ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్ ప్రేమాయణం? మళ్లీ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన జంట..
రష్మిక మందన్న- విజయ్ దేవరకొండలు తమ ప్రేమాయణానికి చెక్ పెట్టి వైవాహక బంధంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో వీరిలాగే సీక్రెట్‌గా ప్రేమలో మునిగి తేలుతున్న జంటలు కూడా అలెర్ట్ అయ్యాయి. త్వరగా ప్రేమకు ముగింపు పలికి తాము కూడా పెళ్లి పీటలెక్కాలని ఆశిస్తున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య సంథింగ్.. సంథింగ్ అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా మరోసారి ఈ జంట కలకలం రేపింది. ఈ వివరాల్లోకి వెళితే..
పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్‌లో పాపులర్ అయ్యారు తరుణ్ భాస్కర్. అనంతరం పిట్ట కథలు, కీడా కోలా తదితర సినిమాలు చేశారు. దర్శకుడిగానే కాకుండా హోస్ట్‌గా, నటుడిగానూ ఆయన సత్తా చాటారు. ప్రస్తుతం దర్శకుడిగా కంటే నటుడిగానే ఎక్కువ బిజీగా ఉన్నారు తరుణ్. ఓం శాంతి శాంతి శాంతితో పాటు గాయపడ్డ సింహం సినిమాలలో హీరోగా అలరించారు. ప్రస్తుతం మరికొన్ని సినిమాలలో నటించేందుకు ఆయనకు అవకాశాలు వస్తున్నాయి. అయితే అభిమానులు మాత్రం మరోసారి మెగాఫోన్ పట్టుకుని మీ మార్క్ చూపించాలని తరుణ్‌ని కోరుతున్నారు.

అయితే గత కొంతకాలంగా హీరోయిన్ ఈషా రెబ్బాతో ఆయన క్లోజ్‌గా ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి ఓం శాంతి శాంతి శాంతి అనే మూవీలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని గాసిప్స్ వచ్చాయి. వీటికి బలాన్ని చేకూర్చేలా హీరో విశ్వక్‌సేన్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా కనిపించారు. ఆ వెంటనే కొద్దిరోజులకు రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఈవెంట్‌లో తన ప్రేమకథపై తరుణ్ భాస్కర్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఇది జరిగిన కొద్దిరోజులకే ఉదయ్‌పూర్‌లో జరిగిన విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నల పెళ్లికి తరుణ్ భాస్కర్- ఈషా రెబ్బాలు జంటగా హాజరుకావడంతో వీరిద్దరి మధ్య బంధం నిజమేనని, త్వరలోనే వీరు గుడ్‌న్యూస్ చెబుతారని గాసిప్స్ వైరల్ అయ్యాయి.
మరోసారి వీరిద్దరూ జంటగా మీడియా కెమెరాలకు చిక్కారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాలు పక్కపక్కనే నడుస్తూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ ప్రస్తుతం ఏ సినిమాలోనూ కలిసి నటించడం లేదు అలాంటప్పుడు ఇద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? నిజంగానే తరుణ్ భాస్కర్- ఈషా రెబ్బాలు ప్రేమలో ఉన్నారా? త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ సస్పెన్స్‌కు తరుణ్, ఈషాలు త్వరలోనే చెక్ పెట్టే అవకాశం ఉంది.
ఇకపోతే.. తరుణ్ భాస్కర్‌కి గతంలోనే లతా నాయుడుతో వివాహం జరిగింది. తరుణ్ తెరకెక్కించిన ఈ నగరానికి ఏమైంది, యూటర్న్, పెళ్లిచూపులు తదితర సినిమాలకు ఈమె ప్రొడక్షన్, క్యాస్ట్యూమ్ విభాగాల్లో పనిచేశారు. అయితే వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అటు ఈషా రెబ్బా కెరీర్ కూడా ఏమాత్రం బాలేదు. పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ హిట్ దక్కలేదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ఆమె నటిస్తున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైపోవాలని ఈషా భావిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాలు తమ బంధంపై ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications


