ఆ సినిమా నుంచి అల్లు అర్జున్ అవుట్.. బన్నీని అవమానించిన టాప్ డైరెక్టర్
అల్లు అర్జున్.. ఐకాన్‌స్టార్‌గా భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకునే నటుల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన తన కష్టం, ప్రతిభతో ఈ స్థాయికి చేరుకున్నారు. అయితే ఇదంతా రాత్రికి రాత్రి వచ్చేయలేదు.. దీని వెనుక ఎన్నో కష్టాలు, అవమానాలు ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే కుటుంబానికి వారసుడు అయినప్పటికీ అల్లు అర్జున్ కూడా పలుమార్లు అవమానాలను ఎదుర్కొన్నారు. స్టార్ రైటర్ చిన్నికృష్ణ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వివరాల్లోకి వెళితే..
దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు చేతుల మీదుగా గంగోత్రి సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు అల్లు అర్జున్. ఆర్య, ఆర్య , దేశముదురు, హ్యాపీ, రేసుగుర్రం, అల వైకుంఠపురంలో, పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ తదితర సినిమాలతో టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు అల్లు అర్జున్. నిజానికి బన్నీ తొలి సినిమా గంగోత్రి కాదట.. దీని వెనుక ఉన్న వాస్తవాలను బయటపెడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు రచయిత చిన్నికృష్ణ.

నరసింహ నాయుడు, ఇంద్ర, సీమ సింహం, గంగోత్రి, బద్రీనాథ్, జీనియస్ తదితర సినిమాలకు రచయితగా పనిచేసి హిట్ సినిమాలను అందించారు చిన్నికృష్ణ. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుల్లో ఆయన కూడా ఒకరు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కెరీర్ తొలినాళ్లలో జరిగిన సంఘటనలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు చిన్నికృష్ణ. మీరు తొలికథ రాసిన అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా హీరోగా ఆ స్థాయికి రావడం ఎలా అనిపిస్తోందని యాంకర్ అడగ్గా.. దానికి చిన్నికృష్ణ స్పందించారు.
తల్లీదండ్రులకు ఎంతో గౌరవంగా ఉంటుంది. కానీ అతనిని పరిచయం చేయడానికి పడ్డ ఇబ్బందులు చాలా ఉన్నాయి, తెరవెనుక పెద్ద యుద్దమే జరిగింది. ఇండస్ట్రీలో చాలామందికి నచ్చలేదు.. నాతోనూ శత్రుత్వం పెట్టుకున్నారు. కొన్ని విషయాలు బయటకు చెప్పకూడదు.. నేను ఆ గంగమ్మ తల్లిని నమ్ముకుని పనిచేసుకుంటూ వెళ్లాను. ఇంద్ర తర్వాత రజనీకాంత్ గారితో చేయాల్సిన సినిమాను కూడా పక్కనపెట్టి నేనే పోరాటం చేశాను. 12 సంవత్సరాలు గ్యాప్ రావడానికి కూడా కారణం అదే. ఈ పరిణామాలన్నీంటిపై ఒక బుక్ రాశాను.. ఈ విషయాలన్నీ అందులో ఉంటాయి, వాళ్ల పేర్లు కూడా చాలా క్లారిటీగా రాశానని చిన్నికృష్ణ తెలిపారు.
తేజ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా? అతను అల్లు అర్జున్‌ని హీరోగా అనుకుని తర్వాత తీసేశాడు. ఇది బాధపడే విషయమే కదా? మెగా ఫ్యామిలీ అంటే, అల్లు అరవింద్ గారు అంటే ఏంటీ? ఇండస్ట్రీలో వాళ్లది చాలా పెద్ద ఫ్యామిలీ కదా? అలాంటి కుటుంబానికి చెందిన పిల్లోడిని హీరోగా తీసేయడం అంటే జోక్ కాదు. అదే జయం సినిమా.. నితిన్ హీరో, చాలా పెద్ద హిట్. జయంలో హీరోగా ఫస్ట్ అల్లు అర్జున్‌ని అనౌన్స్ చేశారు. మా అందరికీ పార్టీ కూడా ఇచ్చారు. రెండో రోజో, మూడో రోజో మళ్లీ పేపర్‌లో హీరోగా నితిన్ పేరు కనిపించింది. దాంతో నేను డెర్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది.. రజనీకాంత్ గారితో ప్రయాణం చేయాల్సిన గేర్.. మళ్లీ ఫస్ట్ గేర్ వేసి గంగోత్రి చేయాల్సి వచ్చింది. అల్లు అర్జున్ నా గురించి చెప్పడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ విషయాలన్నీ బుక్‌లో ప్రస్తావించాను అని చిన్నికృష్ణ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications


