గల్ఫ్ సినిమా రోమాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చేతన్ మద్దినేని, డింపుల్ చోపడే, సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్, పూజిత, సూత్య, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, జీవ, నల్లవేణు, ప్రభాస్ శ్రీను, తనికెళ్ళ భరణి, తోటపల్లి మధు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పి సునిల్ కుమార్ వహించారు మరియు నిర్మాత యక్కలి రవింద్ర బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రవీణ్ ఇమ్మడి స్వరాలు అందించారు.
కథ
ఉపాధి కోసం ప్రతీ ఏటా సొంత ఊరును వదిలి వలస వెళ్లే వందలాది సిరిసిల్లా చేనేత కార్మికుల్లో ఒకరిగా శివ (చేతన్ మద్దినేని) గల్ఫ్‌కు వెళ్తాడు. విమాన ప్రయాణంలో గల్ఫ్‌కు వెళ్తున్న మరో అమ్మాయి లక్ష్మీ (డింపుల్) పరిచయం అవుతున్నది. తొలిచూపులోనే వారి మధ్య ఓ ఆకర్షణ పుడుతుంది. ఆ ఆకర్షణ ఇష్టంగా మారి.. ఆ తర్వాత ప్రేమగా బలపడుతుంది. గల్ఫ్‌లో పనిచేస్తుండగా ఈ ప్రేమ జంటకు పలు కష్టాలు ఎదురవుతాయి. లక్ష్మీపై శారీరక దాడులు ఎక్కువైతాయి. లైంగిక వేధింపులు జరుగుతుంటాయి. జీవితం బాగుపడాలని పెట్టుకొన్న ఎన్నో ఆశలు కన్నీళ్లలో కరిగిపోతాయి. డబ్బు సంపాదించి కుటుంబాన్ని అప్పుల బాధను గట్టెక్కించాలనుకొన్న శివ గల్ఫ్‌లో మోసానికి గురవుతాడు. ఇలా గల్ఫ్‌లో జరుగుతున్న అన్యాయాలు, కష్టాల్లో ఉన్న బాధితుడిగా శివ మిగిలిపోతాడు. అలా కష్టాల్లో ఉన్న శివ, లక్ష్మీ తమ సమస్యలను ఎలా ఎదురించారు. గల్ఫ్‌లో వారితోపాటు భారతీయ కార్మికులు ఎలాంటి మోసాలకు గురి అవుతున్నారు అనే ప్రశ్నలకు సమాధానమే గల్ఫ్ చిత్రం.