాయి.
జానకమ్మ కూడా అనేక సందర్భాల్లో భర్త గురించి ఎంతో ప్రేమగా మాట్లాడారు. "ఆయనకు నా ప్రతి పాటంటే ఎంతో ఇష్టం. నేను రికార్డింగ్‌కు వెళ్తే ఒక్కరోజు కూడా నన్ను ఒంటరిగా పంపేవారు కాదు. నేను కూడా ఆయన లేకుండా ఉండలేకపోయేదాన్ని. ఆయన తన జీవితమంతా నా కోసమే గడిపారు. ఆయన ప్రోత్సాహం లేకపోతే నేను ఈ స్థాయికి చేరుకునేదాన్ని కాదు. ఈరోజు కూడా ఆయన నా ఆలోచనల్లో నాతోనే ఉన్నారు" అని చెప్పారు.
భర్త మరణం... జీవితంలో పెద్ద విషాదం
1997లో రామ్‌ప్రసాద్ గుండెపోటుతో కన్నుమూయడం జానకమ్మ జీవితంలో అతిపెద్ద విషాదం. ఆ తర్వాత ఆమె తన జీవితంలో ఎన్నో మార్పులు చేసుకున్నారు. భర్త జ్ఞాపకార్థంగా రంగురంగుల చీరలు, బంగారు జరీ అంచులు ఉన్న చీరలు ధరించడం మానేశారు. జీవితాంతం సాధారణ రంగుల చీరలనే ధరిస్తూ ఆయన జ్ఞాపకాలను హృదయంలో నిలుపుకున్నారు. భౌతికంగా జానకమ్మ మన మధ్య లేకపోయినా, ఆమె ఆలపించిన వేలాది అమరగీతాలు, ఆమె ప్రేమకథ, ఆమె జీవితం అందరికీ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలిచిపోతాయి. ఆమె గాత్రం తరతరాల సంగీతాభిమానుల హృదయాల్లో చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది.


Click it and Unblock the Notifications




