OTT Releases This Week: 'పెద్ది' నుంచి 'ఇక్కా' వరకు.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!
ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం (జూలై 6 నుంచి 12 వరకు) ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ డోస్ అయింది. థియేటర్లలో సందడి చేసిన హిట్ సినిమాలతో పాటు పలు క్రేజీ కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ్ చరణ్ 'పెద్ది' ఓటీటీ విడుదల ఈ వారంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ వారం ఓటీటీ జాబితా మీ కోసం..
రామ్ చరణ్ 'పెద్ది'
ఈ వారంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'పెద్ది'. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ కెరీర్‌లోనే నయా పాత్రలో కనిపించారు. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తొలి దశలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా కథ విజయనగరం జిల్లా నేపథ్యంలో సాగుతుంది. ప్రభుత్వ రికార్డుల్లో కూడా లేని ఓ గ్రామంలో జన్మించిన పెద్ది అనే యువకుడు కూలీ పనులు చేస్తూనే అసాధారణ క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకుంటాడు. అయితే అనూహ్య పరిస్థితుల వల్ల క్రికెట్‌ను వదిలి కుస్తీ క్రీడాకారుడిగా మారాల్సి వస్తుంది. గ్రామ గౌరవం కోసం అతడు చేసిన పోరాటమే సినిమా ప్రధాన కథ.

'పరిమళ అండ్ కో'
తమిళంలో ఇటీవల విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న సినిమా 'పరిమళ అండ్ కో'. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జయరామ్,ఊర్వశి ప్రధాన పాత్రల్లో దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన ఈ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ జూలై 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. కథ విషయానికి వస్తే.. మధ్యతరగతి కుటుంబాన్ని వేధించే ఓ స్థానిక గ్యాంగ్‌స్టర్ అనుమానాస్పదంగా హత్యకు గురవుతాడు. ఆ తర్వాత ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకోవడం, పోలీసు దర్యాప్తు, కుటుంబ సభ్యుల మధ్య జరిగే గొడవలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. జయరామ్, ఊర్వశితో పాటు మిస్కిన్, యోగిబాబు, సంజనా కృష్ణమూర్తి, అనంతిక సనిల్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.
'బాల్టీ'
మలయాళ స్టార్ షేన్ నిగమ్ హీరోగా నటించిన 'బాల్టీ'కూడా ఈ వారంలో డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు జూలై 10 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఉన్ని శివలింగం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకుంది. గ్రామీణ కబడ్డీ ఆటగాడైన బాల్టీ జీవితంలో జరిగే సంఘటనలు, కుటుంబాన్ని కాపాడేందుకు చేసే పోరాటం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. స్పోర్ట్స్, యాక్షన్, ఎమోషన్స్ ను సమాన ప్రాధాన్యం ఇచ్చిన సినిమాగా 'బాల్టీ' నిలిచింది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.
'ల్యాండ్ ఆఫ్ ఫుట్‌బాల్'
సినిమాలతో పాటు డాక్యుమెంటరీలు ఇష్టపడే ప్రేక్షకుల కోసం 'ల్యాండ్ ఆఫ్ ఫుట్‌బాల్' కూడా ఈ వారంలో విడుదల కానుంది. జూలై 10 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యే ఈ డాక్యుమెంటరీ కేరళలో ఫుట్‌బాల్ పట్ల ఉన్న అపారమైన అభిమానాన్ని ప్రపంచానికి పరిచయం చేయనుంది. గ్రామీణ మైదానాల్లో ఆడే చిన్నారుల నుంచి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ను పండుగలా చూసే అభిమానుల వరకు కేరళ ఫుట్‌బాల్ సంస్కృతిని ఎంతో సహజంగా ఈ సిరీస్‌లో చూపించారు.
'ఇక్కా'
బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా'ఇక్కా'. సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా మెయిన్ రోల్స్ లో నటించగా.. దర్శకుడు సిద్ధార్థ్ పి. మల్హోత్ర తెరకెక్కించారు. ఈ కోర్ట్‌రూమ్ లీగల్ థ్రిల్లర్ జూలై 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దాదాపు మూడు దశాబ్దాల 'బోర్డర్'సినిమాలో కలిసి నటించిన సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా మళ్లీ ఈ సినిమాలో కలిసి నటించారు. కోర్టు గదిలో ప్రత్యర్థులుగా తలపడనున్నారు. నిజాయితీకి మారుపేరుగా పేరొందిన న్యాయవాది అర్జున్ మెహ్రా పాత్రలో సన్నీ డియోల్ నటించారు.


Click it and Unblock the Notifications




