‘ఇద్దరు కూతుళ్ల కోసం తలవంచి... మా నాన్నని అలా చూడలేకపోయా’
చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్స్‌గా వెలుగొందుతున్న వారి జీవితాలను పరిశీలిస్తే.. ఈ స్టార్‌డమ్, పేరు, హోదా, డబ్బు, విజయాలు అన్నీ రాత్రికి రాత్రి వచ్చినవి కాదు. ఎన్నో అవమానాలు, ఎన్నో ఛీత్కారాలను దాటుకుని.. కన్నీళ్లను దిగమింగి తమ కృషి, పట్టుదలతో ఈ స్థాయికి చేరుకున్నారు. మరీ ముఖ్యంగా వారికి అన్ని విషయాల్లో అండగా నిలిచి ప్రోత్సహించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, సన్నిహితులు ఇలాంటి వారెందరో. తాజాగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తన కుటుంబం, తల్లిదండ్రుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..
మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే నటించిన లెనిన్ మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న విజయం రావడం ఈ చిత్ర యూనిట్‌ను భావోద్వేగానికి గురిచేసింది. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాత, అగ్రనటుడు అక్కినేని నాగార్జున, హీరో అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేలు ఈ విజయంతో కన్నీటి పర్యంతమవుతున్నారు.

కొడుక్కి ఒక్క విజయం కోసం కింగ్ అక్కినేని నాగార్జున ఎంతో శ్రమించారు. ఇప్పడు కోరుకున్న సక్సెస్ రావడంతో ఆయన ఎమోషనల్ అవుతున్నారు. నాగార్జున కన్నీరు పెట్టుకోవడం తాను చూడలేదని నిర్మాత నాగవంశీ చెప్పారంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. ఇక హీరో అఖిల్ కూడా హిట్ కొట్టి దాదాపు 11 ఏళ్లు అవుతోంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్ డిజాస్టర్ కావడంతో రేసులో నిలబడాలన్న కసితో లెనిన్ చేసి అక్కినేని అభిమానులకు విజయాన్ని కానుకగా అందించారు.
ఇదే కోవలోకి వస్తారు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. మహారాష్ట్రకు చెందిన ఈ ముద్దుగుమ్మ.. తొలుత హిందీలో చందూ ఛాంపియన్, యారియాన్ 2 సినిమాలలో నటించారు. మాస్ మహారాజా రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ మూవీతో తెలుగు తెరపై అడుగుపెట్టారు. అందం, నటనతో తెలుగు సినిమాతోనే ఆకట్టుకున్నప్పటికీ మిస్టర్ బచ్చన్ ఆడలేదు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కింగ్డమ్, రామ్ పోతినేనితో ఆంధ్రా కింగ్ తాలూకా, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన కాంత మూవీతో తమిళంలో అడుగుపెట్టారు. కెరీర్ స్టార్టింగ్‌లోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చినప్పటికీ ప్రతి సినిమా ఫ్లాప్ కావడంతో భాగ్యశ్రీపై ఐరెన్ లెగ్ ముద్రపడింది.
ఇప్పుడు లెనిన్ హిట్ కొట్టడంతో సక్సెస్‌మీట్‌లో ఆమె ఎమోషనల్ అయ్యారు. తాను కిందపడిన ప్రతిసారి అభిమానులు అండగా నిలిచారని, వారి వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను. హైదరాబాద్ నాకు కర్మభూమి.. నా ఆఖరి సినిమా కూడా ఇక్కడే చేస్తానని భాగ్యశ్రీ కంటతడి పెట్టారు. అయితే లెనిన్ సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కుటుంబాన్ని, తల్లిదండ్రుల గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.
మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం.. మా ఆర్ధిక పరిస్ధితి కూడా అంతంత మాత్రమే. బిడ్డల కోసం ఏం చేయలేకపోతున్నానని తల్లిదండ్రులు బాధపడటం చూస్తూ పెరిగా, అలాగని వారు ఎన్నడూ వెనకడుగు వేయలేదు. చిన్నప్పుడు డబ్బు అంటే ఏంటో తెలియదు, పెద్దయ్యాక డబ్బు ఎంత ముఖ్యమో అవగాహన ఉండదు. నిజానికి పచ్చిమిర్చికి 10 రూపాయలు, పాలకూరకు 10 రూపాయలు ఖర్చు చేసినట్లుగా అమ్మానాన్నలు రాసిన డైరీని నేను చూశాను. ఈ వారం 300 రూపాయలు ఖర్చయితే.. వచ్చే వారాన్ని ఎలా నెట్టుకురావాలని వారిద్దరూ లెక్కలు వేసుకునేవారని భాగ్యశ్రీ తెలిపారు.
నేను పుట్టిన కొద్దిరోజులకే నాన్న ఉద్యోగం కోల్పోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మా నాన్న వేరొకరి ముందు తలవంచి ప్రాధేయపడటం నేను చూశా. ఏదైనా ఉద్యగం ఉంటే ఇవ్వండి.. నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని ఆయన బతిమలాడేవారు. అప్పటికీ ఇప్పటికీ నా మనసులో ఒకటే ఆలోచన. మా నాన్నగారికి ఎప్పుడూ ఇలాంటి పరిస్ధితి రాకూడదు. నేను ఎదిగి ఆయన తల గర్వంగా పైకెత్తాలి.. నాలో ఉన్న ఏ ఆశయమైనా సరే అది మా తల్లిదండ్రుల కోసమేనని భాగ్యశ్రీ బోర్సే పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. భాగ్యశ్రీ సక్సెస్‌పై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications




