నేను ఇండియన్‌ను కాదు.. పాస్‌పోర్ట్ వెనక్కి ఇచ్చేస్తా.. అఖిల్ అక్కినేని షాకింగ్ నిర్ణయం
అక్కినేని నటవారసుడు, యంగ్ హీరో అఖిల్ అక్కినేని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇటీవల విడుదలైన 'లెనిన్' సినిమాతో కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే.. అఖిల్ కు సంబంధించిన ఓ పర్సనల్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అదే అఖిల్ అక్కినేని సిటిజన్ షిప్ గురించి.. ఆయన ఇండియన్ సిటిజనా? అమెరికన్ సిటిజనా? అసలు నిజం ఏంటంటే!
కాలిఫోర్నియాలో జన్మించిన అఖిల్
అక్కినేని అఖిల్ 1994 ఏప్రిల్ 8న అమెరికాలోని కాలిఫోర్నియా లోని సాన్ జోస్ నగరంలో జన్మించారు. తండ్రి నాగార్జున అక్కినేని తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నటుడు కాగా, తల్లి అమల అక్కినేని నటి. అఖిల్ అమెరికాలో జన్మించారు. దీంతో అక్కడి చట్టాల ప్రకారం అఖిల్‌కు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది. దీంతో ఆయనకు అమెరికా పాస్‌పోర్ట్ కూడా ఉంది. చిన్ననాటి విద్యను హైదరాబాద్‌లోని చైతన్య విద్యాలయంలో ప్రారంభించిన అఖిల్, కొంతకాలం ఆస్ట్రేలియాలో చదువుకున్నారు. తిరిగి హైదరాబాద్‌లోని ఓక్‌రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యను పూర్తి చేశారు. అనంతరం నటనపై ఆసక్తితో న్యూయార్క్‌లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ & ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సు చేశారు.

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరో వరకు ప్రయాణం
అఖిల్ చిన్నతనంలోనే 'సిసింద్రీ' సినిమాతో బాలనటుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 'మనం' చిత్రంలో అతిథి పాత్రలో కనిపించి, తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇక 2015లో 'అఖిల్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. భారీ ఓపెనింగ్స్ అందుకున్నా.. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అనంతరం హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ, వీటిలో కొన్ని చిత్రాలు పరవాలేదనిపించినా, అఖిల్‌కు బాక్సాఫీస్ వద్ద భారీ బ్రేక్ ఇవ్వలేకపోయాయి.
'లెనిన్'తో కెరీర్‌కు కొత్త ఊపు
ఇటీవల విడుదలైన 'లెనిన్' సినిమాతో అఖిల్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ లాగా మారిందనే చెప్పాలి. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా... రిలీజ్ తర్వాత మంచి వసూళ్లు సాధిస్తూ ఆయన కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా నిలిచింది. నిర్మాతల ప్రకటన ప్రకారం.. ఈ సినిమా 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల రూపాయల కలెక్ట్ చేసింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా త్వరలోనే 100 కోట్ల మార్క్‌ను దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
అమెరికన్ సిటిజనా? ఇండియన్ సిటిజనా?
తాజాగా అఖిల్ అక్కినేని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో అఖిల్ పౌరసత్వంపై ప్రశ్న ఎదురైంది. "మీకు అమెరికన్ సిటిజన్‌షిప్ ఉందా? ఇండియన్ సిటిజన్‌షిప్ ఉందా? లేక ఆస్ట్రేలియన్ సిటిజన్‌షిప్ ఉందా?" అని అడగగా ఆయన సూటిగా సమాధానం ఇచ్చారు. "నేను అమెరికా పౌరుడిని (American Citizen). నా వద్ద అమెరికా పాస్‌పోర్ట్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఆ పౌరసత్వాన్ని వదులుకునే ప్రక్రియలో ఉన్నాను. ఇంకొన్ని నెలల్లో పూర్తిగా భారతీయుడిని (Indian Citizen)అవుతాను." అని అఖిల్ తెలిపారు. అంతేకాకుండా, 'ఏది ఏమైనా నేను ఇండియన్. మేరా భారత్ మహాన్'అంటూ వెల్లడించారు.
అమెరికాలో జన్మించినందున పుట్టుకతో అమెరికా పౌరసత్వం వచ్చినప్పటికీ, తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్ మొత్తం భారతదేశంతో ముడిపడి ఉండటంతో భారతీయ పౌరసత్వాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా పౌరసత్వాన్ని త్యజించే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ తో చాలా కాలంగా ప్రచారంలో ఉన్న పుకార్లకు తెరపడిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications




