బట్టల రామస్వామి బయోపిక్కు సినిమా గ్రామీణ కథా నేపథ్యంతో వచ్చిన రొమాంటిక్, కామెడీ చిత్రం. ఇందులో అల్తాఫ్ హుస్సేన్, లావణ్యారెడ్డి, సాత్వికా జే, శాంతి రావు, ధన్ రాజ్, భద్రం, శ్రీ చందన తదితరులు నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్, దర్శకత్వం: రాంనారాయణ్ వహించారు. నిర్మాతలు రామకృష్ణ వీరపనేని, సతీష్ కుమార్ నిర్మించారు.
కథ
తండ్రి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో పూసలు అమ్ముతున్న జయప్రద (శాంతి రావు)ను రామస్వామి (అల్తాఫ్ హుస్సేన్) చూసి తొలి చూపులోనే ప్రేమలో పడుతాడు. గ్రామ పెద్దలను ఒప్పించి జయప్రదను రామస్వామి కులాంతర వివాహం చేసుకొంటాడు. ఆ తర్వాత చీరలు అమ్ముతూ బట్టల వ్యాపారం చేస్తుంటాడు. ఆ క్రమంలో ఓ కారణంగా జయప్రద చెల్లెలు సుధ (లావణ్య రెడ్డి)ను కూడా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇక చీరెలు అమ్ముతున్న నేపథ్యంలో పక్క గ్రామానికి చెందిన వాళ్లు మరో యువతి సిరి (సాత్వికా జయ్)ని రామస్వామికి బలవంతంగా కట్టబెట్టి పెళ్లి చేస్తారు. అయితే మొదటి పెళ్లి తర్వాత బట్టల రామస్వామి జీవితంలో ఎలాంటి సంఘటనలు చేటుచేసుకొన్నాయి? ఏ పరిస్థితుల్లో రామస్వామి రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? రెండో పెళ్లి తర్వాత రామస్వామి మూడో పెళ్లిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది. మూడో పెళ్లి తర్వాత రామస్వామికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? బట్టల రామస్వామి ఏ పరిస్థితుల్లో చనిపోయాడు? నిజంగానే రామస్వామి చనిపోయాడా? అనే ప్రశ్నలకు సమాధానమే బట్టల రామస్వామి బయోపిక్కు మూవీ.