ధోని సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రకాష్ రాజ్, ముగ్దా గాడ్సే, ఆకాష్ పూరి, రాధిక ఆప్టే, నాజర్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, మురళి శర్మ, గొల్లపూడి మారుతీరావు, హేమ, తలైవాసల్ విజయ్, శ్రీతేజ, కస్తూరి సుచి, ప్రభుదేవా(గెస్ట్ రోల్), మహేంద్ర సింగ్ ధోనీ(అతిథి పాత్ర) తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి నిర్మాత, కథ, దర్శకత్వం: ప్రకాష్ రాజ్ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకుర్చారు.
కథ
సుబ్రమణ్యం(ప్రకాష్ రాజ్) ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి. పిల్లలకు ఆస్తులు ఇవ్వక పోయినా వారి భవిష్యత్ బాగుండాలంటే మంచి చదువు చెప్పించాలని భావించే వ్యక్తి. పిల్లలను చదివించడానికి చాలా కష్ట పడుతుంటాడు. కూతురు కావేరి(శ్రీతేజ), కొడుకు కార్తీక్(ఆకాష్)లను మంచి స్కూల్లో చేర్పిస్తాడు. కార్తీక్ కు మాత్రం చదువుపై ఆసక్తి ఉండదు. మహేంద్ర సింగ్ ధోనీలా గొప్ప క్రికెటర్ కావాలని కలలు కంటుంటాడు. ఈ క్రమంలో పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. క్రికెట్ టోర్నమెంటులో మేజర్ రోల్ పోషించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కార్తీక్ కు కోచ్ (నాజర్) ప్రోత్సాహం కూడా ఉంటుంది.
అయితే తరచూ కార్తీక్ చదువులో ఫెయిల్ అవుతుండటంతో అతని తండ్రి సుబ్బును పిలిపించిన ప్రిన్సిపాల్ ఇలా అయితే స్కూల్ నుంచి తీసేస్తాం అని వార్నింగ్ ఇస్తాడు. దీంతో కార్తీక్ తో క్రికెట్ కోచింగ్ మాన్పించి ట్యూషన్లో చేర్పిస్తాడు సుబ్బు. అయినప్పటికీ కార్తీక్ పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉండటంతో సహనం కోల్పోయిన సుబ్బు కొడుకుపై చేయి చేసుకుంటాడు. దీంతో కార్తీక్ తలకు బలమైన గాయం అవుతుంది. దీంతో సుబ్రహ్మణ్యాన్ని పోలీసులు అరెస్టు చేస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అనేది తెరపై చూడాల్సిందే.