ఎస్వీ కృష్ణారెడ్డి గా పిలువబడే సత్తి వెంకటకృష్ణా రెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, రచయిత, సంగీతదర్శకుడు, నటుడు. దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి. కె. అచ్చిరెడ్డితో కలిసి ఇతను రూపొందించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి.
సంచలన దర్శకుడు కృష్ణారెడ్డి పూర్తి పేరు సత్తి వెంకట కృష్ణారెడ్డి. పుట్టింది జూన్ 1, 1961న తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి దగ్గరలో వున్న కొంకుదురులో. బాల్యం గడిచింది కూడా అక్కడే. తండ్రి వెంకటరెడ్డి ఆవూరిలో మోతుబరి రైతు. తల్లి సుబ్బాయమ్మ గృహిణి. తండ్రి వ్యవసాయంతోబాటు చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసేవారు. ప్రాధమిక విద్యాభ్యాసం పుట్టిన వూళ్లోనైనా హైస్కూలు చదువుకు ఎదిగేనాటికి కృష్ణారెడ్డి కుటుంబం తణుకు పట్టణానికి దగ్గరలో వున్న ఆరవల్లికి మకాం మార్చింది. కృష్ణారెడ్డి హైస్కూలు చదువు ఆ ఊళ్లోనే కొనసాగింది. తరువాత అక్కడకు దగ్గరలో వున్న భీమవరం డి.ఎన్.ఆర్.కాలేజిలో ఎం.కాం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. చదువుతోబాటు సినిమాలంటే కృష్ణారెడ్డికి చాలా ఇష్టం. సినిమాలే లోకంగా భావించి ఎప్పటికైనా సినిమా హీరో కావాలని కలలు కనేవారు. ముఖ్యంగా సినిమాలు చూశాక వాటి లోటుపాట్లను గుర్తించడం, వాటి విలువలను తెలుసుకోవడం వంటి విషయాలను మిత్రులతో చర్చిస్తూ విశ్లేషణ జరపడం కృష్ణారెడ్డికి అలవాటుగా మారింది. హీరో కావాలనే తపన అయితే ఉండేదే గాని ఏనాడు కాలేజి స్థాయిలో నాటకాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు.
కృష్ణారెడ్డికి సొంతంగా సినిమా నిర్మిద్దామనే ఆలోచన రావడంతో ఒక కొత్తరకం కథకు రూపకల్పన చేశారు. కథాచర్చలు అచ్చిరెడ్డితో పూర్తిచేసి దానికి అవసరమైన స్కీన్ర్ ప్లే స్వయంగా సమకూర్చి సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. సంభాషణలను దివాకరబాబు సమకూర్చగా మనీషా ఫిలిమ్స్ పతాకం మీద సినిమా నిర్మాణం హైదరాబాదు అన్నపూర్ణా స్టూడియోలో ప్రారంభమైంది. అచ్చిరెడ్డి నిర్మాతగా, కాట్రగడ్డ రవితేజ దర్శకుడిగా ఆ చిత్రం పూర్తిచేశారు. రాజేంద్రప్రసాద్, నిరోషా హీరో హీరోయిన్లు. కథ, స్కీన్ర్ ప్లేతోబాటు కృష్ణారెడ్డి సంగీతం కూడా సమకూర్చారు. పిరికివాడైన ఒక యువకుడికి ఒక ప్రొఫెసర్ ఆత్మవిశ్వాసం కలిగేలాచేసి, అతడిని ఇబ్బందులనుంచి గట్టేక్కించడం ఈ చిత్ర నేపథ్యం. క్రమబద్ధమైన ప్రణాళిక, అశ్లీలంలేని కథారచన, వినోద ప్రధానమైన సినిమాగా రూపొందించడంతో ‘కొబ్బరి బొండాం’ సినిమా 1991లో విడుదలై విజయాన్ని సాధించింది. అయితే హీరో కావాలన్న కృష్ణారెడ్డి కల కలలాగే మిగిలిపోయింది. ‘కొబ్బరి బొండాం’ సినిమా తరువాత తనే హీరోగా నటించాలని ఒక మంచి కామెడీ కథను తయారుచేసుకున్నారు కృష్ణారెడ్డి. కొన్ని పాటలు కూడా రాయించి వాటికి మట్లు కట్టుకున్నారు. కాస్త అనుభవమున్న దర్శకుణ్ణి పెట్టుకుంటే సినిమాకు పేరోస్తుందని కొందర్ని కలిశారు. వారంతా కథలో మార్పులు సూచించడం మొదలెట్టారు. అప్పుడు అచ్చిరెడ్డి కలిపించుకొని ‘తొలి సినిమాకు కథ, స్కీన్ర్ ప్లే నువ్వే రాశావు. సంగీతం కూడా సమకూర్చావు. తొలి సినిమా నిర్మాణం అనుభవం నీకు ఎంతైనా వుంది. నువ్వే ఎందుకు దర్శకత్వం వహించ కూడదూ’ అంటూ కృష్ణారెడ్డిని ప్రోత్సహించడంతో దర్శకత్వం వైపు కృష్ణారెడ్డి రూటు మార్చుకున్నారు.
