Gundeninda Gudigantalu July 4th Episode: రోహిణి మొదటి పెళ్లి రహస్యం తెలుసుకున్న మీనా.. ప్రభావతికి సత్యం షాక్!
Photo courtesy jiohotstar
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలో బాలు, మీనా చింటూ గురించి మాట్లాడుకుంటారు. స్కూల్ పేరెంట్స్ మీటింగ్‌లో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ, చింటూ మనోజ్, కల్పన కుమారుడే కావచ్చని మీనా అనుమానం వ్యక్తం చేస్తుంది. అయితే ఆధారాలు లేకుండా ఎలాంటి నిర్ణయానికి రావద్దని బాలు ఆమెకు సూచిస్తాడు. అయినప్పటికీ, మనోజ్ గతంలో కల్పనకు రహస్యంగా డబ్బులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసిన మీనా, రోహిణికి అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తుంది.
మరోవైపు ప్రభావతి బరువు తగ్గాలని నిర్ణయించుకుని డైటీషియన్‌ను ఇంటికి పిలిపిస్తుంది. బాలు ఆమె ఆహారపు అలవాట్ల గురించి సరదాగా చెప్పడంతో ఇంట్లో నవ్వులు పూస్తాయి. ఏఐ సాయంతో మూడు నెలల తర్వాత తాను ఎలా కనిపిస్తానో చూసిన ప్రభావతి మురిసిపోతుంది. అయితే వారానికి రూ.8 వేల ఫీజు అని తెలుసుకుని కూడా తగ్గేదేలే అంటూ డైట్ ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. ఈ సమయంలో మీనా కీలక నిర్ణయం తీసుకుంటుంది. డైట్ ఫుడ్ తానే తయారు చేస్తానని, అందుకు రోజుకు రూ.300 పారితోషికం ఇవ్వాలని షరతు పెడుతుంది. సత్యం కూడా ఆమెకు మద్దతు ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు.

ఇక ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ తన చినిగిన షర్ట్‌ను చూసి బాలుపై కోపం పెంచుకుంటాడు. ఇదే సమయంలో సుమతి వారి ఇంటికి రావడంతో జరిగిన ఘటన గురించి తెలుసుకుని, తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలని అంటుంది. కానీ సరైన సమయం కోసం ఎదురు చూస్తానని అరుణ్ చెబుతాడు. డాన్స్ క్లాస్‌లో చింతామణితో కలిసి మాట్లాడుతున్న ప్రభావతి మాటలు విన్న మీనా, తన వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ఇద్దరూ కలిసి కుట్ర పన్నారని గ్రహిస్తుంది. దీంతో ప్రభావతికి, చింతామణికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
చివర్లో బాలు, మీనాకు సర్‌ప్రైజ్‌గా బంగారు గొలుసు కొనివ్వాలనే ఉద్దేశంతో రహస్యంగా చిట్టి వేస్తాడు. మరోవైపు అత్త చేసిన మోసాన్ని గుర్తు చేసుకుని బాధపడుతున్న మీనాకు శృతి ధైర్యం చెబుతుంది. ఇదే సమయంలో ప్రభావతి కోసం తయారుచేసిన స్పెషల్ డైట్‌లో శృతి రహస్యంగా ఆముదం కలుపుతుంది. ఆ విషయం తెలియకుండా ప్రభావతి, మనోజ్ ఆ డైట్ తింటారు.
రాబోయే ఎపిసోడ్ ప్రేక్షకులకు భారీ ట్విస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో ప్రభావతి ప్రవర్తనపై శృతి, రవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మీనా ఎంత మంచిగా ఉన్నా ఆమెను తక్కువ చేసి చూడడం, చింతామణితో చేతులు కలిపి వ్యాపారాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించడం ఏమాత్రం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేస్తారు. మీనా కుటుంబంలో గొడవలు రాకూడదనే ఉద్దేశంతోనే తనకు జరిగిన అన్యాయాన్ని భర్త బాలు దగ్గర కూడా దాచిపెడుతోందని శృతి చెబుతుంది.
అప్పుడే అక్కడికి వచ్చిన సత్యం వారి మాటలు విని అసలు విషయం అడుగుతాడు. దీంతో రవి, శృతి కలిసి ప్రభావతి చేసిన పనులన్నింటినీ సత్యం ముందు వివరిస్తారు. మీనా వ్యాపారాన్ని అడ్డుకునేందుకు ప్రభావతి కాలునొప్పి, చేతినొప్పి అంటూ నాటకాలు ఆడిన విషయం, చింతామణితో కలిసి ఆమెను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించిన తీరు గురించి చెబుతారు. ఈ మాటలు విన్న సత్యం.. భార్యకు నేరుగా చెప్పడం కంటే ఆమెకు అర్థమయ్యేలా గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటాడు.
