భీమదేవరపల్లి బ్రాంచి సినిమా కామెడీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అంజి వల్గమాన్, సాయి ప్రసన్న, బలగం తాత సుధాకర్ రెడ్డి, రాజవ్వ, అభిరామ్, కీర్తి లత, రూపా శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించారు. . ఈ సినిమాకి దర్శకత్వం రమేష్ చెప్పాలా వహించారు. డాక్టర్ బత్తిని కీర్తిలతా గౌడ్, రాజా నరేందర్ సంయుక్తంగా నిర్మించారు. శుద్దాల అశోక్ తేజ, సంజయ్ మహేష్ వర్మ సాహిత్యం అందించగా.. చరణ్ అర్జున్ స్వరాలు సమకూర్చారు. కే. చిట్టిబాబు కెమెరామెన్ గా వ్యవహరించగా.. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.
రిలీజ్
జూన్ 23న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యింది.
కథ
నిరాక్ష్యరాస్యత ఎక్కువగా ఉన్న తెలంగాణ ప్రాంతంలో భీమదేవరపల్లి గ్రామానికి ఓ శుభవార్త అందుతుంది. ప్రతీ ఒక్కరు జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. కాస్త చదువున్న వ్యక్తి ప్రభుత్వం డబ్బులు వేస్తుందని పుకారు లేపడంతో గ్రామస్తులంతా బ్యాంక్ ఖాతాలు తెరుస్తారు. ఆ క్రమంలో జంపన్న (అంజి వల్గుమాన్) ఖాతాలో లక్షల రూపాయలు జమ అవుతాయి. బ్యాంక్ ఖాతాలు తెరువాలని కేంద్ర చెప్పగానే గ్రామస్థుల్లో నెలకొన్న పరిస్థితి ఏమిటి? చదువురాని గ్రామస్థులను దళారీలు ఎలా తప్పుదోవ పట్టిస్తారు? ప్రజల అమాయకత్వాన్ని చూసి బ్రోకర్లు ఎలా దండుకొంటారు? బ్యాంక్ ఖాతాలో డబ్బు పడిన తర్వాత జంపన్న పరిస్థితి ఏమిటి? జంపన్న ఖాతాలో డబ్బు పడిన తర్వాత మిగితా గ్రామస్థుల్లో ఎలాంటి ఆశపుట్టింది? గ్రామస్థులను దళారి ఎలా వాడుకొన్నాడు? ఇంతకు జంపన్న ఖాతాలోకి ఎక్కడి నుంచి డబ్బు వచ్చి పడింది? అనే ప్రశ్నలకు సమాధానమే భీమదేవరపల్లి బ్రాంచి సినిమా కథ.
ట్రైలర్
అందమైన, అమాయకమైన ఓ పల్లెటూరు కథ ఇది. రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తున్న నేపథ్యంలో రాసుకున్న కథలా ఈ సినిమా ఉండబోతోంది. అనుకోకుండా తమ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు పడితే ప్రభుత్వాలు ఇచ్చాయని అనుకొని, ఆ డబ్బులు మొత్తాన్నీ ఖర్చు చేసేస్తే, ఆ తర్వాత తలెత్తిన పర్యవసనాలు ఈ విధంగా ఉన్నాయనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక అంతకంటే ముందు అమాయక పల్లెటూరి ప్రజలు, వారి అభిమానాలు, ప్రేమలు ఈ సినిమా కోసం లీడ్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. అప్పనంగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసి తీరా కట్టాల్సి వచ్చినప్పుడు నెలకొన్న ఇబ్బందులు, ఆపై పనిలో పనిగా ఈ ఉచిత పథకాలపై టీవీ డిబేట్లు ఇలా చాలా మలుపులు తిరిగినట్లు ట్రైలర్లో చూపించారు.