రమాప్రభ గారు 1946, మే 5న అనంతపురం జిల్లాలోని కదిరిలో జన్మించారు. రమాప్రభ కొట్టి చిన్నమ్మ, గంగిశెట్టి దంపతులకు నాలుగో సంతానంగా పుట్టింది.
ఆమె పుట్టే నాటికి ఆమె మేనత్త, మేనమామలకు పిల్లలు లేరు. రమాప్రభ నెలరోజుల పసికందుగా ఉన్నప్పుడు మాకిచ్చేయరాదా పెంచుకుంటాము అని మేనత్త మేనమామ అడగగా, తల్లిదండ్రులు దత్తత ఇచ్చేశారు.
మేనమామ కృష్ణదాస్ ముఖర్జీ అబ్రకం గనుల్లో పని చేసేవాడు. రమాప్రభ బాల్యం కదిరిలో కొంతకాలం ఆ తర్వాత ఊటి సమీపంలోని లోయలో సాగింది. ఒక్కగానొక్క పెంపుడు కూతురు కాబట్టి తనను గారాభంగా పెంచారు.
కానీ రమాప్రభకు పన్నెండేళ్లు వచ్చేసరికి పెంపుడు తండ్రి చనిపోయాడు. వ్యవసాయ కూలీ అయిన సొంత తండ్రి పదమూడు మంది సంతానంతో వారిని సాకలేక సతమతమవుతూ, కూలీ పని లేనప్పుడు ఇంట్లో గాజుల మలారం పెట్టుకొని గాజులు అమ్మేవాడు. అలాంటి పరిస్థితుల్లో రమాప్రభ, పన్నెండేళ్ల వయసులో మేనత్త రాజమ్మతో కలిసి మద్రాసు చేరుకుంది.
ఆ తర్వాత సినిమాలలో నటించి మంచినటిగా ఆంధ్రదేశంలో పేరు గడించారు. హాస్య నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న రమాప్రభ ఎన్నో సినిమాల్లో, ఎంతోమంది సరసన, ముఖ్యంగా అల్లు రామలింగయ్య, రాజబాబు వంటి నటుల జోడీగా నటించింది. సినిమాల్లోకి రాక ముందు తమిళ నాటకరంగంలో నాలుగువేలకు పైగా రంగస్థల ప్రదర్శనలిచ్చారు.
రాజబాబు, రమాప్రభ జంట ప్రేక్షకులందరినీ హాస్యపు జల్లులతో ముంచెత్తేది. పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య మొదలగు హాస్యనటుల కాంబినేషన్లో నవ్వుల పూదోటలో నడిపించిన నటి రమాప్రభ.
రమాప్రభగారు సుమారు 1400 పైగా సినిమాలలో నటించారు.