RRRపై క్రిస్టోఫర్ నోలన్ ప్రశంసలు.. రాజమౌళీ మూవీపై ది ఒడిస్సీ డైరెక్టర్ ఏమన్నారంటే?
క్రిస్టోఫర్ నోలన్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్స్ తెరకెక్కించిన లెజెండరీ డైరెక్టర్. ఆకట్టుకునే కథనం, భారీ విజువల్ ఎఫెక్ట్స్, ఊహాకందని కథలతో సినీ ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. ఫాలోయింగ్, మెమెంటో, ఇన్‌సోమ్నియా, బ్యాట్‌మెన్ బిగిన్స్, ది ప్రెస్టిజ్, ది డార్క్ నైట్, ఇన్‌సెప్షన్, ది డార్క్ నైట్ రైజెస్, ఇంటర్‌స్టెల్లర్, డంక్రిక్, టెనెంట్, ఓపెన్‌హైమర్ ఇలా ఆయన తీసిన సినిమాలు ఒక్కో కళాఖండంలా నిలిచిపోయాయి.
ప్రస్తుతం ది ఒడిస్సీతో ప్రపంచాన్ని మరో లోకంలోకి తీసుకెళ్తున్నారు నోలన్. తెరపై భారీతనానికి, అద్భుతమైన స్టోరీ టెల్లింగ్‌కు పెట్టింది పేరైన ఈ దర్శక దిగ్గజం ఓ భారతీయ సినిమాను మెచ్చుకున్నారు. అది ఏదో కాదు తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన ఆర్ఆర్ఆర్. ది ఒడిస్సీ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ భారతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమాలపై ప్రశంసలు కురిపించారు క్రిస్టోఫర్ నోలన్.

తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిదే. ఈగ, బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచం చూపును టాలీవుడ్ వైపు తిరిగేలా చేశారు. భారతీయ సినిమా అంటే హిందీ ఇండస్ట్రీయే అని దశాబ్ధాలుగా ఉన్న భ్రమల్ని ఆయన తొలగించారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో జక్కన్న మరో మెట్టు పైకెక్కారు. అసాధ్యమనుకున్న ఆస్కార్ అవార్డ్‌ను సైతం సాధించి చరిత్ర సృష్టించారు. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్‌తో ప్రపంచాన్ని డ్యాన్స్ చేయించారు దర్శకధీరుడు. ఆర్ఆర్ఆర్ మూవీపై జాతీయ, అంతర్జాతీయ దర్శకులు అప్పట్లోనే ప్రశంసలు కురిపించారు. విడుదలై 4 ఏళ్లు కావొస్తున్నప్పటికీ ఆర్ఆర్ఆర్ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్‌పై క్రిస్టోఫర్ నోలన్ ప్రశంసలు కురిపించారు. గ్లోబల్ సినిమా రీచ్ గురించి యాంకర్ ప్రశ్నించగా.. ఆయన తనదైన రీతిలో స్పందించారు. గతంలో సినిమా పంపిణీ వ్యవస్థలు ప్రపంచంలోని వేర్వేరు చిత్ర పరిశ్రమలను, భాషలను విడివిడిగా ఉంచేవి. కానీ ఇప్పుడు అలాంటి సరిహద్దులు చెరిగిపోయాయి. అమెరికా థియేటర్‌లలో ఆర్ఆర్ఆర్ సినిమా సాధించిన విజయం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఒక ప్రాంతీయ సినిమాలో అమెరికా లాంటి అతిపెద్ది మార్కెట్‌లో అడుగుపెట్టి.. ప్రేక్షకులను ఆదరణను దక్కించుకుని ఘన విజయం సాధించింది. ఇది ప్రపంచ నలుమూలలా ఉన్న మిగిలిన దర్శకులకు సైతం తమ చిత్రాలను గ్లోబల్ ఆడియన్స్‌కు చేరువ చేయడానికి అవకాశాలను సూచిస్తోందని నోలన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఎక్స్‌లో షేర్ చేసి ఈ లెజెండరీ డైరెక్టర్‌కి కృతజ్ఞతలు తెలిపింది.
కాగా.. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్‌ను తెరకెక్కించారు. అజయ్ దేవగణ్, ఆలియా భట్, శ్రియా శరణ్, సముద్రఖని తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను 550 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించారు. 2022 మార్చి 25న విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.


Click it and Unblock the Notifications


