గ్యాంగ్‌స్టర్ గంగరాజు సినిమా యాక్షన్, క్రైమ్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో లక్ష్ చదలవాడ, వేదిక దత్త, వెన్నెల కిషోర్, చరణ్ దీప్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, నిహార్ కపూర్, రాజేశ్వరి నాయర్, సత్యకృష్ణ, రవితేజ, నన్నిమాల, సమ్మెట గాంధీ, రాజేంద్ర, అను మానస, లావణ్య రెడ్డి, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు.
కథ
దేవరలంక గ్రామంలో బాధ్యతలేకుండా అల్లరిగా తిరిగే యువకుడు గంగరాజు. చిన్నతనంలో తల్లి చనిపోవడంతో గారాబంగా పెరుగుతాడు. రైల్వేలో ఉద్యోగం చేసిన తండ్రి రిటైర్మెంట్ కావడంతో డిపార్ట్‌మెంట్ చేత సన్మానం పొందుతాడు. అలా సన్మానం అదుకొన్న తండ్రి సిద్దప్ప అనే గ్యాంగ్‌స్టర్ చేతిలో తీవ్ర అవమానానికి గురికావడాన్ని గంగరాజు తట్టుకోలేకపోతాడు. సిద్దప్పకు తగిన గుణపాఠం నేర్పాలని వెళ్తాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో సిద్దప్ప హత్య తన మీద పడటంతో గంగరాజు గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. గ్యాంగ్‌స్టర్ సిద్దప్ప ఎలా చనిపోయాడు? బసిరెడ్డితో గంగరాజకు వైరుధ్యం ఏమిటి? గ్యాంగ్‌స్టర్‌గా మారిన గంగరాజు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? గ్యాంగ్‌స్టర్‌గా మారిన ఇన్స్‌పెక్టర్ ఉమాదేవి (వేదిక దత్త) ఇష్టపడిన గంగరాజు తన ప్రేమను గెలిపించుకొన్నాడా? ఈ కథలో బసిరెడ్డి (చరణ్), నర్సారెడ్డి (శ్రీకాంత్ అయ్యంగార్) పాత్రలు ఏమిటి? గ్యాంగ్‌స్టర్ ఠాకూర్ (వెన్నెల కిషోర్) రోల్ ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలు తెరపైన చూడాల్సిందే.