రామ రామ కృష్ణ కృష్ణ సినిమా డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్, అర్జున్, ప్రియా ఆనంద్, బిందు మాధవి, నాసర్, శాయాజీ షిండే తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీవాస్ నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలుసమకుర్చారు.
కథ
పల్లెటూరు కుర్రాడు అయిన రామ కృష్ణ(రామ్) మెళ్ళో ఓ వైపు రాముడు, మరోవైపు కృష్ణుడు ఉన్న బిళ్ళ ఉంటుంది. అవసరాన్ని బట్టి రామ, కృష్ణ అవతారాలు మారుస్తూ అన్యాయం చేసే వారి పని పనిపడుతూంటాడు. ఇక ఆ ఊళ్ళోకి ఐదు సంవత్సరాల క్రిందట అశోక్ దేవా(అర్జున్) తన ఇద్దరు చెల్లుళ్ళని తీసుకుని ముంబయి నుంచి వచ్చి గుట్టుగా బ్రతుకుతూంటాడు. ఇంతకీ అశోక్ దేవా ఎవరంటే...ముంబయిలో భాషా టైపులో ఓ డాన్ గా ఎదిగి వెలిగి, ఆ క్రమంలో తన భార్యని పోగొట్టుకుని అస్త్ర సన్యాసం పుచ్చుకుని ఈ పల్లెకు చేరుకున్న వ్యక్తి. అయితే అశోక్ చేతిలో దెబ్బతిన్న విలన్ ముంబై డాన్ పవార్ (వినీత్ కుమార్) ను మాత్రం పగతో రగులుతూంటాడు. ఈ క్రమంలో రామకృష్ణ అనుకోకుండా ముంబై వెళ్ళి ఈ విలన్ డాన్ తో తలపడతాడు. మరో ప్రక్క అశోక్ చెల్లిని(ప్రియా ఆనంద్) రామకృష్ణ ప్రేమిస్తాడు. చివరకు తమ ఉమ్మడి శత్రువైన డాన్ ని ఎలా అంతమొందించి, అశోక్ చెల్లిని వివాహం చేసుకున్నాడనేది మిగతా కథ.