తండ్రిపై స్టార్ హీరోయిన్ లైంగిక ఆరోపణలు.. ఒక్క కామెంట్‌తో 22 కేసులు.. చివరకు సుప్రీంకోర్టుకు?
ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో ఎవరూ ఊహించని విధంగా అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్న హీరోయిన్. అభిమానులు ఆమెపై అమితమైన ప్రేమ కురిపించారు. ఏకంగా గుడి కట్టి, పూజలు కూడా చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె.. ప్రస్తుతం సినిమాలు, టెలివిజన్, రాజకీయాల్లోనూ చురుగ్గా కొనసాగుతున్నారు. అయితే వెండితెరపై సక్సెస్ పుల్ కెరీర్ కొనసాగించినా.. ఆమె జీవితంలో ఎన్నో వ్యక్తిగత విషాదాలు, వివాదాలు కూడా ఉన్నాయి. ఒకనొక సందర్బంలో ఆమె చేసిన ఓ కామెంట్ వల్ల ఏకంగా 22 కేసులు నమోదయ్యాయి. ఇంతకీ ఆ నటి ఎవరు?
ఆమె మరెవరో కాదు.. ప్రముఖ నటి ఖుష్బూ సుందర్. ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్. 1970 సెప్టెంబర్ 29న ముంబైలో జన్మించారు. చిన్న వయసులోనే నటనపై ఆసక్తితో బాలీవుడ్‌లో బాలనటిగా కెరీర్ ప్రారంభించారు. 1980లో విడుదలైన 'ది బర్నింగ్ ట్రైన్' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం పలు హిందీ చిత్రాల్లో నటించిన ఆమె, తర్వాత దక్షిణాది సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అలా.. తెలుగులో 'కలియుగ పాండవులు' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది ఖుష్బూ. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.

తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్, ప్రభు, సత్యరాజ్, విజయకాంత్, శరత్‌కుమార్, కార్తీక్ వంటి స్టార్ హీరోలతో నటించి ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్‌బాబు వంటి అగ్రహీరోల సరసన నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా తమిళనాడులో ఖుష్బూకు ఉన్న క్రేజ్ అసాధారణం. అభిమానులు ఆమెను ఆరాధ్యదైవంగా భావించి ఏకంగా ఆమె పేరిట గుడి నిర్మించి పూజలు చేశారు. అంటే.. ఆమె క్రేజ్ ఎలా ఉందో.. ఏ స్థాయిలో ఆమె ప్రజాదరణ పొందారో అర్థం చేసుకోవచ్చు.
చిన్ననాటి చేదు అనుభవం
ఎన్నో విజయాలను అందుకున్న ఖుష్బూ జీవితంలో తీవ్ర విషాదం కూడా ఉంది. గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తన చిన్ననాటి గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. తనకు కేవలం 8 ఏళ్ల వయసులోనే కన్న తండ్రి చేత లైంగిక వేధింపులకు గురయ్యానని ఆమె చెప్పారు. "ఆ అనుభవాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది చాలా కాలం నన్ను మానసికంగా వేధించింది. కోరుకున్నా కూడా ఆ జ్ఞాపకం నుంచి బయటపడలేకపోయాను" అని ఖుష్బూ భావోద్వేగంగా చెప్పారు. ఆమె చెప్పిన మాటలు అప్పట్లో సినీ పరిశ్రమను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి.
ఒక్క కామెంట్‌తో దేశవ్యాప్తంగా వివాదం
2005లో ఖుష్బూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'సురక్షితమైన పద్ధతులు పాటిస్తే పెళ్లికి ముందు శారీరక సంబంధాలు పెట్టుకోవడంలో తప్పు లేదు'అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు తమిళనాడులో పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు ఆమె వ్యాఖ్యలను సమర్థించగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. పలు సామాజిక, రాజకీయ సంఘాలు నిరసనలు చేపట్టాయి. ఆమె దిష్టిబొమ్మలను దహనం చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఆ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా ఖుష్బూపై దాదాపు 22 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వివిధ కోర్టుల్లో కేసులు నమోదు కావడంతో ఆమెకు న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ వివాదం క్రమంగా సుప్రీంకోర్టు వరకు చేరింది.
సుప్రీంకోర్టులో ఊరట
ఖుష్బూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, భావప్రకటనా స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని పేర్కొంది. ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రమే క్రిమినల్ నేరంగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ, ఆమెపై నమోదైన 22 కేసులను కొట్టివేసింది. దీంతో ఖుష్బూకు పెద్ద ఊరట లభించింది. సినీ కెరీర్‌లో అగ్రస్థానంలో ఉన్న సమయంలోనే ఖుష్బూ దర్శకుడు సుందర్ సి. ని వివాహం చేసుకున్నారు. సినిమాల్లో కలిసి పనిచేసే సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి, 2000లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల పెద్ద కుమార్తె అవంతిక వివాహం కూడా ఘనంగా జరిగింది.
ప్రస్తుతం ఖుష్బూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే, టెలివిజన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే సమయంలో రాజకీయాల్లో కూడా చురుగ్గా కొనసాగుతున్నారు. సామాజిక అంశాలపై తరచూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.


Click it and Unblock the Notifications




