రాక్షసుడు సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, వినోథ్,సుజనే గోర్గే, రాజీవ్ కనకాల, సూర్య, రాధా రవి, నాన్ సరవనన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రమేష్ వర్మ వహించారు మరియు నిర్మాత సత్యనారాయణ కోనేరు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఘిబ్రాన్ అందించారు.
కథ
అరుణ్(బెల్లంకొండ సాయి శ్రీనివాస్) ఫిల్మ్ మేకర్ అవ్వాలనే డ్రీమ్‌తో ఇండస్ట్రీకి వచ్చి అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా సైకోలు, ఉన్మాదులు, మతిస్థిమితం సరిగా లేని వ్యక్తులు చేస్తున్న హత్యలపై రీసెర్చ్ చేసి ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేయాలనేది అతడి కోరిక. చాలా మంది నిర్మాతలను కలిసి తన వద్ద ఉన్న కథ గురించి చెప్పినా అందరూ బావుందని మెచ్చుకునే వారే తప్ప ఇలాంటి కథలు కమర్షియల్‌గా వర్కౌట్ కావు అని ఏదో ఒక సాకుతో తిరస్కరిస్తూ ఉంటాడు. ఇటు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేక పోవడం, మరో వైపు కుటుంబ సభ్యుల ఒత్తిడితో చేసేది ఎస్ఐ ఉద్యోగంలో చేరుతాడు. అరుణ్ ఉద్యోగంలో చేరిన తర్వాత 16 ఏళ్ల అమ్మాయి అత్యంత కిరాతకంగా హత్య చేయబడుతుంది. అప్పటికే ఇలాంటి నేరాలపై పరిశోధన చేసిన ఉన్న అరుణ్... ఇది సైకో చేసే హత్యగా గుర్తిస్తాడు. మొదట అతడు చెప్పింది డిపార్టుమెంటు వారు నమ్మక పోయినా... వరుసగా అలాంటి నేరాలే జరుగుతుండటంతో డిపార్టుమెంట్ కూడా అరున్ దారిలోకి వస్తుంది. ఆ సైకోను పట్టుకునే క్రమంలో ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. చివరకు పోలీస్ డిపార్ట్‌మెంటే ఇబ్బందులో పడుతుంది. మరి ఈ కేసు అరుణ్ ఎలా చేధించాడు? ఆ సైకో ఎవరు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అనేది తర్వాతి కథ.