కిశోర్ రాఠీ సమర్పణలో మనీషా ఫిలిమ్స్ పతాకం మీద ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’ (1992) సినిమా నిర్మాణానికి అవరోధాలన్నీ తొలగాయి. గతంలో శాండో చిన్నప్ప దేవర్ గుర్రం, కుక్క వంటి జంతువులతో రాబిన్‌హుడ్ వంటి హీరో రాజన్‌ను పెట్టి ‘నీలమలై తిరుడన్’; పులి-హీరో స్నేహితులుగా పెట్టి ఎం.జి.ఆర్‌తో ‘వెట్టికారన్’; ఏనుగు- హీరోకి లంకె పెట్టి రాజేష్ ఖన్నాతో ‘హాథీ మేరె సాథీ’ వంటి సినిమాలు తీసి విజయం సాధించి ఉండడంతో, కృష్ణారెడ్డి ఏనుగు పాత్రకు రూపకల్పన చేసి చిత్రకథను వినూత్నంగా రూపొందించారు. గతంలో లాగే దివాకరబాబు మాటలు, కృష్ణారెడ్డి సంగీతంతో ఈ సినిమా నిర్మితమైంది. రాజేంద్రప్రసాద్ హీరోగా, సౌందర్య హీరోయిన్‌గా నటించగా బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఆలి, మల్లికార్జునరావు, గుండు హనుమంతరావు, గౌతమ్ రాజు, శ్రీలక్ష్మి, కల్పనారాయ్, జయలలిత వంటి ఎందరో కమెడియన్లు నవ్వులు పూయించారు. ఈ సినిమా బాక్సాఫీస్ హిట్‌గా నిలిచి కృష్ణారెడ్డిని దర్శకుడిగా ఎన్నో మెట్ల పైకి ఎక్కించింది. ఈ చిత్రాన్ని మిథున్ చక్రవర్తి హీరోగా, రాశి హీరోయిన్‌గా హిందీలో ‘జోడిదార్’ (1997) పేరుతో పునర్నిర్మించారు. ఏనుగు చెయ్యగల పనులకు అనుగుణంగా సన్నివేశాలను అల్లి సినిమాను జనరంజకం చేశారు.
