బాలీవుడ్ కంటే టాలీవుడ్ బెస్ట్.. మహేష్ బాబు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందినా.. తెలుగు సినీ పరిశ్రమ గురించి గొప్పగా మాట్లాడింది. ఒకప్పుడు మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. తాజాగా బాలీవుడ్ కంటే టాలీవుడ్ ఎంతో క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా పనిచేసే పరిశ్రమ అంటూ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు.. తెలుగు సినిమా సెట్స్, కథల ఎంపిక, మేకింగ్ స్టైల్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ టాలీవుడ్‌పై ప్రశంసలు కురిపించిన ఆ హీరోయిన్ ఎవరు? ఆమె ఏమేం చెప్పారంటే..
ఆ హీరోయిన్ ఎవరు కాదు.. 90'స్‌లో అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటి సోనాలి బింద్రే. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది. తెలుగు సినీపరిశ్రమతో ఆమెకు ఏర్పడిన అనుబంధం ఉంది. మహేష్ బాబు 'మురారి' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. తర్వాత మెగాస్టార్ చిరంజీవితో 'ఇంద్ర', అక్కినేని నాగార్జునతో 'మన్మథుడు', 'శంకర్ దాదా ఎంబీబీఎస్'వంటి సినిమాల్లో నటించి, మెప్పించింది. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తక్కువ సినిమాలే చేసినా, ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

ఇటీవల ఓ చిట్ చాట్ లో పాల్గొన్న సోనాలి బింద్రే.. బాలీవుడ్‌తో పోలిస్తే తెలుగు సినిమా పరిశ్రమ ఎందుకు ఎంతో ప్రత్యేకమో తన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో క్రమశిక్షణ,సమయపాలన, ప్రణాళికాబద్ధమైన పని విధానం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. షూటింగ్‌లు నిర్ణయించిన సమయానికే ప్రారంభమై, అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తవుతాయని, ప్రతి ఒక్కరూ సమయానికి విలువ ఇస్తారని తెలిపారు.
బాలీవుడ్‌లో కొన్ని సందర్భాల్లో షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యమవడం, ప్రణాళికల్లో మార్పులు రావడం సహజమేనని చెప్పిన సోనాలి.. తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రం నిర్మాతల నుంచి దర్శకులు, టెక్నీషియన్ల వరకు అందరూ ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తారని కొనియాడారు. ఒక నటిగా తన సమయానికి, తన పనికి ఇచ్చిన గౌరవం ఎప్పటికీ మరచిపోలేనిదని అన్నారు. అంతేకాదు, కథల ఎంపిక విషయంలో కూడా టాలీవుడ్ ముందంజలో ఉంటుందని సోనాలి అభిప్రాయపడ్డారు.
గతంలో బాలీవుడ్‌లో హీరోయిన్ల పాత్రలు ఎక్కువగా గ్లామర్‌కే పరిమితమయ్యేవని, కానీ తెలుగు సినిమాల్లో మాత్రం నటనకు అవకాశమున్న పాత్రలు తనకు లభించాయని చెప్పారు. మురారి, ఇంద్ర, మన్మథుడు వంటి సినిమాల్లో చేసిన పాత్రల వల్లే తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ తనను అభిమానంతో గుర్తుంచుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే టాలీవుడ్ సినిమా సెట్స్‌లో అందరికీ కుటుంబ సభ్యుల్లా ఆత్మీయత కనిపిస్తుందని, ప్రతి చిన్న విషయంపై కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారని అన్నారు.
సోనాలి బింద్రే వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా స్టేజ్-4 క్యాన్సర్ బారినపడిన ఆమె కొంతకాలం సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. అమెరికాలో చికిత్స తీసుకుని, కుటుంబ సభ్యుల అండతో క్యాన్సర్ ను జయించారు. ఆ సమయంలో అభిమానులు కూడా మానసిక బలాన్ని అందించారని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. క్యాన్సర్‌ను జయించిన తర్వాత సోనాలి తన రెండో ఇన్నింగ్స్‌ను ఎంతో జాగ్రత్తగా కొనసాగిస్తున్నారు.
హీరోయిన్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ రోల్స్‌ను ఎంచుకుంటున్నారు. వెబ్ సిరీస్‌లు, కంటెంట్ ఆధారిత కథల్లో నటిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల 'ది బ్రోకెన్ న్యూస్' వంటి ప్రాజెక్టులతో మరోసారి తన నటనను నిరూపించుకున్నారు. ప్రస్తుతం మరోసారి తెలుగు సినిమాల్లో నటించాలనే ఆసక్తి కూడా ఆమె వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంచి కథ,సరైన పాత్ర దొరికితే తప్పకుండా టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారట. అందుకే ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications





