టార్చర్ చేసి.. తెలుగులో నాపై అలా బ్యాన్.. పల్లవి గౌడ షాకింగ్ కామెంట్స్
తెలుగు బుల్లితెరపై కన్నడ నటుల డామినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఏ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ చూసినా వారిదే హవా. హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా అన్ని చోట్లా కన్నడిగులే కనిపిస్తున్నారు. తమ అవకాశాలకు గండి కొడుతున్నారంటూ తెలుగు నటీనటులు బహిరంగంగానే తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. అయితే అందం, తెలుగు చక్కగా మాట్లాడుతూ ఉండటం తదితర కారణాలతో కన్నడిగులకు తెలుగులో అవకాశాలు దక్కుతున్నాయి.
సీరియల్స్‌లోనే కాదు.. బుల్లితెరపై ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లోనూ కన్నడిగులే కనిపిస్తున్నారు. ఇక కొన్నాళ్ల క్రితం తెలుగు టాప్ కామెడీ షో జబర్దస్త్‌కు ఏకంగా కన్నడ అమ్మాయి సౌమ్యారావును యాంకర్‌గా తీసుకురావడం కలకలం రేపింది. దీనిపై పలువురు విమర్శలు చేశారు కూడా. తెలుగు వాళ్లకు కన్నడ ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వడం లేదని.. అలాంటప్పుడు కన్నడిగులకు ఇక్కడ పెద్ద పీట వేయడం ఏంటంటూ మండిపడ్డారు. అయితే కన్నడిగులు తమ ప్రతిభను నిరూపించుకుంటూ అవకాశాలను దక్కించుకుంటున్నారు. అయితే కన్నడ నటి పల్లవి గౌడపై కొన్నేళ్ల క్రితం బ్యాన్ విధించడం తెలుగు టీవీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. దీనికి దారి తీసిన పరిస్ధితులపై ఓ ఇంటర్వ్యూలో ఆమె షేర్ చేసుకున్నారు.

బెంగళూరుకు చెందిన పల్లవి గౌడ 2010లో తొలుత మనే ఒందు మూరు బాగిళు అనే కన్నడ సీరియల్‌లో నటించారు. అనంతరం 2011లో జీ తెలుగులో టెలికాస్ట్ అయిన పసుపు కుంకుమ సీరియల్‌తో తెలుగులో అడుగుపెట్టారు. ఆ తర్వాత సావిత్రి, చదరంగం, సూర్యకాంతం, కృష్ణ ముకుంద మురారి తదితర సీరియల్స్‌లో నటించారు. దీనితో పాటు తెలుగులో పలు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో ప్రసారమవుతున్న షోలలో పాల్గొన్నారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం సీరియల్స్‌లో కొన్ని సినిమాలలోనూ నటించింది పల్లవి. తన అందం, అభినయంతో తెలుగువారిని ఆకట్టుకున్న ఈ బ్యూటీపై తెలుగు బుల్లితెర ఇండస్ట్రీ బ్యాన్ విధించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఏ కారణం వల్ల పల్లవిపై నిషేధం విధించారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. దీనికి అప్పట్లోనే ఓ ఇంటర్వ్యూలో పల్లవి చెక్ పెట్టారు.
నేను నా సెకండ్ సీరియల్ చేస్తున్నప్పుడు చిక్ మంగళూరులో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి వచ్చింది. నేను నా టీమ్‌తో మాట్లాడి ఇందుకోసం పర్మిషన్ తీసుకున్నాను. అటు పక్క వాళ్లు కూడా స్టోరీలో మార్పులు చేసుకుంటున్నారు. అయితే నేను చేస్తున్న తెలుగు సీరియల్ టెలికాస్ట్ ఎపిసోడ్ అయిపోయే వరకు ఏ సీరియల్ చేయకూడదు. నేను కూడా చేయను అని చెప్పేశాను, అయితే బెంగళూరులో సినిమా షూటింగ్ కోసం వెళ్తే 25 రోజులు ఇరుక్కుపోయాను. వెళ్లేముందు ఇక్కడ అగ్రిమెంట్‌లో సంతకం చేశాను, పర్మిషన్ కూడా తీసుకున్నాను, కానీ నాకు ఆ సీరియల్ కోసం రావాల్సిన పేమెంట్ మాత్రం రావడం లేదు. దీని గురించి ప్రతిరోజూ అడగాలన్నా నాకు ఇబ్బందిగా ఉండేది. అలాగేనని సరిపెట్టుకుని 2 నెలల పాటు పారితోషికం తీసుకోకుండానే నటించానని పల్లవి తెలిపారు.
డబ్బు గురించి అడిగితే రేపు, ఎల్లుండి అంటూ వాయిదా వేశారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఆ సీరియల్‌లో కొనసాగడం కరెక్ట్ కాదని అనుకున్నా.. మీరు పేమెంట్ ఇవ్వడం లేదు, నేను వేరే సీరియల్‌లో చేస్తానని తేల్చి చెప్పేశా. వాళ్లు మాత్రం అలా చేయడం కుదరదు.. నువ్వు అగ్రిమెంట్‌లో సంతకం చేశావు కదా అన్నారు. వాళ్ల నిర్ణయం కోసం వెయిట్ చేస్తుండగా ఓ రోజున నా ఫోన్‌కు మెసెజ్ వచ్చింది. అందులో నన్ను తెలుగు ఇండస్ట్రీలో బ్యాన్ చేసినట్లుగా ఉంది. దీనికి నేనేం షాక్ కాలేదు.. మా మధ్య ఎలాంటి గొడవ జరగలేదు, కేవలం ఛాటింగ్‌లోనే పేమెంట్ గురించి అడిగేదానిని. ఈ బ్యాన్ కూడా 6 నెలలో, ఏడాదో నాకు తెలియదు. ఇంతలోనే నాకు మంచి ఆఫర్ వచ్చింది.. అదే సమయంలో కరోనా వైరస్ రావడంతో మలయాళం వైపు వెళ్లాను. ఆ సీరియల్ ముగిశాక కన్నడంలో మూవీస్ చేశా. మంచి స్టోరీ దొరికితే తెలుగులో చేస్తానని అప్పుడే చెప్పాను, దొరికింది వచ్చేశాను అని పల్లవి గౌడ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో ప్రసారం కానున్న బిగ్‌బాస్ తెలుగు 10లో కంటెస్టెంట్‌గా పల్లవి గౌడ అడుగుపెడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications


