సత్తి గాని రెండెకరాలు సినిమా కామెడీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగదీశ్, అనీషా దామ, మోహన శ్రీ సురగ, రాజ్ తిరందాసు, బిత్తిరి సత్తి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అభినవ్ దందా వహించారు. సంగీతం జై క్రిష్ అందించారు.
కథ
రెండు ఎకరాల భూమికి ఆసామీ సత్తి (జగదీష్ ప్రతాప్ బండారీ) బతుకు తెరువు కోసం ఆటో నడుపుకొంటూ భార్య, ఇద్దరు పిల్లల్ని పోషించుకొంటు ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా భూమిని అమ్మకూడదని తాత చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటాడు. బతుకు తెరువే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో తన కుమార్తె గుండెలో రంధ్రం ఉందని తెలియడం, దాని ఆపరేషన్‌కు 30 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెబుతారు. ఈ క్రమంలో భూమిని అమ్మలేని పరిస్థితుల్లో.. ఓ కారులో నుంచి సూట్ కేస్ దొంగతనం చేస్తాడు. కారులో నుంచి దొంగిలించిన సూట్ కేస్‌ను ఒపెన్ చేయడానికి తన స్నేహితుడు అంజి (రాజ్ తిరన్ దాస్)తో సత్తి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? సూట్ కేస్ కోసం షిప్పింగ్ బిజినెస్ ఓనర్ లలిత్ (రియాజ్) తన అనుచరులకు ఎందుకు పురమాయిస్తాడు? రైడర్ (వెన్నెల కిషోర్) సూట్ కేస్ కోసం వెతుకుతూ ఎన్ని కష్టాలు పడ్డాడు? ఈ వ్యవహారంలో ఎస్సై నిరంజన్ రెడ్డి (బిత్తిరి సత్తి) ఎలా దర్యాప్తు చేస్తాడు? సత్తిని మోసం చేయాలని చూసిన సర్పంచ్ (మురళీధర్ గౌడ్)కు ఎలాంటి అనుభవం ఎదురైంది? సత్తి రెండెకరాల భూమిని అమ్మాడా? సత్తి, అంజికి సూట్‌కేసు ఎలాంటి కష్టాలు తెచ్చి పెట్టింది? తన కూతురుకు అంజి వైద్యం చేయించాడా? చివరకు సూట్‌కేసు వ్యవహారం సత్తికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందనే ప్రశ్నలకు సమాధానమే సత్తిగాని రెండు ఎకరాలు సినిమా.