బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలు.. రామ్ చరణ్ 'పెద్ది' సత్తా.. టాప్‌లో 'ధురంధర్'!
భారతీయ సినిమా ఇండస్ట్రీకి 2026 శుభారంభాన్ని ఇచ్చిందనే చెప్పాలి. జనవరి నుంచి జూన్ వరకు విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేశాయి. కరోనా తర్వాత తొలి ఆరు నెలల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఏడాదిగా 2026 నిలిచింది. బాక్సాఫీస్ గణాంకాలను పరిశీలిస్తే.. ప్రేక్షకులు మళ్లీ పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు విడుదలైన సినిమాలు కలిపి 6,398 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించాయి.
2023లో కరోనా తర్వాత అత్యధికంగా 94.3 కోట్ల మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. ఇప్పుడు 2026 రెండో అర్ధభాగంలో భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. 'రామాయణ: పార్ట్ 1', 'కింగ్', 'టాక్సిక్', 'ఫౌజీ', 'జైలర్ 2', 'అవెంజర్స్: డూమ్స్‌డే', 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే', 'ది ఒడిస్సీ' వంటి చిత్రాలు రానుండటంతో ఈ ఏడాది 100 కోట్ల మంది ప్రేక్షకుల మార్క్ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక జూన్ నెల కూడా బాక్సాఫీస్‌కు మంచి ఊపునిచ్చింది. ఈ నెలలో విడుదలైన సినిమాలు కలిపి 1,038 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేశాయి. 2026లో ఇప్పటివరకు ఆరు నెలల్లో నాలుగు నెలలు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించడం గమనార్హం. జూన్ నెలలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'పెద్ది' నిలిచింది. గత మూడు సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే.. తొలి ఆరు నెలల కలెక్షన్లు మొత్తం ఏడాది బాక్సాఫీస్‌లో సుమారు 42 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అదే ట్రెండ్ కొనసాగితే.. 2026లో మొత్తం భారతీయ బాక్సాఫీస్ 15 వేల కోట్ల రూపాయల మార్క్ దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
200 కోట్ల క్లబ్‌లో ఆరు సినిమాలు
2026 తొలి ఆరు నెలల్లో ఇండియన్ బాక్సాఫీస్ పూర్తిగా భారీ సినిమాల హవా కొనసాగింది. జనవరి నుంచి జూన్ వరకు విడుదలైన చిత్రాల్లో ఆరు సినిమాలు 200 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్‌లో చోటు దక్కించుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో నాలుగు సినిమాలు మాత్రమే ఈ ఘనత సాధించగా, ఈసారి ఆ సంఖ్య 6కు చేరింది. మరోవైపు 100 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్‌లో చేరిన సినిమాల సంఖ్య మాత్రం 17 నుంచి 13కు తగ్గింది. అంటే కొద్ది పెద్ద సినిమాలే ఎక్కువ వసూళ్లను తమ ఖాతాలో వేసుకున్నాయని తాజా బాక్సాఫీస్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక 2026 తొలి అర్ధభాగంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'ధురంధర్: ది రివెంజ్' నిలిచింది. ఈ సినిమా ఏకంగా 1,277 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అంతేకాదు, జనవరి నుంచి జూన్ వరకు నమోదైన మొత్తం ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లలో దాదాపు 20 శాతం వాటా ఈ ఒక్క సినిమా నుంచే రావడం విశేషం. ఇక 'బోర్డర్ 2' సినిమా 379 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఇక రామ్ 'పెద్ది' సినిమా 282 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి వసూళ్లు సాధించి పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. జూన్ నెలలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'పెద్ది' నిలవడం విశేషం.
టాలీవుడ్ నుంచి 'మన శంకర వర ప్రసాద్ గారు' కూడా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా 255 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక తమిళ సినిమా 'కరుప్పు' 229 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించి ఐదో స్థానంలో నిలిచింది. అలాగే 'భూత్ బంగ్లా' 203 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి 200 కోట్ల క్లబ్‌లో చేరిన మరో సినిమాగా నిలిచింది. ఈ రెండు చిత్రాలు కూడా తమ భాషల్లో భారీ విజయాలను నమోదు చేశాయి.
200 కోట్ల మార్క్‌ను అందుకోలేకపోయినా, పలువురు స్టార్ హీరోల సినిమాలు 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు నమోదు చేశాయి. 'ది రాజాసాబ్' 172 కోట్ల రూపాయలు, 'వెల్కమ్ టు ది జంగిల్' 164 కోట్ల రూపాయలు, 'వాజా 2' 141 కోట్ల రూపాయలు, 'దృశ్యం 3'129 కోట్ల రూపాయలు, 'రాజా శివాజీ' 113 కోట్ల రూపాయలు, కాక్‌టెయిల్ 2'103 కోట్ల రూపాయలు, 'అబ్సెషన్' 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించి టాప్ గ్రాసింగ్ చిత్రాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల బాక్సాఫీస్ గణాంకాలను పరిశీలిస్తే.. భారీ బడ్జెట్ సినిమాలే మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయని స్పష్టమవుతోంది. చిన్న, మధ్య తరహా సినిమాల కంటే స్టార్ హీరోల భారీ చిత్రాలే ఎక్కువ వసూళ్లు సాధిస్తున్నాయి.


Click it and Unblock the Notifications




