వారణాసి మూవీపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.. గ్లింప్స్ ఆలస్యానికి కారణమదే అంటూ..
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. సినీ, రాజకీయ ప్రముఖుల గురించి తరచూ జ్యోతిష్య అంచనాలు వెల్లడించే ఆయన, తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి'సినిమా, తేజ సజ్జ నటించిన'మిరాయ్' సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ రెండు చిత్రాల్లో వామాచారం అంశాన్ని ప్రస్తావించడం వల్లే ప్రారంభ దశలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
వేణు స్వామి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వామాచారం అనే అంశాన్ని ప్రధానంగా టచ్ చేసిన చిత్రాలు రెండే ఉన్నాయని చెప్పారు. అందులో ఒకటి తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతున్న 'మిరాయ్', మరొకటి రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'వారణాసి'అని పేర్కొన్నారు. ఈ రెండు సినిమాల్లో కూడా శక్తి ఆరాధన, తాంత్రిక సంప్రదాయాలకు సంబంధించిన అంశాలను కథలో భాగంగా చూపించారని ఆయన వ్యాఖ్యానించారు.

మొదట మిరాయ్ సినిమా గురించి వేణుస్వామి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో దశ మహావిద్యల్లో ఒకరైన బగలాముఖి దేవి అంశాన్ని ప్రస్తావించారని అన్నారు. తన జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం.. అలాంటి శక్తివంతమైన ఆధ్యాత్మిక అంశాలను సినిమాల్లో ప్రస్తావించినప్పుడు మొదట్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అదే కారణంగా సినిమా ప్రారంభమైనప్పటి నుంచి నటుడు మంచు మనోజ్ అనేక వివాదాలు, వ్యక్తిగత సమస్యల్లో చిక్కుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
"బగలాముఖి అమ్మవారికి దశ మహావిద్యల్లో అత్యంత ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి శక్తికి సంబంధించిన అంశాన్ని సినిమాలో చూపించడం వల్ల ప్రారంభంలో ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి. మంచు మనోజ్ జీవితంలో వరుసగా ఇబ్బందులు వచ్చినట్లు కనిపించింది.ఇదంతా నా జ్యోతిష్య విశ్లేషణ మాత్రమే" అని వేణు స్వామి అన్నారు.
అలాగే రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' సినిమా గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో ఛిన్నమస్త దేవికి సంబంధించిన అంశాలను చూపించనున్నారని పేర్కొంటూ, సినిమా ప్రారంభ కార్యక్రమం నుంచే కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయని అన్నారు. లాంచింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ, ఆధ్యాత్మికంగా ఇలాంటి అంశాలను స్పృశించినప్పుడు మొదట ప్రతిబంధకాలు రావడం సహజమని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
వామాచారం గురించి వివరిస్తూ వేణు స్వామి.. "వామాచారం అంటే చాలామందికి అపోహలు ఉన్నాయి. భక్తితో చేసే ఆరాధనకు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం లభిస్తుంది.ఒకరు 100 కోరుకుంటే 200 లభిస్తుందనే భావన ఈ సంప్రదాయంలో ఉంటుంది. అయితే ఆ ఫలితాలకు ముందు కొన్ని పరీక్షలు, అడ్డంకులు ఎదురవుతాయని విశ్వాసం ఉంది" అని తెలిపారు.
ప్రారంభంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, చివరికి ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుందని తన జ్యోతిష్య అభిప్రాయాన్ని వెల్లడించారు. మిరాయ్, వారణాసి వంటి కూడా తొలిదశలో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, చివరికి మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతకుముందు టాలీవుడ్ సినీ ప్రముఖులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండను 'కష్టపడే వ్యక్తి' అని, ప్రభాస్‌ను 'కారణ జన్ముడు', సమంతను 'ఫైటర్',చిరంజీవిని 'కష్టంతో పైకి వచ్చిన కారణ జన్ముడు', సీనియర్ ఎన్టీఆర్‌ను 'యుగ పురుషుడు', రామ్ చరణ్‌ను 'కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి', రాజమౌళిని 'కారణ జన్ముడు',మహేష్ బాబును 'అందగాడు'గా అభివర్ణించారు.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ మఖ నక్షత్రంలో జన్మించారని, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను 'పర్‌ఫెక్ట్ పొలిటీషియన్'గా ప్రశంసించిన వేణు స్వామి, గతంలో ఆయన రాజకీయాలకు సరిపోరని చెప్పిన విషయంపై కూడా చర్చ నెలకొంది. ఆయన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications





