ఉప్పెన సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ సేతుపతి తదితరులు నటించారు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి సుకుమార్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చరు.
కథ
ప్రాణం పోయినా పర్వాలేదు.. పరువు పోకూడదనే పట్టుదల ఉన్న రాయుడు ( విజయ్ సేతుపతి) ఓ గ్రామ పెద్ద. ఆయన కుమార్తె బేబమ్మ అలియాస్ సంగీత (కృతి శెట్టి)ని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు ఆశీ అలియాస్ ఆశీర్వాదం (వైష్ణవ్ తేజ్) ఈ క్రమంలో ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వారి మధ్య ప్రేమ బలపడుతుంది. ఆశీతో తిరుగుతుందనే విషయం రాయుడికి తెలిసి బేబమ్మను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తాడు. దాంతో ఆశీ, బేబమ్మ లేచిపోతారు. రాయుడు కంటపడకుండా పూరి, కోల్‌కత్తా, గ్యాంగ్ టక్ ప్రాంతాల్లో తిరుగుతారు. కానీ ఓ రోజు రాయుడికి బేబమ్మను ఆశీ అప్పగిస్తాడు. తన ప్రాణం కన్నా ప్రేమించిన బేబమ్మను ఆశీ ఎందుకు దూరం చేసుకొన్నారు? ఆశీ చేసిన నిర్వాకానికి బేబమ్మ ఎలా స్పందించింది. ఆశీ వదిలేసిన తర్వాత బేబమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది. బేబమ్మ కోసం రాయుడు ఎలా తపించాడు? ప్రేమను రాయుడు వ్యతిరేకించడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే ఉప్పెన చిత్రం కథ.