దాంతో ప్రభావతి నిర్వహిస్తున్న డాన్స్ క్లాస్‌ను కొంతకాలం నిలిపివేయాలని ప్లాన్ వేస్తాడు. తన స్నేహితుడు రంగాతో మాట్లాడి, ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయనే కారణంతో డాన్స్ క్లాసులకు ఒక నెల రోజుల విరామం ప్రకటించేలా చేస్తాడు. మరుసటి రోజు ఉత్సాహంగా క్లాస్‌కు వచ్చిన ప్రభావతికి కామాక్షి షాక్ ఇస్తుంది. ఇంట్లో బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయని, కాబట్టి ప్రస్తుతం క్లాసులు నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చెబుతుంది.
ఈ సమయంలో చింతామణి తన ఇంట్లోనే క్లాసులు పెట్టాలని సూచిస్తుంది. అయితే బాలు తెలుసుకుంటే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని ప్రభావతి వెనక్కి తగ్గుతుంది. కామాక్షి కూడా అదే విషయాన్ని గుర్తుచేయడంతో చింతామణి ప్లాన్‌కు బ్రేక్ పడుతుంది. చివరికి డాన్స్ క్లాసులకు నెల రోజుల పాటు సెలవు ప్రకటించాల్సిన పరిస్థితి ప్రభావతికి ఏర్పడుతుంది.
ఇక కథలో అసలు ట్విస్ట్ తర్వాత కనిపిస్తుంది. సుమతి ఫోన్ చేసి ఓ కుటుంబంలో పూజ కార్యక్రమానికి పూల దండలు కావాలని మీనాను కోరుతుంది. మొదట కొత్త వాళ్ల ఇంటికి వెళ్లేందుకు మీనా ఇష్టపడకపోయినా, సుమతి ఒత్తిడితో అంగీకరిస్తుంది. మరుసటి రోజు పూలతో అరుణ్ వాళ్ల ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్లిన మీనాకు అరుణ్ తల్లి రాజేశ్వరి ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలుకుతుంది.
మాటల మధ్య ఆ ఇంటి పెద్ద కుమారుడు ప్రమాదంలో మరణించాడని, అప్పటికి అతనికి భార్యతో పాటు ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడని ఆమె కన్నీటి పర్యంతమవుతూ చెబుతుంది. భర్త చనిపోయిన తర్వాత తన కోడలు బిడ్డను తీసుకుని వెళ్లిపోయిందని, తర్వాత మరో పెళ్లి కూడా చేసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అనంతరం తన కొడుకు పెళ్లి ఫోటోను మీనా చేతిలో పెడుతుంది.
ఆ ఫోటోను చూసిన మీనా ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. ఎందుకంటే అందులో కనిపించిన మహిళ మరెవరో కాదు.. రోహిణి. దీంతో ఇంతకాలం రోహిణి దాచిపెట్టిన మొదటి పెళ్లి రహస్యం, ఆమె గత జీవితం, కుటుంబ సభ్యుల నుంచి దాచిన నిజాలు అన్నీ ఒక్కసారిగా మీనా ముందు ప్రత్యక్షమైనట్లు చూపించారు. అదే సమయంలో సుమతి కూడా ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోతుంది. అయితే మీనా వెంటనే ఆమెను మౌనంగా ఉండమని సైగ చేస్తుంది.
ఇంతలో అరుణ్ అక్కడికి రావడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారుతుంది. మరోవైపు రోహిణి చేసిన మోసాన్ని ఎలా బయటపెట్టాలి? ఈ నిజాన్ని బాలు, సత్యం, కుటుంబ సభ్యులకు ఎలా చెప్పాలి? అనే ఆలోచనలో మీనా కనిపిస్తుంది. రాబోయే ఎపిసోడ్‌లో రోహిణి జీవితాన్ని మార్చేసే భారీ ట్విస్ట్ చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిజంగానే రోహిణి గతం పూర్తిగా బయటపడుతుందా? లేక కథలో మరో కొత్త మలుపు ఉంటుందా? అన్నది పూర్తి ఎపిసోడ్ ప్రసారమైతేనే తెలియనుంది.


Click it and Unblock the Notifications





