వాణీ జయరామ్ దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు. 1945 నవంబరు 30న తమిళనాడులోని వేలూరులో ఓ సంగీత కుటుంబంలో జన్మించారు వాణీజయరాం. జన్మతహ తమిళియన్ అయిన వాణీ అసలు పేరు కలై వాణి. జయరాంతో పెళ్ళయిన తర్వాత వాణీజయరాంగా మారారు.
1970లో ప్లేబాక్ సింగర్‌గా మారారు. మొదటి చిత్రం హిందీ మూవీ 'గుడ్డీ'. ఇందులోని 'బోల్‌రే పపీ హరా' పాట తోనే నేషనల్ అవార్డు అందుకున్నారు.
తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, మరాఠి, బెంగాలి, భోజ్‌పురి, తులు, ఒరియా భాషల్లో దాదాపు 10 వేల పాటలు పాడింది. క్లాస్ నుంచి క్లాసికల్ సాంగ్స్ వరకూ, జానపదం నుంచి జాజ్ బీట్స్ వరకూ అన్ని పాటలు పాడింది. హాయిగా పాడేడమే ఆమె స్పెషాలిటీ. గాత్రం వింటే మనిషిని చూడాలనిపించేంతటి ఆ గానసరస్వతి వాణి జయరామ్.
కోదండపాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన 'అభిమానవంతులు' చిత్రంలోని 'ఎప్పటి వలె కాదురా.. నా స్వామి కాదురా అనే పాటతో వాణీజయరాం తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరేస', 'దొరకునా ఇటువంటి సేవ' పాటలతో తెలుగులో బాగా పాపులరయ్యారు. 80ల్లో తెలుగులోకి వచ్చింది వాణి గానామృతం. కె.విశ్వనాథ్, కెవి మహదేవన్ వంటి మ్యూజికల్ కాంబినేషన్ లో పాడే అవకాశం ఆమెకు రావడం..శ్రోతల అదృష్టం. తమిళ్ లో కె బాలచందర్ 'అపూర్వ రాగంగళ్' పేరు వాణి జయరాంకు పేరు తెస్తే.. తెలుగులో విశ్వనాథ్ 'శంకరాభరణం' పేరు తెచ్చింది.
'స్వాతికిరణం, పెళ్లి పుస్తకం, స్వర్ణకమలం, ఆరాధన, శృతిలయలు, సీతాకోకచిలుక, ఇది కథకాదు, గుప్పెడు మనసు, శంకరాభరణం, కరుణామయుడు, మరోచరిత్ర, అంతులేని కథ లాంటి ఎన్నో చిత్రాల్లో పాడింది
78ఏళ్ల వాణీ జయరామ్ గాయనిగా సుమారు 19 భాషల్లో 10వేలకు పైగా పాటలను ఆలపించారు. ఆమె ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మ భూషణ్ పురస్కారం కూడా ప్రకటించింది.
2023 ఫిబ్రవరి 4న చెన్నైలోని తన స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు.