డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, పూజ హెగ్దే, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళి, శతృ, మురళి శర్మ, ప్రభాకర్, హరిస్ ఉత్తమన్, జీవా, రావు రమేష్, తనికెళ్ళ భరణ తదితరులు ఇతర ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హరీష్ శంకర్ వహించారు మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు.
కథ
బెజవాడకు సమీపంలోని సత్యనారాయణపురం అనే అగ్రహారానికి చెందిన బ్రహ్మణ కుటుంబానికి చెందిన వాడు దువ్వాడ జగన్నాథం (అల్లు అర్జున్) తండ్రికి అన్నపూర్ణ క్యాటరింగ్‌ను నడుపుతుంటాడు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు వంటలు చేస్తుంటారు. తండ్రికి దువ్వాడ సహకరిస్తుంటాడు. కానీ దువ్వాడకు అన్యాయమంటే సహించదు. చిన్నతనం నుంచే అన్యాయాలను, అక్రమాలను, చెడును ఎదురిస్తుంటాడు. ఆవేశం ఎక్కువ. బ్రహ్మణ కుటుంబంలో పుట్టిన వాడికి ఆవేశం ఉండకూడదు అనే నెపంతో దువ్వాడ జగన్నాథానికి మెడలో రుద్రాక్షతో కూడిన మాలను వేస్తాడు. దానిని తన చేతులతో తీయకూడదని ఒట్టు వేయించుకొంటాడు తండ్రి (తనికెళ్ల భరణి). ఓ పెళ్లి కార్యక్రమంలో పూజా హెగ్డేను కలుస్తాడు. మొదటి చూపులోనే ప్రేమలో పడుతాడు. అయితే పెళ్లిలో ఆటపట్టించడానికే చనువుగా ఉన్నానని, పెళ్లి, ప్రేమ వ్యవహారాలు తనకు తగవని దువ్వాడ జగన్నాథానికి స్పష్టం చేస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో జగన్నాథం ప్రేమలో ఉన్న స్వచ్ఛతను తెలుసుకొంటుంది. ఇదిలా ఉండగ ఇలాంటి ఆవేశమున్న జగన్నాథం చిన్నతనంలోనే పోలీస్ అధికారి దృష్టిలో పడుతాడు. డీజే పేరుతో అండర్ కవర్ ఆఫీసర్‌గా పనిచేస్తూ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో మాఫియా, సంఘ విద్రోహశక్తుల పనిపడుతుంటాడు. తనకు బాబాయి (చంద్రమోహన్) లాంటి వ్యక్తి అనుకోకుండా ఆత్మహత్య చేసుకొంటాడు. ఆత్మహత్యకు అగ్రి డైమండ్ అనే సంస్థ కారణమని తెలుస్తుంది. అగ్రి డైమండ్ ఉన్న వ్యక్తులు ఎవరూ అనే పనిలో పడుతాడు. అగ్రి డైమండ్ వ్యవహారాలను రొయ్యల నాయుడు (రావు రమేశ్) గుట్టు చప్పుడు కాకుండా బినామీల పేరు మీద నడుపుతాడు. 9 వేల కోట్ల అక్రమాలకు తెర తీసిన అగ్రి డైమండ్ వెనుక దుష్ట శక్తుల పనిపట్టడానికి కంకణం కట్టుకొంటాడు. ఈ క్రమంలో దువ్వాడ జగన్నాథం అలియాస్ డీజే ఎదుర్కొన్న సమస్యలేంటి.? రొయ్యల నాయుడు గుట్టు ఎలా రట్టు చేశాడు. అగ్రి డైమండ్ బాధితులను ఎలా ఆదుకొన్నాడు. బాధితులకు ఎలా డబ్బు తిరిగి వచ్చేలా చేశాడు. వంటమనిషి అని గేలి చేసిన జగన్నాథాన్ని ఇష్టపడటానికి కారణం ఏమిటి? ఇలా ప్రశ్నలకు సమాధానమే దువ్వాడ జగన్నాథం సినిమా.