నోరు జారితే అంతే.. జబర్దస్త్ సీక్రెట్ బయటపెట్టిన సత్యశ్రీ!
Jabardasth Satya Sri: 'జబర్దస్త్'.. తెలుగు బుల్లితెరపై కామెడీకి కొత్త నిర్వచనం చెప్పిన షో. 2013లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతోంది. ఎంతో మంది కొత్త ఆర్టిస్టులకు ఈ షో సినీ, టీవీ రంగాల్లో అవకాశాల బాట వేసింది. చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ వంటి అనేక మంది కమెడియన్ల కెరీర్‌కు జబర్దస్త్ మంచి వేదికగా నిలిచింది. అలాగే జడ్జిలుగా వ్యవహరించిన నాగబాబు, రోజా కూడా ఈ షోతో మరింత గుర్తింపు సంపాదించారు. ఇలాంటి క్రేజీ షోలో చమ్మక్ చంద్ర టీమ్‌లో కీలక సభ్యురాలిగా గుర్తింపు తెచ్చుకున్న నటి సత్యశ్రీ తాజాగా జబర్దస్త్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?
'జబర్దస్త్' నటి సత్యశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర టీమ్‌లో కీలక సభ్యురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షో వెనుక ఉన్న కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రేక్షకులకు నవ్వులు పంచే ప్రతి స్కిట్ వెనుక ఎంత క్రమశిక్షణ, ఎంత కష్టం ఉంటుందో ఆమె వివరించారు. ప్రస్తుతం వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న సత్యశ్రీ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన సత్యశ్రీ కళాకారుల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తల్లి కూడా ఒకప్పుడు నటిగా గుర్తింపు పొందారు. అదే బాటలో సత్యశ్రీ కూడా నటనను కెరీర్‌గా ఎంచుకున్నారు. అయితే సినిమాల కంటే ముందు 'జబర్దస్త్' షో ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ముఖ్యంగా చమ్మక్ చంద్ర టీమ్‌లో ఆమె చేసిన స్కిట్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. యూట్యూబ్‌లో కూడా ఆ స్కిట్స్ మిలియన్ల వ్యూస్ సాధించాయి.
జబర్దస్త్ గురించి మాట్లాడుతూ.. ప్రేక్షకులు చూసే కామెడీ అంతా స్పాంటేనియస్‌గా జరిగిపోతుందని చాలామంది అనుకుంటారని, కానీ అది పూర్తిగా తప్పు అని సత్యశ్రీ తెలిపారు. షోలో వినిపించే ప్రతి డైలాగ్ ముందే రాసిన స్క్రిప్ట్ ప్రకారమే ఉంటుందని చెప్పారు. స్టేజ్‌పై ఎవరూ తమకు నచ్చినట్లు డైలాగులు చెప్పరని, రిహార్సల్స్‌లో ఎన్ని సార్లు ప్రాక్టీస్ చేశారో.. అదే విధంగా స్టేజ్‌పై కూడా చెప్పాల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రతి డైలాగ్‌తో పాటు ప్రతి ఎక్స్‌ప్రెషన్ కూడా ముందుగానే ఫిక్స్ అయి ఉంటుందని ఆమె వివరించారు.
ఇక చమ్మక్ చంద్ర గురించి.. స్క్రిప్ట్ విషయంలో చమ్మక్ చంద్ర చాలా కఠినంగా ఉండేవారని సత్యశ్రీ చెప్పారు. 'నేను వెళ్లొస్తా'అని స్క్రిప్ట్‌లో ఉంటే అదే చెప్పాలి. "నేను పోతా" అని సొంత యాసలో చెప్పినా ఒప్పుకునేవారు కాదన్నారు. అంతేకాదు.. "ఎందుకు నా మీద అరుస్తున్నావ్" అనే డైలాగ్‌ను "నా మీద ఎందుకు అరుస్తున్నావ్" అని చిన్న మార్పుతో చెప్పినా కూడా అంగీకరించరని తెలిపారు. ప్రతి పదం, ప్రతి విరామం స్క్రిప్ట్‌లో ఉన్నట్టుగానే రావాలని చమ్మక్ చంద్ర ప్రత్యేకంగా చూసుకునేవారని చెప్పారు.
రిహార్సల్స్‌కు కూడా చాలా ప్రాధాన్యం ఉండేదని సత్యశ్రీ వెల్లడించారు. సాధారణంగా ఒక్కరోజు మాత్రమే రిహార్సల్ చేసేవారని, కానీ, ఆ ఒక్కరోజులోనే స్కిట్‌ను పూర్తిగా పర్‌ఫెక్ట్ చేసే వరకు ప్రాక్టీస్ చేసేవారని తెలిపారు. స్టేజ్‌పై చిన్న పొరపాటు కూడా జరగకుండా ప్రతి ఆర్టిస్ట్‌ను సిద్ధం చేసేవారని చెప్పారు. చమ్మక్ చంద్ర ప్రతి స్కిట్‌ను ఎంతో శ్రద్ధగా తీర్చిదిద్దేవారని, అందుకే ఆయన టీమ్ స్కిట్స్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చేదని గుర్తుచేశారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. స్క్రిప్ట్‌కు భిన్నంగా ఎవరైనా డైలాగ్ చెబితే తీవ్ర పరిణామాలు ఉండేవని సత్యశ్రీ తెలిపారు. ఎవరైనా తమ ఇష్టానుసారంగా డైలాగ్ మార్చి చెప్పినా, పదాలు ముందుకు వెనక్కు చేసినా.. తర్వాతి స్కిట్‌లో అవకాశం ఉండకపోవచ్చని చెప్పారు. అందుకే ప్రతి ఆర్టిస్ట్ కూడా పూర్తి క్రమశిక్షణతో, ఎలాంటి పొరపాట్లు చేయకుండా స్టేజ్‌పైకి వచ్చేవారని వివరించారు. ఇదే జబర్దస్త్‌లో నాణ్యమైన స్కిట్స్ రావడానికి ప్రధాన కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. సత్యశ్రీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.


Click it and Unblock the Notifications