‘రాజేంద్రుడు-గజేంద్రుడు’ చిత్రం తరువాత రాజేంద్రప్రసాద్, సౌందర్య హీరో హీరోయిన్లుగా ‘మాయలోడు’ (1993) చిత్రాన్ని కృష్ణారెడ్డి దర్శకత్వంలో మనీషా ఫిలిమ్స్ బ్యానర్ మీదే నిర్మించారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబూమోహన్, ఆలి, గుండు హనుమంతరావు, శ్రీలక్ష్మి తమవంతు కామెడీ పంచారు. ఇందులో హీరో గారడీ చేసుకుంటూ బ్రతుకుతుండడం నేపథ్యం. ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. సినిమా బ్లాక్ బస్టర్‌గా రికార్డు నెలకొల్పింది. బాబుమోహన్, సౌందర్యల మీద చిత్రీకరించిన ‘చినుకు చినుకు అందెలతో’ అనే పాట సూపర్ హిట్టయింది. సూపర్ స్టార్ కృష్ణకు సెకండ్ ఇన్నింగ్స్‌లో బాక్సాఫీస్ హిట్ తెచ్చిపెట్టిన మరో సినిమా ‘నెంబర్ వన్’ (1994). అలాగే ఈ సినిమా కృష్ణారెడ్డికి హ్యాట్రిక్ విజయాన్ని సాధించిపెట్టిన చిత్రం కూడా. షిర్డీ సాయి ఫిలిమ్స్ బ్యానర్ మీద కృష్ణారెడ్డి కథ, స్కీన్ర్ ప్లే, సంగీతం, దర్శకత్వం నిర్వహించిన ఈ చిత్రంలో కృష్ణ సరసన సౌందర్య హీరోయిన్‌గా నటించింది. ఆస్థాన రచయిత దివాకరబాబు సంభాషణలు కూర్చారు.
1994లోనే కిశోర్ రాఠీ సమర్పణలో అచ్చిరెడ్డి నిర్మాతగా మనీషా ఫిలిమ్స్ సంస్థ బ్యానర్ మీద కృష్ణారెడ్డి ‘యమలీల’ అనే సోషియో ఫాంటసీ చిత్రాన్ని నిర్మించారు. కథ, స్కీన్ర్ ప్లే, సంగీతం, దర్శకత్వ బాధ్యతలు కృష్ణారెడ్డి నిర్వహించగా దివాకరబాబు మాటలు సమకూర్చారు. ఇందులో కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న ఆలిని హీరోగా పెట్టి సినిమాను బ్లాక్ బస్టర్ చెయ్యడం ఒక్క కృష్ణారెడ్డికి మాత్రమే సాధ్యమైంది. హీరోగా ఆలికి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఇందులో ఇంద్రజ, మంజుభార్గవి, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, గుండు హనుమంతరావు ముఖ్య తారాగణం. ఈ బ్లాక్ బస్టర్ మూవీని నిర్మాత రామానాయుడు వెంకటేష్, రవీనా టాండన్ హీరో, హీరోయిన్లుగా హిందీలో ‘తఖ్దీర్ వాలా’ (1995) పేరుతో పునర్నిర్మించారు. అలాగే తమిళంలో కార్తిక్, సంఘవి జంటగా ‘లక్కీ మాన్’ పేరుతో పునర్నిర్మించారు. ఈ చిత్రం సంవత్సరానికి పైగా ఆది ఎన్నో రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంతో కృష్ణారెడ్డి సూపర్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. తరువాత కృష్ణారెడ్డి ఒక బయట సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీ ప్రియాంక పిక్చర్స్ అధినేత కె. వెంకటేశ్వరరావు నిర్మించిన ‘శుభలగ్నం’ (1994) చిత్రానికి కృష్ణారెడ్డి కథ , స్కీన్ర్ ప్లే సమకూర్చి సంగీత దర్శకత్వం నిర్వహిస్తూ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రెండు ఫిలింఫేర్ బహుమతులు గెలుచుకుంది. అందులో కృష్ణారెడ్డి ఉత్తమ దర్శకుడిగా, సిరివెన్నెల ఉత్తమ గేయరచయితగా (చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక అనే పాటకు) ఎంపికయ్యారు. అలాగే ఈ చిత్రం ఏకంగా మూడు నంది బహుమతులు కూడా గెలుచుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. జగపతిబాబు, ఆమని, రోజా ప్రధాన తారాగణం. ఈ విజయవంతమైన సూపర్ హిట్ చిత్రం హిందీలో ‘జుదాయీ’గా, తమిళంలో ‘ఇరట్టాయ్ రోజా’గా, కన్నడంలో ‘గంగా యమున’గా, మలయాళంలో ‘సుందర పురుషన్’గా పునర్నిర్మితమైంది. ఈ చిత్ర కథాంశమే విభిన్నంగా ఉండడంతో మహిళా ప్రేక్షక జనానికి బాగా వంటబట్టింది. స్త్రీలు తండోపతండాలుగా ఈ సినిమాని ఎన్నోసార్లు చూశారు.
తన విజయ పరంపరను కొనసాగిస్తూ కృష్ణారెడ్డి మరెన్నో సాంఘిక సమస్యలమీద సినిమాలు నిర్మించారు. వాటిలో బాలకృష్ణ, సౌందర్య నటించిన శ్రీ చిత్ర క్రియేషన్స్ వారి ‘టాప్ హీరో’ సినిమాను పేర్కొనాలి. తరువాత 1995లో మనీషా ఫిలిమ్స్ పతాకం మీద నిర్మించిన ‘ఘటోత్కచుడు’ చిత్రాన్ని నిర్మించారు. ఆపదలో వున్న ఒక పాపను రక్షించేందుకు స్వయంగా ఘటోత్కచుడు రావడం ఈ చిత్రం ప్రధాన కథాంశం. ఈ సినిమా ప్రారంభానికి ముందు మహాభారత యుద్ధ దృశ్యంలో శ్రీకాంత్, రాజశేఖర్, గిరిబాబు, ప్రసాద్ బాబు అతిధి పాత్రల్లో కనిపించడం గొప్ప ప్రయోగం. ఘటోత్కచుడుగా సత్యనారాయణ రాణించారు. కృష్ణారెడ్డి కాకుండా ఈ చిత్రానికి రాజ్-కోటి సంగీతం అందించడం విశేషమనే చెప్పుకోవాలి. తరువాత కృష్ణారెడ్డి ఎస్.వి.యస్ సంస్థకు ‘సంప్రదాయం’ చిత్రాన్ని, చంద్రకిరణ్ ఫిలిమ్స్ వారికి ‘మావిచిగురు’, ‘ఎగిరే పావురమా’ చిత్రాలను, సొంత సంస్థకు ‘వినోదం’, ‘ఉగాది’, ‘దీర్ఘ సుమంగళీభవ’ సినిమాలను నిర్మించి ఇచ్చారు. తను ïˆ ారో కావాలనుకున్న కోరికను మనీషా ఫిలిమ్స్ బ్యానర్ మీద నిర్మించిన ‘ఉగాది’ సినిమా ద్వారా తీర్చుకున్నారు. అందులో కృష్ణారెడ్డి సరసన లైలా హీరోయిన్‌గా నటించింది. దివాకరబాబు రచనకు కృష్ణారెడ్డి సంగీతం సబబే. ఈ సినిమాలో సంగీతానికి అధిక మార్కులు పడ్డాయి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో తరువాత ‘పెళ్లిపీటలు’, ‘అభిషేకం’, ‘మనసులో మాట’, ‘ప్రేమకు వేళాయెరా’, ‘సర్దుకుపోదాం రండి’, ‘సకుటుంబ సపరివార సమేతంగా’, ‘బడ్జెట్ పద్మనాభం’, ‘ప్రేమకు స్వాగతం’, ‘జాబిలి’, ‘అతడే ఒక సైన్యం’ వంటి మరెన్నో సినిమాలు వచ్చాయి. ఇవన్నీ ప్రధమార్ధంలో విజయవంతమైనంతగా సక్సెస్ కాలేదు. కృష్ణారెడ్డి 2009లో ‘మస్త్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒకరకంగా అదే కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన చివరి చిత్రంగా భావించాలి. ‘సకుటుంబ సపరివార సమేతంగా’, ‘ఆహ్వానం’ చిత్రాలకు ఉత్తమ దర్శకునిగా కృష్ణారెడ్డికి నంది బహుమతులు లభించాయి. అమెరికన్ దర్శకుల సమాజంలో కృష్ణారెడ్డి సభ్యులుగా వున్నారు.