మరకతమణి సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆదిపినిశెట్టి, నిక్కిగర్లాని, కోటశ్రీనివాసరావు, బ్రహ్మనందం, ఆనంద్ రాజ్, అరుణ్ రాజ్, కామరాజ్, రామ్ దాస్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ ఆర్ కె శర్వనణ్ వహించారు మరియు నిర్మాతలు రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దిబు నైనర్ థామస్ అందించారు.
కథ
అనంతపురంకు చెందిన రఘు నందన్(ఆది) అప్పులు తీర్చడం కోసం హైదరాబాద్ వచ్చి స్మగ్లింగ్‌ను వృత్తిగా ఎంచుకుంటాడు. వజ్రాలు, విలువైన రాళ్లు స్మగ్లింగ్ చేస్తుంటాడు. అయితే తన అప్పులు తీరడానికి ఇలాంటి చిన్న చిన్న డీల్స్ సరిపోవని, ఏదైనా పెద్దడీల్ వస్తే దాంతో అప్పులు మొత్తం తీర్చేసి లైఫ్ లో సెటిలవ్వాలనే ఆలోచనలో ఉంటాడు. చైనా నుండి చంగ్ అనే ఓ వ్యక్తి వచ్చి తనకు మరకతమణి కావాలని, అది తనకు అప్పగిస్తే రూ. 10 కోట్లు ఇస్తానని ఓ పెద్ద స్మగ్లర్‌ను ఆశ్రయిస్తాడు. అయితే పేరు మోసిన స్మగ్లర్లంతా ‘మరకతమణి' పేరు చెప్పగానే వణికి పోతారు. ఎన్ని కోట్లు ఇచ్చినా తాము ‘మరకతమణి' విషయంలో వేలు పెట్టబోమని తేల్చిచెతారు. మరకతమణి పేరు చెప్పగానే అందరూ భయపడటానికి కారణం.... ఆ మణి ముట్టుకున్న వారంతా చనిపోవడమే. అయితే ఇవన్నీ నమ్మని రఘు నందన్ 10 కోట్ల కోసం డీల్ ఒప్పుకుంటాడు. ఆ మణిని కనిపెడతాడు. అయితే ఆ మణి తన వద్దకు వచ్చిన తర్వాత అది ఎంత ప్రమాదకరమైనదో తెలుసుకుంటాడు. ప్రాణభయంతో అల్లాడి పోతాడు. మరి ఆ మణి వెనక ఉన్న కథేమిటి? ఆది తన ప్రాణాలు ఎలా కాపాడుకున్నాడు? అనేది తెరపై చూడాల్సిందే.