గూడుపుఠాణి సినిమా యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సప్తగిరి, నేహా సోలంకి, రఘు కుంచె, రఘు కురుమంచి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె ఎమ్ కుమార్ వహించారు. నిర్మాతలు పరిపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ యాదవ్ కలిసి నిర్మించారు. సంగీతం ప్రతాప్ విద్యాసాగర్ అందించారు.
గిరి (సప్తగిరి), సిరి (నేహా సోలంకి) పీకల్లోతు ప్రేమలో ఉంటారు. పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో వారిని ఎదురించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొంటారు. ఎవరికి చెప్పకుండా ఊరికి దూరంగా పారిపోయి దట్టమైన అడవి ప్రాంతంలోని ఓ పురాతన ఆలయంలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతారు. అయితే ప్రేమించుకోవడానికి ముహుర్తం అక్కర్లేదు.. కానీ పెళ్లికి ముహుర్తం అవసరమని చెప్పి పురోహితుడు వారి పెళ్లిని వాయిదా వేస్తారు. అనుకోకుండా ఆ పురాతన ఆలయానికి తాళం వేయడంతో గిరి, సిరి అందులో చిక్కుకుపోతారు. ఇలాంటి పరిస్థితిలో అమ్మవారి నగలను దోచుకోవడానికి ఓ ఊరి పెద్ద (రఘు కుంచె) తన అనుచరులతో గుడిలోకి వస్తాడు. నగలు దోచుకొని వెళ్తుండగా తన కంటికి కనిపించిన సిరిని రేప్ చేసి చంపడానికి ప్రయత్నిస్తాడు. గూడుపుఠాణి చిత్రంలో గిరి, సిరి ప్రేమ కథ ఏంటి? వారి పెళ్లిని పురోహితుడు ఎందుకు వాయిదా వేస్తాడు. ఆలయాల దోపిడి సమయంలో ఊరి పెద్ద అరాచకాలు ఏమిటి? తన చేతికి చిక్కిన సిరిని ఊరి పెద్ద, అతడి అనుచరులు ఏం చేశారు? తన ప్రియురాలిని దక్కించుకోవడానికి గిరి ఏం చేశాడు. ఊరి పెద్ద దురాగతాలకు ఎవరు ముగింపు పలికారు? సిరి, గిరి ప్రేమ కథకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే గూడుపుఠాణి సినిమా.