ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, భూమిక చావ్లా, రాజీవ్ కనకాల, నరేష్ తదితరులు నటింటారు. ఈ సినిమాకి దర్శకత్వం వేణు శ్రీరామ్ వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చరు.
కథ
నాని (నాని) మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు. తల్లి చిన్నతనంలో చనిపోవడం వల్ల అన్నయ్య (రాజీవ్ కనకాల) అతనికి సర్వస్వం. అన్నయ్య జీవితంలో జ్యోతి (భూమిక చావ్లా) భార్యగా ప్రవేశించడంతో కొంత వారి మధ్య దూరం పెరుగుతుంది. వదిన కారణంగానే అన్నయ్య దూరమయ్యాడనే ఫీలింగ్‌లో ఉంటాడు నాని. ఇంతలో అన్నయ్య ఉద్యోగ శిక్షణ నిమిత్తం ఢిల్లీకి వెళ్లడం, రవాణాశాఖలో పనిచేసే జ్యోతికి వరంగల్ ట్రాన్స్‌ఫర్ కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నాని కూడా వదినతో అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. వరంగల్‌లోనే పల్లవి (సాయి పల్లవి)ని చూసి ప్రేమలో పడిపోతాడు. తొలిచూపులోనే పల్లవి పెళ్లీ చేసుకొందామని ప్రపోజ్ చేస్తుంది. ఇలా కథ సాగుతున్న తరుణం శివశక్తి ట్రావెల్స్ యజమాని శివకు జ్యోతికి మధ్య వైరం కలుగుతుంది. ఆక్రమంలో జ్యోతిని శివ చంపబోతుండగా నాని అడ్డుకొంటాడు. కానీ ఎలాగైన జ్యోతిని చంపుతానని శివ శపథం చేస్తాడు. శివతో వైరం పెరుగడానికి కారణం ఏమిటి? ఈ పరిస్థితుల్లో వదినను ఎలా రక్షించుకొన్నాడు? తొలిచూపులోనే సాయి పల్లవి పెళ్లి ప్రపోజ్ చేయడానికి వెనుక ఉన్న కారణం ఏమిటీ? ఏ ఉద్యోగం, పనిపాట లేకుండా తిరిగే నానికి పల్లవితో పెళ్లి కుదిరిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్ర కథ.