100 కోట్లు ఆషామాషీ కాదు.. సమంతపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, నటన, కష్టపడి పనిచేసే ధోరణితో ఆమెను స్టార్ హీరోయిన్ల సరసన నిలబెట్టింది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఫ్యామిలీ డ్రామా 'మా ఇంటి బంగారం'సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటి.. ఈ రికార్డు క్రియేట్ చేసిన మొదటి లేడీ ఓరియెంట్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇలాంటి స్టార్ హీరోయిన్ సమంతపై హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నారంటే?
ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. కంటెంట్ ప్రాధాన్యత, వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు తమిళంలో వరుస సినిమాలతో అలరిస్తుంది. తాజాగా 'ఓ.! సుకుమారి' సినిమాతో ముందుకు రాబోతున్నారు. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. ఇటీవల వరుసగా విడుదలైన తెలుగు సినిమాలు మంచి విజయాలు సాధించడం పరిశ్రమకు ఎంతో శుభపరిణామమని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన 'పెద్ది', సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం', అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందడం టాలీవుడ్‌కు మంచి ఊపునిచ్చిందన్నారు. ఇదే జోష్‌లో త్వరలో విడుదల కానున్న 'ఓసుకుమారి' కూడా మంచి విజయాన్ని అందుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సమంత నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా గురించి ఐశ్వర్య రాజేష్ ప్రత్యేకంగా మాట్లాడారు. హీరోయిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఒక చిత్రం రూ.100 కోట్ల వసూళ్లు సాధించడం సాధారణ విషయం కాదని అన్నారు. కమర్షియల్ హీరోల సినిమాలకు భారీ వసూళ్లు రావడం కొత్త విషయం కాకపోయినా, ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం మాత్రం ఇండస్ట్రీ చరిత్రలో ప్రత్యేకమైన ఘట్టమని పేర్కొన్నారు.
హీరోయిన్ ఆధారిత సినిమాల భవిష్యత్తు గురించి కూడా ఐశ్వర్య రాజేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సమంత ఒక్కరే కాదు... మరికొంత మంది హీరోయిన్లు కూడా ఇలాంటి విజయాలు అందుకోవాలి. ఇండస్ట్రీలో నలుగురు లేదా ఐదుగురు హీరోయిన్లు వరుసగా హిట్లు కొడితేనే నిర్మాతల్లో మరింత నమ్మకం పెరుగుతుంది. అప్పుడు మహిళా ప్రధాన కథలపై పెట్టుబడులు పెట్టేందుకు వారు మరింత ఆసక్తి చూపుతారు" అని చెప్పారు.
ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ, "హీరోల సినిమాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధిస్తేనే అలాంటి కథలకు డిమాండ్ పెరుగుతుంది. ప్రేక్షకులు కూడా ఇలాంటి చిత్రాలను ఆదరిస్తున్నారని నిర్మాతలకు నమ్మకం కలుగుతుంది. అప్పుడు మరింత మంది దర్శకులు, నిర్మాతలు మహిళా ప్రధాన కథలతో ముందుకు వస్తారు" అని అభిప్రాయపడ్డారు.
ఐశ్వర్య రాజేష్ సమంతను ప్రత్యేకంగా "ఈ విషయంలో సమంత గారు నిజంగా గొప్ప ఉదాహరణ. ఒక హీరోయిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా రూ.100 కోట్లు వసూలు చేయడం ఆషామాషీ విషయం కాదు. అది ఆమె స్టార్‌డమ్‌కు మాత్రమే కాదు, కథను నమ్ముకుని ప్రేక్షకులు థియేటర్లకు వచ్చిన విజయానికి కూడా నిదర్శనం. 'మా ఇంటి బంగారం' సమంత కెరీర్‌లో మైలురాయిగా నిలిచే చిత్రమని నేను నమ్ముతున్నాను" అంటూ కొనియాడారు. ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications





